గొడ్డలితో దాడి
- ఒకరి పరిస్థితి విషమం, ఏడుగురిపై హత్యాయత్నం, కేసు నమోదు
ముద్దనూరు: ముద్దనూరు మండలం ఓబుళాపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మనోహర్ అనే వ్యక్తిపై గొడ్డలితో జరిగిన దాడి సంఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇన్చార్జి ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు మూడు రోజుల క్రితం ఓబుళాపురం ఎస్సీ కాలనీలో మనోహర్, యుగంధర్ అనే వ్యక్తుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున మనోహర్ తన భార్య భవాని, కుమారునితో కలసి కూలి పనికి బయలుదేరాడు. ఆ సమయంలో వంక వద్ద యుగంధర్ తన మనుషులతో కాచుకుని గొడ్డలితో మనోహర్ తల, కాళ్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో మనోహర్ తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. మెరుగైన వైద్యకోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. మనోహర్ భార్య భవాని ఫిర్యాదు మేరకు యుగంధర్‌తో పాటు సాయి, బాలు. మోహన్, పుల్లయ్య, గంగరాజు, శివ అనే వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ తెలిపారు.