breaking news
peda gottipadu
-
ఆపదలో బాసటగా...
-
పది రోజులు గడువు ఇస్తున్నా
ఏపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హెచ్చరిక లక్ష్మీపురం ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి లేదంటే గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా ఏడుగురి మృతికి కారకుడైన బిల్డర్‌ను అరెస్టు చేయలేదు నిందితుడిని ఏపీ ముఖ్యమంత్రి కాపాడుతున్నారు బీమా సొమ్ము బిల్డర్‌కు వెళ్లేందుకు సహకరిస్తున్నారు పెదగొట్టిపాడులో బాధిత కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, అమరావతి: ‘‘ప్రభుత్వానికి పది రోజుల గడువిస్తున్నా. దుర్ఘటన జరిగిన రోజు అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలన్నీ అప్పటిలోగా అమలు చేయకపోతే బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా’’.. అని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. గుంటూరు లక్ష్మీపురంలో ఈనెల 14న రాత్రి భవన నిర్మాణంలో పనిచేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గం పెదగొట్టిపాడు గ్రామంలో పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో వచ్చేవరకు వారి పక్షాన పోరాడుతానంటూ ఆ కుటుంబాలకు ధైర్యాన్నిచ్చారు. ఏడుగురి మరణానికి కారణమైన బిల్డర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని సర్కారును ప్రశ్నించారు. ఇంతటి ఘాతుకానికి కారణమైన బిల్డర్‌ను ఏపీ ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఎందుకు అరెస్టు చేయలేదు? దుర్ఘటన జరిగిన నాటికి కార్మికులకు బిల్డర్ 10 రోజుల కూలి బాకీ పడ్డారు. 30-35 అడుగుల లోతులో ఫౌండేషన్‌కు సంబంధించిన పనులు చేస్తేనే ఆ కూలి ఇస్తానని, లేదంటే ఇవ్వనని బెదిరించాడు. మట్టి పడుతోందని, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయలేమని కార్మికులు చెప్పినా పట్టించుకోలేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బలవంతంగా పనిలోకి దించాడు. బిల్డర్ నిర్లక్ష్యం ఫలితంగా ఏడు నిండు ప్రాణాలు పోయాయి. ప్రమాదం జరిగిన రోజున తమకు న్యాయం చేయమని బాధిత కుటుంబాలు ధర్నా చేశాయి. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, బాధిత కుటుంబాలు చేసిన డిమాండ్లకు అంగీకరిస్తున్నామని డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 30 లక్షలు ఇస్తామని, బిల్డర్‌ను అరెస్ట్ చేస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, రూ. 5.80 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఐదు ఎకరాల భూమి ఇస్తామని హామీలు ఇచ్చారు. (డీఆర్వో సంతకం చేసిన పత్రాన్ని చూపించారు). 13 రోజుల తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి అడిగితే.. ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. ఇంత ఘాతుకానికి బాధ్యుడైన బిల్డర్‌పై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఏపీ ముఖ్యమంత్రి బిల్డర్‌ను కాపాడుతున్నారు. బీమా సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లింది? భవన నిర్మాణానికి అనుమతులు రావాలంటే.. నిర్మాణ కార్మికులకు జీవిత బీమా చేసి ఉండాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. చనిపోయినవారు రాడ్ బెండింగ్‌లో నైపుణ్యం ఉన్న కార్మికులు. ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. 13 లక్షల బీమా రావాలి. ప్రభుత్వం రూ. ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. అంటే.. బీమా, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కలిపి రూ. 18 లక్షలు అవుతుంది. మొత్తం రూ. 20 లక్షలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే బిల్డర్ నుంచి కేవలం రూ. 2 లక్షలే ఇప్పిం చారా? ఇది న్యాయమేనా? ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. బిల్డర్ నుంచి కనీసం రూ. 15 లక్షలైనా పరిహారంగా ఇప్పించాలి. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన బీమా సొమ్మును కూడా బిల్డర్ జేబులో వేసుకోవడానికి ప్రభుత్వమే సహకారం అందిస్తోంది. ఇక పేదవాడికి భరోసా ఎలా లభిస్తుంది? ఒక్కటై పోరాడదాం. ప్రభుత్వం మెడలు వంచుదాం. బాధిత కుటుంబాలకు ఆత్మీయ స్పర్శ పెదగొట్టిపాడుకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్న జగన్ వీఆర్వో కాలనీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తొలుత జొన్నలగడ్డ ప్రశాంత్ ఇంటికి వెళ్లి తల్లి మార్తమ్మను ఓదార్చారు. అధికారులు తమకిచ్చిన హామీ పత్రాన్ని జగన్‌కు చూపి న్యాయం చేయలేదంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. రూ. 30 లక్షల పరిహారం, ఇంటి స్థలం ఇచ్చి ఎన్టీఆర్ గృహకల్ప కింద ఇల్లు నిర్మిస్తామని, ఐదెకరాల పొలం ఇచ్చి తమ కుటుంబాన్ని ఆదుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలిపారు. కేవలం రూ. 10 లక్షల నగదు, రూ. 10 లక్షల చెక్కు ఇచ్చారని, చెక్కులు ఇంకా మారలేదని పరిస్థితిని వివరించారు. పదిరోజుల్లోపు పరిష్కరించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి హామీని నెరవేర్చుకుందామని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి బత్తుల సునీల్ ఇంటికి వెళ్లి తండ్రి లింగారావు, తల్లి జ్యోతిలకు ధైర్యం చెప్పారు. బూసి సలోమాన్ ఇంటికి వెళ్లి తల్లి రమాదేవి, తండ్రి కోటయ్యలను పరామర్శించారు. తర్వాత బత్తుల రాజేష్ ఇంటికి వెళ్లిన జగన్ వివాహమై పది నెలలు అయినా గడవకముందే భర్తను కోల్పోయిన సౌమ్యకు ధైర్యం చెప్పారు. తురక శేషుబాబు తల్లి సుజాతను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బత్తుల రాకేష్ భార్య మేరీని ఓదార్చారు. చివరగా జొన్నలగడ్డ సుధాకర్ ఇంటికి వెళ్లి భార్య లత, నలుగురు పిల్లలను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బాబు చర్మం మందం పశువైద్య విభాగం లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 19 రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, వాటిని నెరవేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని పశువైద్య కళాశాలను శుక్రవారం జగన్ సందర్శించి విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. వారి డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్మం మందం కాబట్టి వేగంగా స్పందించే గుణం ఉండదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా బాధపడవద్దని విద్యార్థులకు సూచించారు. మూడేళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. పశువైద్యానికి 102 ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్తిపాడు జనసంద్రం గుంటూరు నగరం లక్ష్మీపురంలో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జననేతకు కృష్ణా, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పయనమైన జగన్ పశువైద్యకళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలి పారు. అక్కడి నుంచి బయలుదేరి మిట్టమధ్యాహ్నం ప్రత్తిపాడుకు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలి కారు. జనసంద్రమైన పట్టణం దాటేం దుకు గంటకుపైగా సమయం పట్టింది. మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో పెదగొట్టిపాడుకు చేరుకుని బాధిత కుటుంబాల నివాసాలకు వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు కె.పార్థసారథి, మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, రక్షణ నిధి, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున పాల్గొన్నారు. -
పెళ్లి కళ కల్లలైన వేళ..
ప్రత్తిపాడు: మరో నెల రోజుల్లో కల్యాణ వీణ మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరులో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిన ఘటనలో వరుడు కావాల్సిన యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ఇక్కుర్తి జాన్, రాయేలు దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్నవాడైన బూసి సలోమన్ (21)కు నరసరావుపేటకు సమీపంలోని ఇక్కుర్తి రాయపాడుకు చెందిన యువతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. జూన్ 9వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గుంటూరులో రాడ్ బెండింగ్ పనికి వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలిన ఘటనలో అతను మృతి చెందాడు. పెళ్లి ఖర్చులకు డబ్బు సంపాదిస్తామని వెళ్లి అటే వెళ్లిపోయాడంటూ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.