breaking news
PC PNDT Act
-
గురువారం స్కానింగ్‌లు బంద్
భ్రూణహత్యలను నివారించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పీసీ పీఎన్డీటీ యాక్ట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని కోరుతూ గురువారం రాష్ట్రంలో అన్ని రకాల స్కానింగ్‌లను నిలిపివేయనున్నట్లు ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ చెప్పారు. అత్యవసర స్కానింగ్‌లకు మినహాయింపు ఉంటుందన్నారు. సూర్యారావుపేట డోర్నకల్ రోడ్డులోని ఏబీసీ ఇమేజింగ్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఒకరోజూ పూర్తిగా స్కానింగ్‌లు నిలిపివేస్తామని, సెప్టెంబర్ 2 నుంచి 8 వరకూ గర్భిణీలను స్కానింగ్‌లు చేయబోమన్నారు. తమ సంఘ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, అనంతర పరిణామాలపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రేడియాలజిస్ట్‌లతో పాటు, గైనకాలజిస్ట్లు స్కానింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. లోపాలివే.. తప్పు చేస్తే ఎవరికైన శిక్ష వేయవచ్చని, కానీ చిన్న లోపాలకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ మూడేళ్లు జైలు శిక్ష విధించడం సరికాదన్నారు. స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ తెల్లకోటు వేసుకోకపోయినా, నేమ్ బ్యాడ్జి ధరించకపోయినా, స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ చట్టవిరుద్ధమనే బోర్డు తనిఖీలకు వచ్చే సమయంలో కనిపించకపోయినా క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడేళ్లు జైలు శిక్ష విధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఫామ్ ఎఫ్ పూర్తి చేయడంతో కిందస్థాయి సిబ్బంది చేసిన పొరపాట్లకు రేడియాలజిస్ట్‌లను బాధ్యులను చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటిని సవరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేవంలో అసిసోయేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.రాజేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్‌ప్రసాద్, డాక్టర్ కులదీప్ చలసాని, అబ్స్టేట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శశిబాల, డాక్టర్ శ్రీలతలు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
► కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరిక ► స్కానింగ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశం కర్నూలు(హాస్పిటల్): నింబంధనలను అతిక్రమిస్తున్న స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులపై కఠినంగా వ్యవ హరిం చాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. పీసీ పీఎన్డీటీ చట్టంపై శనివారం ప్రాంతీయ శిక్షణా కేం ద్రం(మేల్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టబోయే ఆడబిడ్డను గర్భంలోనే చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ తీవ్రమైన నేరమని, ఇలాంటి ఉదంతాలను ఉపేక్షించకూడదన్నారు. సోమవారం నుంచి వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనకు రహస్యంగా నివేదిక ఇవ్వాలని నోడల్ అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలున్నారన్నారు. ఏపీలో ఈ నిష్పత్తి 1000ః943, జిల్లాలో 1000ః 930గా ఉండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ యు. రాజాసుబ్బారావు, సీపీఓ, జెడ్పీ సీఈఓపాల్గొన్నారు. సమావేశం నిర్వహించే పద్ధతి ఇదేనా.. ముందస్తు వివరాలు, చట్టానికి సంబంధించిన కాపీలు, ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా పీసీ పీఎన్డీటీ చట్టంపై నోడల్ ఆఫీసర్లుగా ఉన్న జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. వారికి ప్రొసీడింగ్స్, జాబ్‌చార్ట్, పీసీ పీఎన్డీటీ చట్టానికి సంబంధించిన వివరాలు సోమవారంలోగా అందించాలని కోరారు.