breaking news
p. rama subba reddy
-
జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పి.రామసుబ్బారెడ్డి గొరిగనూరు గ్రామంలో పర్యటించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇళ్లకు తాళాలు వేసుకుని నిరసన తెలిపారు. రామసుబ్బారెడ్డి పర్యటనపై ఎమ్మెల్యే ఆది కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన తన గ్రామాల్లో కల్పించుకుంటున్నారని ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. నేతల ఆధిపత్య పోరుతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. -
'ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆది'
జమ్మలమడుగు: ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అంటూనే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉగాది సందర్భంగా నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు, సిరిగేపల్లి గ్రామాల కార్యకర్తలు, నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం జరిగే దేవర ఉత్సవానికి తమను ఆహ్వానించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు రామాంజనేయరెడ్డి శ నివారం సిరిగేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి రామసుబ్బారెడ్డిని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడును దేవరకు ఎందుకు ఆహ్వానించావని బెదిరించాడన్నారు. అయినా కొంత మంది ధైర్యంగా వచ్చి తమను ఆహ్వానించారని పేర్కొన్నారు. దీంతో తాను, సీఎం రమేష్ మరి కొంత మందితో కలిసి ఆదివారం పెద్దదండ్లూరు, సిరిగేపల్లి గ్రామాలకు వెళ్లి అక్కడి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. తాము ఆ గ్రామాల నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రామాంజనేయుల రెడ్డి వారి ఇతర సోదరులు దాదాపు 5 ట్రాక్టర్లలో దేవగుడి గ్రామం నుంచి అనుచరులను తీసుకెళ్లి గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, గోపన్న, గిన్నె బాలుడు అనే వ్యక్తులపై దాడులు చేయడంతో పాటు వారి ఇళ్లలోని సామగ్రిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆది పైకి ఫ్యాషన్ అంటూ లోలోపల ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించే అనాగరిక చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు.