breaking news
navodaya entrance
-
ఒకవైపు విద్యార్థులు.. మరోవైపు ఆందోళనలు..
సాక్షి, కామారెడ్డి : అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన పాఠశాల నవోదయ పాఠశాల. ఈ విద్యాసంస్థలో ప్రవేశం కొరకు ప్రతి ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నిజాంసాగర్ మండలంలోని నవోదయ పాఠశాలలో నిర్వహించాలనుకున్నారు. అయితే 9వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్నాహ్నం అయినా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో పరీక్షపత్రం లీకేజ్ అయ్యిందంటూ వదంతులు వ్యాపించాయి. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయ పరీక్ష చీఫ్ఎక్సామినర్ మాట్లాడుతూ..కేవలం కొన్నిసాంకేతిక సమస్యల వల్ల మాత్రమే పరీక్ష ఆలస్యం అయిందని, కొందరు ఆకతాయిలు సృస్టిస్తున్న వదంతులను నమ్మవద్దని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు. ఆందోళనల నడుమ ఎట్టకేలకు 1గంటకు పరీక్ష ప్రారంభమైంది. స్థానిక ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారికి అవగాహన లోపంతోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. -
నవోదయంలో.. 9వ తరగతికి ఎంట్రీ ఇలా..
నిడమర్రు : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ముందుంటాయి. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు ముందువరసలో ఉన్నాయి. వీటిలో ప్రవేశం లభిస్తే విద్యార్థులు నిశ్చింతగా చదువుకోవడమే కాకుండా వారిలోని ప్రతిభ, సృజనాత్మకతకు మరింత మెరుగులద్దవచ్చు. సీబీఎస్ఈ సిలబస్లో బోధిస్తారు. వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి నవోదయ విద్యాసమితి 2018–19 విద్యా సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న పెదవేగి నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న 8 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. దేశంలో 626 విద్యాలయాలు జాతీయ విద్యా విధానం–1986 ప్రకారం దేశవ్యాప్తంగా (తమిళనాడు మినహా) జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 626 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. విద్యతోపాటు విలువలు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే వీటి లక్ష్యం. విద్యార్థి సర్వోతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల అంశాలకు ఈ విద్యాలయాలు వేదికలుగా ఉన్నాయి. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తారు. నిధులన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యా సమితి పనిచేస్తుంది. లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. సీటు లభించిన ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ప్రతి నెల రూ.1,500 చొప్పున చెల్లించాలి. మిగిలిన వారు ప్రతి నెల రూ. 600 చెల్లిస్తే సరిపోతుంది. ప్రత్యేకతలు ♦ బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ♦ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, యోగా శిక్షణ ♦ 1ః8 నిష్పత్తిలో కంప్యూటర్ ల్యాబ్ ♦ ఇంటర్(ప్లస్ 2) వరకూ చదువుకోవచ్చు. ♦ నీట్–2017 పరీక్షల్లో 11,875 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు. ♦ జేఈఈ–అడ్వాన్స్డ్ 2017లో 1,176 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు. ప్రవేశం ఇలా.. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచుతారు. ఎంపికైన విద్యార్థులకు పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో 100 మార్కులకు సమాధానాలను గుర్తించడానికి రెండున్నర గంటలు (150 నిమిషాలు)సమయం కేటాయిస్తారు. ఇందులో ఇంగ్లీషు–15, హిందీ–15, గణితం–35, సైన్స్–35 మార్కులకు ప్రశ్నలుంటాయి. అర్హత ఇలా ♦ 2017–18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదవాలి. ♦ విద్యార్థి వయసు 2002 మే 1 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఇలా వెబ్సైట్లో ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 19న రాత పరీక్ష పెదవేగి నవోదయ విద్యా కేంద్రం/కేటాయించిన పరీక్షా కేంద్రంలో ఉంటుంది. మరిన్ని వివరాలకు నవోదయ విద్యాలయాల వెబ్సైట్ సందర్శించండి. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
పెద్దాపురం : నవోదయ విద్యాలయలో 2016–17 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీలోగా ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందజేయాలన్నారు. దరఖాస్తు ఫారాలకు ఎటువంటి రుసుము లేదని, జిరాక్స్లో కూడా స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించే పరిస్థితి లేదని, మండల విద్యాశాఖాధికారులు గమనించి గత ఏడాది కంటే ఈ ఏడాది 15 శాతం రిజిస్ట్రేషన్ పెరిగేలా సహరించాలన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బాలికలు తప్పని సరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముని రామయ్య తెలిపారు.