breaking news
paddy fields farmers
-
వడివడిగా వరినాట్లు (ఫోటోలు)
-
పచ్చని చేలల్లో చెరువుల చిచ్చు
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : చేపల చెరువుల తవ్వకాలకు అధికారులు ఎడాపెడా ఇచ్చేసిన అనుమతులు రైతుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. చెరువుగట్ల కారణంగా చేలు ముంపునకు గురైతే పట్టించుకోని అధికారులు, ఇంకా అనుమతులు ఎలా ఇస్తున్నారంటూ వరి చేల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు మం డలంలోని కోటేశ్వరదుర్గాపురం, చాటపర్రు గ్రామాల్లో 200 ఎకరాలకుపైగా చేపల చెరువుల తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో పచ్చని చేలల్లో తవ్వకాల చిచ్చు రగిలింది. సుమారు 15 పొక్లెయిన్లు, 10 బుల్డోజర్లతో చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. పక్కనే ఉన్న రైతుల భూముల సరిహద్దుల వరకు చెరువులు తవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేలల్లో మురుగు లాగే డ్రెయిన్లు కూడా చెరువుల్లో కలిసి పోతున్నాయి. దీనిపై రైతులు చెరువుల యజ మానులను ప్రశ్నిస్తుంటే అధికారులు తమకు అనుమతులు ఇచ్చారని హూంకరిస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చెరువుగట్లే ముంచేస్తున్నాయి 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు చెరువు గట్లు వేస్తున్నారు. దీనింతో మురుగునీరు పారే డ్రెయిన్లు కుచించుకుపోవటం లేదా పూర్తిగా మూసుకుపోవటం జరుగుతోంది. అధికవర్షాలు, వరదలు సమయాల్లో చేలల్లోకి చేరిన నీరు బయటకు పోయే మార్గం లేక నిలిచిపోతోంది. ఈ కారణంగా గతేడాది జాలిపూడి, చాటపర్రు, మాదేపల్లి, తిమ్మారావుగూడెం తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల పంట చేలు ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి పంట నీటిలో నానటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది మండలంలోని చేపల చెరువుల తవ్వకాలపై జాలిపూడి రైతు గండికోట మహలక్ష్ముడు, వెంకటరమణ, యేసుకుమారి తదితర రైతులు అభ్యంతరం తెలుపుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనివల్ల తవ్వకాలు కొద్దిరోజులు మాత్రమే నిలిచాయి. కనీసం డ్రెయిన్లను వెడల్పు చేయండి గతేడాది లైలా తుపాను, అకాల వర్షాలకు సుమారు 800 ఎకరాల్లో పంట చేలు ముంపుబారిన పడ్డాయి. ఎకరానికి 40 బస్తాలు రావాల్సిన దిగుబడి కాస్తా 20 బస్తాలకు పడిపోయింది. దీనిపై రైతులు ప్రభుత్వాన్ని పరిహారం కోరినా ఉపయోగం లేకుండా పోయింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. చేలల్లో నీరు బయటకు పోయేలా డెయిన్లను వెడల్పు చేసి, పూడిక తీసి చెరువుల తవ్వకాలు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.