breaking news
music fans
-
పాటలే కాదు..నటనలోనూ మేటే!
* ఇండియన్ ఐడెల్ శ్రీరామచంద్రమూర్తి అద్దంకి: శ్రీరామ చంద్ర పేరు వినగానే సంగీతాభిమానులు గర్వపడతారు. ఇండియన్ ఐడెల్ -2010 విజేతగా చరిత్ర సృష్టించిన ఆయన అద్దంకికి చెందినవారని తెలిసిందే. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో శుక్రవారం విలేకర్లతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘అద్దంకి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి ఆటలు, స్నేహితులను ఎప్పటికీ మరచిపోలేను. పాటలతో పాటు నటనలోనూ గుర్తింపు పొందడం నా అదృష్టమే. జగద్గురు ఆదిశంకరాచార్య, ప్రేమ గీమా జంతానైలో నటించా. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాటలను వదలకుండా, ఆల్బమ్స్ చేస్తున్నందు వల్ల సన్ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అవకాశం వచ్చినా చేయలేదు. ఇప్పటికి 75 సినిమాల్లో ఆరు భాషల్లో 150పైగా పాటలు పాడా. మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. అద్దంకిలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నా. నందమూరి కళాపరిషత్ పిలుపుతో అద్దంకి రావడం నాకు అనందాన్నిస్తోంది’ అని తెలిపారు. మన్నం త్రిమూర్తులు, రాయసం హనుమంతరావు, కోవి శ్రీనివాసరావు, శ్రీరామచంద్ర తండ్రి మంగమూరి రామకోటయ్య పాల్గొన్నారు. -
కోకిలమ్మ...
గాయనీమణి కోకిల పాడాలంటే వసంతం రావాలి. కానీ ఆమె ఏడాది పొడవునా పాడుతూ నిత్యం వసంతాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడా కోకిల 77వ పుట్టిన రోజు వచ్చింది. నాకు పుట్టిన రోజు చేసుకునే అలవాటే లేదంటోంది. కానీ ఆమె పుట్టిన రోజును గుర్తు చేసుకోవడం సంగీతాభిమానులకు ఉషస్సులాంటిది. ఈ నెల 23వ తేదీ ప్రముఖ గాయని ఎస్. జానకి పుట్టిన రోజు సందర్భంగా... జానకిగారు డౌన్ టు ఎర్త్‌కి చిరునామా. ఎంత పేరు సంపాదించినా కించిత్తు గర్వం లేకపోగా అందరితో బాగా కలిసిపోతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఎవరికీ భయపడరు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. పెద్దవారంటే ఎంతో గౌరవం. సంగీతమంటే ప్రాణం. ఆమెకు దేవుడంటే ఇష్టం. షిరిడీ సాయిబాబా భక్తురాలు. ఆవిడ బెడ్రూమ్లో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఎన్నో ఉంటాయి. ఎంతోమంది బీదవాళ్లకు సాయం చేసారు. కానీ ఆ విషయాన్ని ఆమె చెప్పుకోరు. ఆవిడను దగ్గరి నుంచి చూసిన కొందరికే తెలిసిన సంగతి అది. ఎప్పుడూ సాదాసీదాగా, నవ్వుతూ ఉండడం ఆవిడకి ఇష్టం. ఆస్తమాను లెక్కచేయని గాయని... కొత్త గాయకులకు మీరిచ్చే సందేశం ఏమిటంటే... ‘‘చిన్న పిల్లలు చక్కగా పాడుతున్నారు, బాగా శిక్షణ పొంది పాడుతున్నారు. వారికి నేనిచ్చే సందేశం ఏముంటుంది’’ అని సందేశం అనే మాటనే కొట్టిపారేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా గాయకులు పాటకు దూరం కాకూడదని మాత్రం చెబుతారు. ‘‘నాకు 24 ఏళ్ల వయసులో ఆస్తమా వచ్చింది. ఆ జబ్బుని లెక్కచేయకుండా పాడాను. గాయకులకు అంతటి నిగ్రహశక్తి ఉండాలి. పాడగలగడం దేవుడిచ్చిన వరం. పాటే దైవం. ఓంకారమే దైవనాదం. గానం గాయకులకూ, శ్రోతలకూ ప్రాణదీపం’’ అంటారు. అభిమానమే అవార్డు! ఆమె చిన్నప్పటి నుంచి లతామంగేష్కర్, మహమ్మద్ రఫీ పాటలను ఇష్టంగా వినేది. ఈ ఫీల్డులోకి వచ్చిన తర్వాత జిక్కి, లీల, సుశీల, బాలసరస్వతి పాటలను గానామృతాన్ని గ్రోలుతున్నంత శ్రద్ధగా వినేది. అవార్డుల ప్రస్తావన వస్తే... ‘‘ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలన్నీ ఆ రోజు పేపర్లో చదివి మర్చిపోయేవే. నా పాటను విని ఆనందించే అభిమానుల ప్రేమ, వారి ఆత్మీయతలను మించిన అవార్డు మరొకటి ఉండదు. అది నాకు సమృద్ధిగా అందింది’’ అంటారు. యువ గాయనీ గాయకులతో ఆవిడ ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, ఆదరిస్తారు. ఒకరి పాటలో తప్పులు పట్టడం ద్వారా తనకు ఎక్కువ తెలుసనే భావాన్ని ధ్వనింప చేయడం ఆవిడకు తెలియదు. చిన్న పిల్లలు పాడుతున్నా... శ్రద్ధగా వింటూ తన్మయత్వంలో మునిగిపోతారామె. నా సంగీత దర్శకత్వంలో ‘నరుడా ఓ నరుడా (భైరవద్వీపం)’ పాటకి ఆమెకి నంది అవార్డు వచ్చింది. ‘అనుబంధం’ టీవీ సీరియల్లో ‘ఇది దీపాలు పెట్టేవేళ’ పాటకి కూడా నంది అవార్డు వచ్చింది. ఆరున్నర దశాబ్దాల అనుబంధం... జానకిగారితో మాది 65 ఏళ్ల అనుబంధం. మా బాబాయిగారి (మాధవపెద్ది సత్యంగారు) పెళ్లిలో జానకిగారు, ఆవిడ అక్కయ్య రాధగారు మా అమ్మగారి కోరిక ప్రకారం కచేరీ చేశారు. ఆ ఫొటో మా దగ్గర ఇంకా పదిలంగా ఉంది. ఇన్నేళ్ల మా అనుబంధంలో ఎప్పుడూ వివాదాలు రానేలేదా అంటే వచ్చాయి. ఎక్కువ సార్లు సంగీతం మీదనే వాదులాడుకున్నాం. మా అక్కాతమ్ముళ్ల మధ్య నిష్టూరాలు, అలకలు వస్తూ ఉంటాయి. అవే సమసిపోతూ ఉంటాయి. అనుబంధం, ఆప్యాయతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. - మాధవపెద్ది సురేష్ (సంగీత దర్శకులు) నాకు తెలిసిన జానకిగారు... ⇒ ఆమెకు ‘కారం’ మీద ‘మమకారం’ ఎక్కువ. ⇒ ఆవిడకు మా నిర్మల ఆస్థాన వంటమనిషి. నేనప్పుడప్పుడు డ్రైవర్ని. ⇒ ప్రఖ్యాత సినీనటులు రజనీకాంత్, కమలహాసన్, రాజబాబు, కన్నడ హీరో రాజ్‌కుమార్ వంటి ప్రఖ్యాత నటులు ఆమెతో పాటలు పాడారు. ⇒ ప్రఖ్యాత షెహనాయ్ వాద్యకారుడు భారతరత్న బిస్మిల్లాఖాన్, ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా, విఖ్యాత నాదస్వర విద్వాంసులు కారుమంచి అరుణాచలం, విశ్వవిఖ్యాత వాయులీన విద్వాంసుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్, కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె.జె.ఏసుదాస్ లాంటి హేమాహేమీలతో మంచి పాటలు పాడారు. ‘మౌనపోరాటం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. భారతీయ భాషలలో సుమారు 20 వేల పాటలు పాడారు.