breaking news
pharmacy College
-
సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కళాశాల ప్రిన్సిపాల్ ఈడ్పుగంటి సుధీర్‌బాబు, ఇంటర్నల్ ఆడిటర్ శివరామప్రసాద్ పక్కదారి పట్టించారు. ఏకంగా రూ.1.62 కోట్లను స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఆర్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కైంకర్యం చేసిందిలా..: సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేశారు. ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్టు ఓ నకిలీ జీవో సృష్టించి.. విద్యార్థులు చెల్లించిన ఫీజుల్లో నుంచి 40 శాతం సొమ్మును స్వాహా చేశారు. ఇలా సుమారు రూ.1.62 కోట్ల మేర సొమ్ములు కాజేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ప్రిన్సిపాల్, ఆడిటర్‌తోపాటు రాణి సంయుక్త, విజయకుమార్ అనే ఉద్యోగులకూ ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. -
లోపాలపై తేల్చండి
సింగిల్ జడ్జి తీర్పును సవరించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సవరించింది. పిటిషన్లు దాఖలు చేసుకున్న కాలేజీల్లో తనిఖీలు చేయడం కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జేఎన్టీయూల ఆధ్వర్యంలో 25 బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆయా కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చినా.. వాటిల్లో చేపట్టే ప్రవేశాలు తనిఖీల అనంతరం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నదే తమ తపన అని.. అందుకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొంది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ ధర్మాసనానికి అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కాలేజీల్లో తనిఖీల కోసం 25 బృందాలు ఏర్పాటు చేయాలి. వీటిల్లో ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరు ఉంటారు. హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీల్లో 48 గంటల ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయాలి. ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాల మేరకు బోధనా సిబ్బంది, సాంకేతిక సహాయ సిబ్బంది, పాలనా సిబ్బంది, లేబొరేటరీలు ఉన్నాయా, లేవా అన్న అంశాలకు మాత్రమే తనిఖీలను పరిమితం చేయాలి. బోధనా సిబ్బంది సహా అంతా తమ ఫోటోలు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లతో తనిఖీ బృందాల ముందు హాజరుకావాలి. తనిఖీ బృందాల సభ్యులకయ్యే ఖర్చుల నిమిత్తం ఒక్కో కాలేజీ జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ వద్ద రూ.2లక్షలను వారంలోగా డిపాజిట్ చేయాలి. ఈ డబ్బు డిపాజిట్‌తో సంబంధం లేకుండానే తనిఖీలు జరగాలి. రంజాన్ దృష్ట్యా మైనారిటీ కాలేజీల్లో ఈనెల 20లోపు తనిఖీలు వద్దు. తనిఖీ బృందాలు తనిఖీలు చేసిన 3 రోజుల్లోగా తమ నివేదికలను సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్‌కు, జేఎన్టీయూకు అందచేయాలి. ఈ 25 బృందాల్లో ఉండే సభ్యుల వివరాలను 3 రోజుల్లో ఏఐసీటీఈ తెలియచేయాలి. తనిఖీలన్నీ ఆగస్టు 1 లోపు పూర్తికావాలి. ఈలోపు సింగిల్ జడ్జి ఆదేశించిన మేర ప్రవేశాల ప్రక్రియను కొనసాగించవచ్చు. అయితే ఈ కాలేజీల్లో ప్రవేశాలు ధర్మాసనం తుది తీర్పునకు లోబడి ఉంటాయి. ఒకవేళ తనిఖీ బృందాల నివేదిక ఆధారంగా ఏదైనా కాలేజీకి అఫిలియేషన్ తిరస్కరిస్తే.. ఆ కాలేజీలో చేరిన విద్యార్థులను జేఎన్టీయూ మరో కాలేజీలో చేర్పించాలి. అది సాధ్యం కాకుంటే ఆ విద్యార్థులకు వడ్డీతో సహా ఫీజును వాపసు ఇవ్వాలి. ఆ కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులకు ఈ ఉత్తర్వుల గురించి తెలియచేయాలి. అఫిలియేషన్ కోసం కోర్టుకు వచ్చిన కాలేజీలు ఏదైనా కోర్సు అఫిలియేషన్ వద్దనుకుంటే.. గురువారం ఉదయం 10 గంటలకల్లా జేఎన్టీయూకు తెలపాలి. ఈ తనిఖీలను అఫిలియేషన్ లేని కోర్సులకు మాత్రమే పరిమితం చేయాలి. అవసరమైన పక్షంలో అఫిలియేషన్ వచ్చిన కోర్సులకు సంబంధించిన బోధనా సిబ్బంది వివరాలను తనిఖీ బృందాలు కోరవచ్చు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఆ అధికారం జేఎన్టీయూదే.. తనిఖీ బృందాల్లో ఎవరుండాలన్న విషయంలో జేఎన్టీయూహెచ్, కాలేజీల న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఏఐసీటీఈ తనిఖీలు చేస్తే తమకు ఇబ్బంది లేదని.. జేఎన్టీయూతోనే సమస్య కాబట్టి స్వతంత్ర వ్యక్తులకు తనిఖీల బాధ్యతలను అప్పగించాలని కాలేజీల తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కాలేజీల్లో బోధనా సిబ్బంది, లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం జేఎన్టీయూదేనని ఏఐసీటీఈ తరఫు న్యాయవాది కూడా చెప్పారు. కాగా.. తమ కాలేజీల్లో లోపాలు వెతుకుతున్న జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలోని కాలేజీల్లోనే సరైన సదుపాయాలు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలని కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి పేర్కొన్నపుడు.. కోర్టు హాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాలేజీల యజమానులు, ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కోర్టు ప్రతిష్టను దిగజార్చడమేనని పేర్కొంటూ.. వారందరినీ కోర్టు హాల్ నుంచి బయటకు పంపించింది.