breaking news
padhkalu
-
ప్రజల్లోకి నవరత్న పథకాలు
- ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రకటించడంతో టీడీపీ నేతల్లో ముచ్చెమటలు - అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన రావడంతో బెంబేలు - పై నుంచి కింద వరకూ ప్రజాస్వామ్య విలువల్లేని పార్టీ టీడీపీ - జెడ్పీ చైర్మెన్, వైస్ చైర్మెన్ల పదవులకు రాజీనామాలే ఇందుకు ఉదాహరణలు - పులిని చూసి భయపడుతున్నట్టుగా జగనన్నంటే హడలిపోతున్న బాబు - ప్రజల్లోకి నవరత్నాలను తీసుకువెళ్లాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు పిలుపు . కాకినాడ రూరల్: అన్న వస్తున్నాడు...అధైర్యపడొద్దు...ప్రజలందరికీ జగనన్న అండగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు భరోసానిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం సాయంత్రం కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలను అమలులోకి తీసుకురావడం ద్వారా పేదల అభ్యున్నతికి విశేష కృషి చేస్తారని కన్నబాబు అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, పింఛన్లు పెంపు, అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, దశలవారీగా మద్య నిషేధం వంటి పథకాలున్నాయన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ ప్రకటించిన పథకాలతో తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. పేద వర్గాలకు ఉపయోపడే ఇలాంటి పథకాలను ఇంటింటికీ చేర్చి, ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. గతంలో (2003)లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి అప్పటి చంద్రబాబు పాలనను చిత్తుచిత్తుగా ఓడించారని, నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా తండ్రిబాటలో పయనిస్తూ మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని సమాయత్తమవడం అభినందనీయమన్నారు. . అన్ని వర్గాలకూ లబ్ధి... వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరుతుందన్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ప్రతి ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లపాటు నగదు రూపంలో ఇస్తారన్నారు. చంద్రబాబునాయుడు రైతుల రుణాలను మాఫీ చేస్తానని రైతులను నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. డ్వాక్రా సంఘాలన్నీ చంద్రబాబు నిర్వాకం వల్లే పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. జగన్ సీఎం అయిన వెంటనే మహిళా సంఘాలకు ఎంత బకాయి ఉందో ఆ బకాయినంతా నాలుగేళ్లలో తిరిగి మహిళా సంఘాలకు ఇచ్చేస్తారని, వడ్డీలేని రుణాలను అందజేస్తారన్నారు. వృద్ధులను, వితంతువులను ఆదుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రూ.1000 పింఛన్లను రూ.2 వేలు చేస్తానని ప్రకటించారన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా బిడ్డ భవిష్యత్ కోసం ఏ తల్లీ భయపడాల్సిన పని లేకుండా ఫీజు రియింబర్స్మెంట్తోపాటు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రూ. 500, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.750లు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు రూ.1000లు అందజేస్తారన్నారు. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రస్తుత ప్రభుత్వం విధించిన సీలింగ్‌ను ఎత్తివేసి ప్రతి విద్యార్థికీ పూర్తిస్థాయిలో అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్ అమలు చేస్తారని కన్నబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ ఎంత ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసాయం అందుతుందన్నారు. మూడు దశల్లో మద్యనిషేధం అమలు చేస్తారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలో బెల్ట్‌షాపులను ఎత్తేస్తామని ప్రకటించి ప్రస్తుతం ఇంటికో బెల్ట్‌షాపు ఏర్పాటు చేసి పేద కుటుంబాల వీధిపాలుచేశారని కన్నబాబు విమర్శించారు. . చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు లేవు... రాష్ట్రంలో చంద్రబాబు పాలన ప్రజాస్వామ్యానికి తిలోదకాల్చిందని కన్నబాబు విమర్శించారు. 21 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టి తమ పార్టీ నాయకులు ఎందుకూ పనికిరారన్న భావనను చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్న నామన రాంబాబుతో బలవంతంగా రాజీనామా చేయించి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ జ్యోతుల నవీన్ కుమార్‌కు జెడ్పీ ఛైర్మన్ పగ్గాలు అప్పగించడం చూస్తే తమ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను చులకనగా చంద్రబాబు చూడడంఎంతవరకు సమంజసమన్నారు. జ్యోతుల నవీన్ కుమార్‌కు జెడ్పీ ఛైర్మన్ పీఠం అప్పగించడం టీడీపీ చేతగాని తనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. టీడీపీలో పదవులు పొందాలనుకుంటే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి, తిరిగి గెలుపొంది పదవులు చేపట్టాలన్నారు. . జగన్ అంటే చంద్రబాబుకు భయం పెద్దపులిని చూసి ప్రజలు ఏ రకంగా భయపడతారో అదేవిధంగా వైఎస్సార్సీపీ జగన్ మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నాయకులు భయపడుతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర చేయరని, జైలుకు వెళ్తారని మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం చూస్తే టీడీపీ నేతలంతా ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. కర్నూలులో వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ నారాయణరెడ్డి హత్య వెనుక కేఈ కృష్ణమూర్తి కుమారుడు హస్తం ఉన్నా ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు చంద్రబాబు కొడుకు లోకేష్‌కి అడుగులకు మడుగులొత్తడంతోనే సరన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడు పి.హరనాథబాబు, పార్టీ నాయకులు కర్నాశుల సీతారామాంజనేయులు, కడియాల చినబాబు, పుల్ల కోటేశ్వరరావు, మాజీ సర్పంచి ముమ్మిడి శ్రీనివాస్, కర్రి చక్రధర్ తదితరులు ఉన్నారు. . -
నీరివ్వని ఎత్తిపోతలు
నీరివ్వని ఎత్తిపోతలు చింతకాని: మెట్ట భూములకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. మండలంలోని మత్కేపల్లి, తిమ్మినేనిపాలెం, సీతంపేట, జగన్నాధపురం, చింతకాని, కొదుమూరు, లచ్చగూడెం, బొప్పారం గ్రామాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో కేవలం చింతకాని, జగన్నాధపురం గ్రామాల్లోని ఎత్తిపోతల పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మత్కేపల్లి గ్రామంలో స్వర్ణజయంతి గ్రామస్వరాజ్గార్ యోజనలో రూ. 27.64 లక్షల వ్యయంతో 194 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మున్నేరుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఐదేళ్ల క్రితం మున్నేరుకు వచ్చిన వరదలకు పథకానికి సంబంధించిన రెండు 30 హెచ్‌పీ విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు, మీటర్లు పూర్తిగా పాడైపోయాయి. అప్పటి నుంచి మోటార్ల మరమ్మతులకు రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికి ప్రయోజనం శూన్యం. దీనితో ఆయక ట్టు కింది పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సీ కార్పోరేషన్ నిధులతో కొదుమూరులో సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా పనిచేయటం లేదు. బొప్పారంలో మోటార్లు, స్టార్టర్లు కాలిపోవటమే కాకుండా షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఏడేళ్లుగా పనిచేయటం లేదు. దీనితో ఈ పథకం ఆయకట్టు కింద ఉన్న 100 ఎకరాల్లోని పంటపోలాలు బీడు భూములుగా మారాయి. లచ్చగూడెం ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి పనిచేయటం లేదు. విద్యుత్‌మోటార్లు, స్టార్టర్లు కాలిపోయాయి. దీనికి తోడు పైపులైన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ పథకం ఆయకట్టు కింద ఉన్న సుమారు వంద ఎకరాల్లోని పంటపొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. సీతంపేట ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా పనిచేయటం లేదు. ఫలితంగా 132 ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందటంలేదని ైరె తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాల మరమ్మత్తుల కోసం నీటిపారుదల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటకి ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.