breaking news
Nokia CEO
-
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..
సత్యనాదెళ్ల(47): 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ సీఈవో స్థాయికి వ చ్చారు. రాజీవ్ సూరి (47): 1995లో నోకియాలో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూరి.. 2014, మే నెలలో కంపెనీ హెడ్‌గా నియమితులయ్యారు. సంజయ్ మెహ్రోత్రా (56): శాన్డిస్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా 2011 జనవరిలో భాద్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ (52): 1998 నుంచి అడోబ్ సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శంతను... 2007 నాటికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఇంద్రనూయి (59): ఈమె 2006 నుంచి పెప్సికో చైర్పర్సన్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 1994లో పెప్సికోలో చేరిన ఈమె 2001లో కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. లక్ష్మీ మిట్టల్ (64): ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ అయిన అర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఇవాన్ మెనెంజిస్ (56): మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవోగా ఉన్నారు. 1997లో డియాజియోలో కెరీర్ ప్రారం భించి.. 2013 జూలైలో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. రాకేశ్ కపూర్ (57): డెటాల్ వంటి ఉత్పత్తుల్ని తయారు చేసే మల్టీ నేషనల్ కన్సూమర్ గూడ్స్ తయారీ కంపెనీ, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా ఉన్నారు. ఈయన నెస్లే, పెప్సికో వంటి పలు కంపెనీల్లో పనిచేశారు. అజయ్ బంగా (55): ప్రస్తుతం మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010 జూలై నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. పియూష్ గుప్తా (55): డీబీఎస్ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీగాఈయన కెరీర్ సిటీ బ్యాంక్ ఇండియాలో ప్రారంభమైంది. సంజయ్ ఝా (52): ప్రస్తుతం ఈయన గ్లోబల్ ఫౌండరీస్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతంలో మోటరోలా సీఈవోగా కూడా పనిచేశారు. ఫ్రాన్సిస్కో డిసౌజ (46): 2003లో సీఓఓ హోదాలో కాగ్నిజెంట్‌లో చేరిన ఈయన 2007లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
నోకియా సీఈవోగా భారతీయుడు?
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బాటలో ఇంకో అంతర్జాతీయ దిగ్గజానికి మరో భారతీయుడు సారథ్యం వహించబోతున్నారు. రాజీవ్ సూరి.. మొబైల్ ఫోన్స్ దిగ్గజం నోకియా కార్పొరేషన్‌కి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) హోదాను దక్కించుకోనున్నారు. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ నియామకం ఖరారుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ఫిన్లాండ్ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. సూరి ప్రస్తుతం నోకియా టెలికం పరికరాల వ్యాపార విభాగం హెడ్‌గా ఉన్నారు. వచ్చే నెలలోగా నోకియా హ్యాండ్ సెట్ వ్యాపార కొనుగోలు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ పూర్తి చేసే నాటికి సూరి నియామకం గురించి నిర్ణయం రాగలదని అంచనా. నాదెళ్ల చదివిన మంగళూరు యూనివర్సిటీలోనే రాజీవ్ సూరి ఇంజనీరింగ్ చదివారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ పట్టా అందుకున్నారు. సూరిని నోకియా సీఈవోగా నియమించిన పక్షంలో.. ఆయన అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సరసన నిలుస్తారు. ప్రస్తుతం పెప్సికో చైర్మన్‌గా ఇంద్రా నూయి, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా రాకేశ్ కపూర్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్ బంగా, డాయిష్ బ్యాంక్ హెడ్‌గా అన్షు జైన్ ఉన్నారు. గత నెలలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, సీఈవోగా సూరి నియామకం విషయంపై స్పందించడానికి నోకియా నిరాకరించింది. మైక్రోసాఫ్ట్ గనుక హ్యాండ్ సెట్ వ్యాపార విభాగం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తే.. నోకియా వద్ద ఇక టెలికం పరికరాలు, లొకేషన్ బేస్డ్ సేవలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వ్యాపార విభాగాలు మాత్రమే మిగులుతాయి. 23 ఏళ్లకు పైగా అనుభవం... ప్రస్తుతం నోకియా హెడ్‌క్వార్టర్స్ ఫిన్లాండ్లోని ఎస్పూలో నివసించే రాజీవ్ సూరికి అంతర్జాతీయంగా 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 1995లో నోకియాలో చేరారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించి విలీనాలు..కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ (ఎన్ఎస్ఎన్) కార్యకలాపాలకు సారథ్యం వహించారు. సంస్థని పునర్వ్యవస్థీకరించి, మళ్లీ లాభాల బాటలోకి తెచ్చారు. గతేడాదే ఎన్ఎస్ఎన్లో జర్మనీ ఇంజనీరింగ్ సంస్థ సీమెన్స్‌కి ఉన్న 50 శాతం వాటాను 2.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు నోకియా ఒప్పందం కుదుర్చుకుంది.