breaking news
national monuments
-
164 ఏళ్ల హిందూ ఆలయ పునరుద్ధరణ
సింగపూర్ : లిటిల్ ఇండియాలోని పురాతన హిందూ ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 164 ఏళ్ల క్రితం నిర్మితమైన శ్రీ శ్రీనివాస పెరుమాల్ దేవాలయాన్ని ఆధునీకరించడానికి 20 మందితో కూడిన కళాకారుల(శిల్పుల) బృందం ఏడాది కాలంగా పనిచేస్తోంది. ఇందుకోసం 20 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ‘పనులు జరుగుతున్నప్పటికీ ప్రతి రోజూ పూజ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పండుగల సందర్భంలో మాత్రం నిర్మాణ పనులకు విరామం ఇస్తున్నాం. భక్తుల పూజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరిపడ స్థలం ఉండేలా, పాత పెయింటింగ్లను రీపెయింటింగ్ చేయడం, రాజగోపురాన్ని యథాస్థానానికి తీసుకురావడం, ఆచారాలకు, పద్దతులకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి’ అని ఆలయ అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ఏప్రిల్ 22వ తేదీన 39 మంది పండితులతో ఘనంగా ఆలయ పునరుద్ధరణ వేడుకలు జరపనున్నట్టు తెలుస్తోంది. 1978లోనే ప్రిజర్వేషన్ బోర్డ్ ఆఫ్ సింగపూర్ ఈ ఆలయాన్ని జాతీయ స్మారకంగా గుర్తించింది. ఆ తరువాత 1979,1992, 2005లలో మూడుసార్లు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హిందూ ఆలయాల పునరుద్ధరణ, పున:నిర్మాణ పనులను సింగపూర్ ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగా నాలుగోసారి శ్రీ శ్రీనివాస పెరుమాల్ ఆలయ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. -
జాతీయ స్మారకాల వద్ద పాలిథీన్ నిషేధం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద ఆదివారం నుంచి పాలిథీన్ వాడకంపై నిషేధం విధించారు. స్వచ్ఛభారత్ పథకం ప్రారంభమై ఆదివారానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందుకు గుర్తుగా ఈ నిషేధం అమలులోకి తేనున్నారు. గాంధీ జయంతి కూడా ఈ రోజే కావడం విశేషం. ‘స్వచ్ఛ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద, పర్యాటక ప్రదేశాలలో గాంధీ జయంతి రోజు నుంచి పాలిథీన్ను వాడడాన్ని నిషేధిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ చెప్పారు. అయితే ప్లాస్టిక్ బాటిళ్లను మాత్రం అనుమతిస్తారు. స్మారకచిహ్నాల నుంచి 100 మీటర్ల లోపు పాలిథీన్ వాడరాదు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై మరో నెల తర్వాత సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను తయారుచేయడాన్ని ప్రభుత్వం మార్చిలోనే నిషేధించింది.