breaking news
people attracted
-
అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ బడులను పరిరక్షించుకోవడానికి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు గ్రామ పంచాయతీ, ఎస్ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. దీంతో అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు అనేక పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చిన విద్యాశాఖ తాజాగా మరో తొమ్మిది పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలోని మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, ఆర్మూర్ మండలంలోని మంథని, కోమన్పల్లి, సుర్బిర్యాల్, డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, కమలాపూర్, నవీపేట్ మండలంలోని నాళేశ్వర్, రెంజల్ మండలంలోని దూపల్లి పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆరు, ఏడు తరగతుల్లో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో అనుమతి ఇవ్వగా వచ్చే ఏడు ఎనిమిదో తరగతికి ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృత పరచనున్నారు. దశల వారీగా పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. ఆంగ్ల మాధ్యమంపై ఉన్న మోజుతో ఎంతో మంది విద్యార్థులను వారి తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలను మూసివేయడం లేదా రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. అయితే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటే విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తేనే పాఠశాలల పరిరక్షణ జరుగుతుందనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు, ఎస్ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం అమలుకు మూడేళ్ల కిందనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను స్వీకరించారు. అయితే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. చివరకు ఈ విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యాశాఖ అనుమతులను ఇస్తోంది. కాగా కొత్తగా ఉపాధ్యాయుల పోస్టులను కోరడం, అదనపు గదులు, ఇతర సౌకర్యాలను అడగకుండా షరతు విధించి ఆంగ్ల మాధ్యమం అమలునకు అనుమతిని విద్యాశాఖ అధికారులు ఇస్తున్నారు. అనేక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఈ ఏడు అనుమతులను ఇవ్వడంతో వచ్చే ఏడాది కొత్తగా అనుమతులను కోరే పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ప్రభుత్వ బడులను పరిరక్షించడానికి ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు అడిగిన వెంటనే అనుమతులు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
మనిషి పోలికలతో మేకపిల్లలు!!
పులి కడుపున పులిపిల్లే పుడుతుంది.. మేక కడుపున మేక పిల్లే పుడుతుంది అంటారు కదూ. కానీ, కర్ణాటకలోని షోలాపూర్ అనే గ్రామంలో ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కంది. అయితే.. ఆ రెండూ పుట్టకముందే మరణించాయి. అచ్చం మనిషి పోలికలతోనే ఉన్న మగ పిల్ల ఉదయం 6.30 గంటలకు పుట్టగా, రెండోది ఐదు గంటల తర్వాత ఆడ మేకపిల్ల పుట్టింది. ఆ మేకను తాను నాలుగేళ్లుగా పెంచుతున్నానని, అది ఇప్పటికి పది పిల్లలను కనగా, అన్నీ బాగానే ఉన్నాయని మేక యజమాని భాస్కర్ తెలిపారు. ఈ విషయం గ్రామంలో విస్తృతంగా వ్యాపించింది. దాంతో జనం వందల సంఖ్యలో ఆ పిల్లలను చూసేందుకు భాస్కర్ ఇంటి ముందు క్యూకట్టారు. కొంతమందయితే, ఇలా పుట్టడం అరిష్టమని, అందువల్ల వెంటనే వాటిని పూడ్చేయాలని కూడా సలహా ఇచ్చారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) వైద్య పరిభాషలో దీన్ని ఫీటల్ అనసర్టా అంటారని, అంటే.. తల్లి కడుపులో ఉండాల్సిన ఉమ్మనీరు పిల్ల శరీరంలోకి వెళ్లిపోతే ఇలా జరుగుతుందని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవదాస్ చెప్పారు. జన్యు పరమైన తేడాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. చనిపోయిన మేకపిల్లలను భద్రంగా ఉంచి, వాటిని మైసూరు దసరా ఉత్సవంలో ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు.