breaking news
Pipe Line blast
-
పేలిన తాటిపూడి పైప్లైన్
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సమయం గురువారం రాత్రి 9.15... ఎవరి దుకాణాలు వారు కట్టి వెళ్లిపోతున్నారు.. ఇంతలో పెద్ద శబ్దం.. ఏం జరిగిందో తెలియదు... పెద్ద ఎత్తున నీటితో కాలనీల జలమయం... భయాందోళనలో జనం... ఇదీ గోపాలపట్నం పెట్రోల్ బంకు జంక్షన్లో తాటిపూడి పైపులైన్ పగలడంతో ఎదురైన పరిస్థితి. గోపాలపట్నం పెట్రోల్ బంకు జంక్షన్లో గురువారం రాత్రి ఓ మెడికల్ షాపు కింద నుంచి తాటిపూడి పైపులైన్ భారీ శబ్దంతో పేలింది. దీంతో జంక్షన్లో ఉన్న వారితో పాటు సమీప ప్రాంతాల ప్రజల భయాందోళన చెందారు. ఇక్కడి షాపు కింద నుంచి ఉధృతంగా నీరు ప్రవహించి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం గోడల నుంచి భారీగా పారింది. ఇలా వుడాకాలనీ, 30 పడకల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, బాపూజీనగర్ ప్రాంతాలకు నీరు పారింది. వర్షం రాకుండా ఇంత భారీగా నీటి ప్రవాహమేంటని జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న జోనల్ కమిషనర్ చుక్కల సత్యనారాయణ హుటాహుటిన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. కమిషనర్ హరినారాయణకు కూడా తెలియజేశారు. అధికారులు సిబ్బందితో హుటాహుటిన చేరుకొని తాటిపూడి పైప్లైన్ సప్లయ్ నిలిపేశారు. చర్యలకు రంగంలోకి దిగారు. గతంలో ఇక్కడే తాటిపూడి పైపులైను పేలిందని, మళ్లీ ఇలా జరగడంపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని పనులు, అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే సమస్య జఠిలమైందని ఆరోపిస్తున్నారు. -
గెయిల్ పై 304 సెక్షన్ కింద కేసు నమోదు
-
నగరం ఘటన: గెయిల్ పై 304 సెక్షన్ కింద కేసు నమోదు
రాజమండ్రి: నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనలో గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. విచారణ ప్రకారం ఈ కేసులో మరిన్ని సెక్షన్ల విధించే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో శరవేగంగా విచారణ జరుగుతోందని.. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం కూడా దర్యాప్తులో భాగమైంది.