breaking news
Model City
-
మంగళగిరికి మహర్దశ
సాక్షి, మంగళగిరి: ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి పట్టణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకతోనే మహర్దశ పట్టనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలిచారనే అక్కసుతో గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రధాన పట్టణంగా ఉన్న మంగళగిరి అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 ఎన్నికలలో రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి అభివృద్ధిపై దృష్టి సారించడంతో మంగళగిరి పట్టణంతో పాటు మంగళగిరిలో ప్రధాన పరిశ్రమగా ఉన్న చేనేత పరిశ్రమకు మంచిరోజులు వచ్చాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అసెంబ్లీలో తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా అభివృద్ధి పరిచేందుకు రూ.50 కోట్లు, చేనేత పరిశ్రమ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించడంలో ఎమ్మెల్యే ఆర్కే చేసిన కృషి అభినందనీయమని పట్టణ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించడం శుభపరిణామమని అభిప్రాయపడుతున్నారు. చిత్తశుద్ధిని చూపారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత సదస్సు నిర్వహించి కార్మికుల బాధలు వై.ఎస్.జగన్ తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధికి తొలి బడ్జెట్లోనే రూ.200 కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం ఉంది. అదే విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా మార్చేందుకు నిధులు కేటాయించడం అభినందనీయం. –చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రైతు సంక్షేమ ప్రభుత్వం మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది రైతు అని, ఆ మహానేత ఆశయ సాధనకు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అద్భుతమైన బడ్జెట్ రూపకల్పన చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతు పక్షపాత ప్రభుత్వం అని చాటి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పట్టణానికి దక్కని విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. మంగళగిరి పట్టణంలో ప్రధానమైన చేనేత పరిశ్రమకు రూ.200 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. -
రాజధాని మోడల్ సిటీగా ఉండాలి
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడే రాజధానిని నిర్మించాలి అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలన్న సిటిజన్ ఫోరం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మోడల్ సిటీగా కొత్త రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడే రాజధాని నిర్మించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని చెప్పారు. రాజ ధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ప్రభుత్వ భూములైతే వనరుల సమీకరణకు కూడా ఇబ్బందులు లేకుండా సరికొత్త మోడల్ సిటీగా, భవిష్యత్తు అవసరాలను తీర్చేదిగా కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చన్నారు. ఇదే అంశాన్ని తాను శాసనసభలోనూ చెప్పానని గుర్తుచేశారు. మంగళవారం సిటిజన్ ఫోరం ప్రతినిధులు లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తమ అభిప్రాయాలతో కూడిన ఒక వినతిపత్రాన్ని అందజేశారు. రాజధాని కోసం ప్రైవేటు భూములను సేకరించడం వల్ల వనరులతోపాటు అనేక సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల ప్రభుత్వ భూములు ఉన్నచోటే కొత్త రాజధానిని నిర్మించుకోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని జగన్ ఫోరం ప్రతినిధులకు వివరించారు. రాజధాని ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పారు. మరో విభజనకు దారితీయకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రాజధాని ఎంపిక విషయంలో తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌ను కోరినట్టు సిటిజన్ ఫోరం ప్రతినిధులు చెప్పారు. జగన్‌తో సమావేశానంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతం పేరిట ప్రాంతీయ వాదం తలెత్తి మరోసారి రాష్ట్ర విభజనకు దారి తీయకుండా నిర్ణయం ఉండాలన్నారు. తెలంగాణ విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నూతన రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఒక వేళ రాయలసీమ అనువైన ప్రాంతం కాకపోతే అందరికీ అందుబాటులో ఉండే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, అందువల్ల వెనుకబడిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వారు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కురిచేడు, కొనకలమెట్ల, మార్కాపురం, పెద్దారవీడు, దర్శి, పొదిలి, త్రిపురాంతకం ప్రాంతాల్లో ఎక్కువగా ఖాళీ భూములున్న కారణంగా రాజధాని అక్కడ ఏర్పాటు చేసినా అన్ని ప్రాంతాల వారికీ సమాన దూరం ఉంటుందని తెలిపారు. ఇక్కడ దాదాపు 1.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరం ఉండదని వివరించారు. చుట్టూ నాగార్జునసాగర్, శ్రీశైలం, వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నందున అవసరమైతే ఆయా ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని ఉపయోగించుకునే అవకాశముందని చెప్పారు. ఫోరం ప్రతినిధులు మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.జయభారత్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ఆయా రంగాల నిపుణులు భూమన సుబ్రహ్మణ్యరెడ్డి, వెంకటస్వామి, ఎ.హన్మంత్‌రెడ్డి, జి.ఆర్.రెడ్డి, కాసా జగన్ మోహన్‌రెడ్డి, వీఎల్‌ఎన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చండ్రాయుడు, దశరథరామిరెడ్డి జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు.