డిజైన్లు మారిస్తే ఆందోళనలు తప్పవు!
నాగర్‌కర్నూల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు మిగిల్చుకునేందుకే ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తోందని, రైతులను బలిచేయడానికి డిజైన్లలో మార్పులుచేర్పులు చేస్తే నిరాహార దీక్షకు పూనుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. నాగర్‌కర్నూల్‌లోని ఆయన ఇంట్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేఎల్ఐ మొదటిలిఫ్ట్ వద్ద ఉన్న సర్జిపుల్, సంప్‌హౌజ్‌కు 1.250 కిలో మీటర్ల దూరంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన సర్జిపుల్, సంప్హౌజ్ నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే డిజైన్‌కూడా రూపొందించారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్ 300 మీటర్ల దూరంలో నిర్మించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాడని, అలా నిర్మిస్తే మొదటి లిఫ్ట్ ప్రమాదంలో పడే అవకాశముందన్నారు. మంత్రి జూపల్లి కష్ణారావు కాంట్రాక్టర్లతో కలిసి ప్రాజెక్టులను బలిచేయాలని చూస్తున్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రతీసారి మంత్రులు, ఎమ్మెల్యేలు తనను ప్రాజెక్టులకు వ్యతిరేకినని బదనాం చేస్తున్నారని, తాను ప్రాజెక్టుల్లో జరిగే అవినీతికి మాత్రమే వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి కాకుండానే టెండర్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాములు, బీజేపీ నాయకులు అర్థం రవి, నసీర్ తదితరులు పాల్గొన్నారు.