breaking news
nine people died
-
విమానం కుప్పకూలి 9 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఛాంబర్ లైన్లో దక్షిణ డకోటాకు చెందిన ఓ విమానం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిపోంది. ఈ ప్రమాదంలో తూర్పు ఇడాహోకు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో పైలట్‌తోపాటు, ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని బ్రూల్ కౌంటీ రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడి, తీవ్రమైన గాయాలపాలైన వారిని చికిత్స కోసం సియోక్స్ ఫాల్స్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. పీలాటస్ పీసీ -12 విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరింది. ఈ విమానం ఛాంబర్లైన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి ఇడాహోకు బయలుదేరింది. కాగా, ఛాంబర్లైన్కు దక్షిణంగా ఉన్న కార్న్ఫీల్డ్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చూస్తున్నామని రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. తీవ్రమైన వాతావారణ పరిస్థితుల్లో బాధితులను రక్షించడానికి ముందుకు వచ్చిన అందరిని, వైద్యనిపుణులను మౌల్ ప్రశంసించారు. ఈ విమానంలో ఇడాహో చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులతో ప్రయణించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. -
వడదెబ్బతో తొమ్మిది మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బతో తొమ్మిది మంది మృతిచెందారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో చిక్కుడు నర్సింహులు (35), నారాయణఖేడ్ జంట గ్రామం మంగల్‌పేట్‌కు చెందిన కుమ్మరి కృష్ణ(30), సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన కొల్లు సత్తయ్య (55), తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పోడెం కనకయ్య(78), మేళ్లచెరువు మండలం రేవూరుకు చెందిన చెరుకూరి కోటయ్య (45) ఎండవేడిమితో అస్వస్థతకు గురై మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ నలుగురు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురానికి చెందిన పి.బక్కయ్య (62), మరిపెడ మండలం దేశ్య తండాకు చెందిన బానోతు చంద్రియా (50), గార్ల మండల కేంద్రానికి చెందిన మడుపు వెంకటనర్సమ్మ(85) ఎండ తాకిడికి అస్వస్థతకు గురై మృతి చెందారు. వరంగల్‌లోని 12వ డివిజన్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన వృద్ధుడు పోతన విఠల్ (70) వడదెబ్బతో మృతి చెందాడు. -
దూసుకొచ్చిన మృత్యువు
అదుపు తప్పి తిరగబడ్డ ఆటో, అదే సమయంలో ఢీకొన్న వ్యాన్ ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి కొత్తపేట, న్యూస్‌లైన్: అసలే మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఆటో.. దానికి తోడు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. తోబుట్టువు ఇంట్లో జరిగే శుభకార్యానికి చేరుకోవాలన్న అతడి ఆత్రుత తొమ్మిది మందిని మృత్యుకుహరంలోకి నెట్టింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారి పాలెం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దుర్గారావు (40), అతడి భార్య దుర్గ (35), కుమార్తె చిట్టి (3), తల్లి నాగరత్నం (60), పినతల్లి నాగమణి (45), పినతండ్రి వెంకటేశ్వరరావు (45), మరో పినతండ్రి కొడుకు బాలకృష్ణ (35), అన్న కుమారుడు నాని (10), అక్క తొత్తరమూడి మంగ (45) ప్రాణాలు కోల్పోయారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు తాడిచెరువు గట్టుకు చెందిన ఆటోడ్రైవర్ దుర్గారావు చెల్లెలు లంకపార్వతిది రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు. ఆమెకు ఇటీవల ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు మీద పళ్లు ముందు రావడంతో వారి నమ్మకం ప్రకారం ఆదివారం శాంతి కార్యక్రమం తలపెట్టారు. ఉదయం 9.10 గంటలకు ఆ కార్యక్రమం తలపెట్టగా దుర్గారావు కుటుంబసభ్యులు, బంధువులతో తాడిచెరువు గట్టు నుంచి ఆలస్యంగా బయల్దేరాడు. అయినప్పటికీ ముహూర్తానికి ముమ్మిడివరప్పాడు చేరుకోవాలన్న ఆత్రుతతో ఆటోను వేగంగా నడుపుతున్నాడు. గొలకోటివారిపాలెం వచ్చేసరికి.. ఆటోకు ముందు వెళ్తున్న అమలాపురం-రాజమండ్రి ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు ఆగింది. బస్సును ఢీకొనకుండా తప్పించే యత్నంలో ఆటో తిరగబడింది. అదే సమయంలో రావులపాలెం నుంచి ముక్కామలకు కొబ్బరి లోడుతో వెళ్తున్న వ్యాన్ ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ క్రమం లో ఆటో.. రోడ్డు పక్కనున్న తురాయి చెట్టుకు, సమీపంలోని వంతెన గోడకు.. వ్యాన్‌కు మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. దుర్గారావు, దుర్గ, పాపమ్మ, నాగమణి, బాలకృష్ణ, నాని, మంగ అక్కడికక్కడే మరణించారు. దుర్గారావు కుమార్తె చిట్టి, వెంకటేశ్వరరావు, సోదరుడు చాట్ల పల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. చిట్టి, వెంకటేశ్వరరావుల పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. కన్నీరుమున్నీరైన ఆత్మీయులు తొమ్మిదిమందిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం వారి ఆత్మీయులను కన్నీటి సంద్రంలో ముంచింది. మృతుల్లో ఒకరైన బాలకృష్ణ భార్య కుమారి ప్రస్తుతం గర్భిణి. వారికి ఇప్పటికే రెండేళ్ల కుమార్తె ఉంది. మీదు పళ్ల దోషనివారణ వేడుకకు కుమారి కూడా వెళ్లాల్సి ఉన్నా చర్చికి వెళ్లాలని ఆగిపోయింది. అన్న కుమారుడైన నానిని తీసుకు బయల్దేరిన బాలకృష్ణ ఆ బాలుడితో సహా కడతేరిపోయాడు. మరో మృతురాలు నాగమణి భర్త చంద్రరావు తాను కొద్దిసేపటి కిందట సాగనంపిన భార్య తిరిగి రాని లోకాలకు తరలిపోయిందని తెలుసుకుని కుప్పకూలిపోయాడు. ఆటోడ్రైవర్ దుర్గారావు కుమార్తెలు జ్యోతి (5), చిట్టి (3) మేనత్త ఇంట జరిగే వేడుకకు పట్టు పరికిణీలు ధరించి, ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. తీవ్రంగా గాయపడి, నెత్తుట తడిసిన పట్టు పరికిణీతో చిట్టిని చూసిన వారందరూ కంటతడిపెట్టారు. చిట్టిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. స్వల్పగాయాలతో బయటపడిన జ్యోతి బంధువులను వాటేసుకుని.. ‘అమ్మానాన్న ఏరీ?’ అని ఏడుస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కంటతడి పెట్టారు.