breaking news
MLA Raju
-
ఎమ్మెల్యే రాజు అక్రమార్క
వరసగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించిన చోడవరం ప్రజలకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు చేసిందేంట్రా బాబు అంటే.. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అట్టడుగు స్థానంలో నిలిపి, అవినీతి, అక్రమాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లడం. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు పొంది గ్రానైట్ గనులను ఎమ్మెల్యే అండ్ కో దోచుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా రాజు గనులకు ఎసరు పెడుతుంటే.. ఆయన అనుచరగణం అందినకాడికి దోచుకోవడంలో ఆరితేరిపోయారు. ఇసుక, మట్టి, కంకర, గ్రావెల్ ఇలా అన్నింటిని చెరబట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరు చెప్పి పర్సంజేట్లు, మామూళ్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్వయంభూ విఘ్నేశ్వరుడు వెలసిన ఆధ్యాత్మిక ప్రాంతం.. ఎందరో రైతులు, కార్మికుల బతుకుల్లో తీపిని పంచుతున్న గోవాడ సుగర్స్.. విస్తరాకుల తయారు చేయడంలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కొత్తకోట.. శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, వరాహా నదుల ప్రవాహం... మెట్ట.. మాగాణి ఆయకట్టు కలగలిసిన ప్రాంతం ‘చోడవరం’. అలాంటి ఈ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో వేసిన సీసీ రోడ్లు తప్పితే ఐదేళ్ల టీడీపీలో పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. అంతెందుకు నదులన్నీ ఈ నియోజకవర్గంలోనే ప్రవహిస్తున్నా.. నాలుగో వంతు పంచాయతీలకు గుక్కెడు మంచి నీళ్లు దొరకని దుస్థితి ఉంది. ప్రజలు.. తమ బాగోగులు చూస్తారని అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా అంటే.. కనిపించిన కొండను పిండి చేయడం, తద్వారా కోట్లు వెనుకేసుకోవడం, ప్రభుత్వ భూమల ఆక్రమణలో ఆరితేరిన అనుచరగణానికి అండగా నిలవడం.. ఇసుక అక్రమ వ్యాపారాల్లో దండుకోవడం.. ఇలా అవినీతిలో రా‘రాజు’గా వెలుగొందుతున్నారు. – సాక్షి టాస్క్‌ఫోర్స్ ‘రాజు’ గారి గుప్పిట్లో గనులు జిల్లాలో గ్రానైట్ కింగ్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు చోడవరం ఎమ్మెల్యే రాజుదే. ఎక్కడైనా కొండ కనిపిస్తే చాలు ఒక బిడ్ వేసి ఆ కొండను పిండి చేసి కోట్లు ఎలా కూడబెట్టాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని సొంత పార్టీ నాయకులే చెబుతుంటారు. సొంత సర్వేయర్లతో సర్వే చేయిస్తారు. విలువైన గ్రానైట్ ఉన్నట్టయితే ఓ దరఖాస్తు పడేస్తారు. ఆ తర్వాత ఎవరైనా దరఖాస్తు చేస్తే మొదట దరఖాస్తు చేసుకున్న వారికే క్వారీ లీజు అనుమతులు కేటాయించాలన్న గనుల శాఖ నిబంధన మేరకు ఈయన దరఖాస్తు తెరపైకి వస్తుంది. ఆ సమయంలో గుడ్‌విల్‌గా కొంతసొమ్ము తీసుకుని తాను సిఫార్సు చేసిన వారికి లీజు హక్కులు దక్కేలా చక్రం తిప్పుతారు. ఇంకా మంచి గ్రానైట్ పడితే అక్కడ స్లీపింగ్ పార్టనర్‌గా ఉంటారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో గ్రానైట్ కొండలను వెలుగులోకి తీసుకు రావడమే కాదు వాటిని తానే సొంతం చేసుకుని దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా వరసగా రెండు సార్లు ఎన్నికయినప్పటికీ కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాజకీయ పలుకుబడితో పలు గ్రానైట్ క్వారీలకు లీజులు సంపాదించుకున్నారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈయన క్వారీ సామ్రాజ్యానికి అడ్డులేకుండా పోయింది. మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాల్లోనూ, మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కొన్ని తన పేరిట, మరికొన్ని బినామీల పేరిట ఎమ్మెల్యే రాజుకు క్వారీలు ఉన్నట్టుగా ఆయన అనుచరులే చెబుతున్నారు. తవ్వకాలకు అడ్డు చెబితే బెదిరింపులే.. తక్కువ హెక్టార్లకు లీజు పొంది రెట్టింపు విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వేసి అడ్డంగా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అడ్డు తిరిగిన రైతులను, గ్రామస్తులను తన అధికార బలంతో భయబ్రాంతులకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. తన పేరున ఉన్న ఎరుకవాడ క్వారీ వద్ద ఇలాంటి సంఘటనే జరిగింది. తమ క్వారీకి ఆనుకుని ఉన్న రైతుల పొలాలను లీజుకు తీసుకోవాలని భావించి తక్కువ ధరను ఇవ్వచూపారు. దీనికి వారు నిరాకరించారు. క్వారీలో జరిగే బ్లాస్టింగ్లు కారణంగా రాళ్లు దిగువన ఉన్న పొలాల్లోకి వచ్చి పడి పంటలు నష్టపోతుండటంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన కూడా చేశారు. ఆ రైతులను తన అధికారంతో కొంత ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరికీ తెలుసు. ఈ క్వారీని నెలకు రూ.లక్ష చొప్పున గుడ్‌విల్ కింద వేరొకిరి ఇచ్చేశారు. వమ్మలి జగన్నాథపురంలో ఉరలోవ కొండ గ్రానైట్ క్వారీలో ఎమ్మెల్యేకు ప్రధాన భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఈ క్వారీ చుట్టు పక్కల ఉన్న రైతుల భూములను తక్కువ ధరకే దక్కించుకుని తన బినామీదారుల పేరున పెట్టారు. క్వారీకి రోడ్డు వేసేందుకు కొందరు భూములను ఇవ్వాలని కోరగా వారు అంగీకరించకపోవడంతో అధికారంతో వారిని బెదిరించి రోడ్డు వేయించారు. ఇక్కడ 15 హెక్టార్లకు లీజు అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు 25 హెక్టార్లకు పైనే అక్రమంగా క్వారీ చేసి రూ.లక్షలు సంపాదించినట్టు తెలిసింది. రావికమతం మండలంలో ఇటీవల మరుపాక కొండ వేరొకరి పేరున క్వారీకి లీజు వేయించిన ఎమ్మెల్యే స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులు ఆందోళనకు దిగి గొడవ చేయడంతో తాత్కాలికంగా క్వారీ తవ్వకాలు ఆపారు. అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే.. టి.అర్జాపురం, డోలన్నపాలెం, అజయ్పురం, జెడ్.బెన్నవరం క్వారీలకు వేరొకరి పేరున లీజులు వేయించి చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి రూ.లక్షలు తీసుకుని అమ్మేసుకున్నట్టు సమాచారం. తోటకూరపాలెం, గుడ్డిప క్వారీల్లో ఎమ్మెల్యేకు కొంత భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. ఈ క్వారీలకు చుట్టూ భూములు లీజుకు తీసుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే సహకారం అందించినట్టు సమాచారం. కొట్నాబిల్లి గ్రానైట్ క్వారీ తన కుటుంబ సభ్యుల పేరున కొంత కాలం నిర్వహించి, తర్వాత స్లీపింగ్ పార్టనర్‌గా వేరొకరికి లీజు అనుమతులు అమ్మేశారు. ఈ వ్యవహారంలో కొంత డబ్బు గుడ్‌విల్‌గా కూడా తీసుకున్నట్టు తెలిసింది. కోటవురట్ల సమీపంలో కూడా ఈయనకు క్వారీ ఉంది. అంతే కాకుండా ఇతర జిల్లాలో కూడా కొన్ని క్వారీలు ఈయన సొంతంగానూ, బినామీల పేరున నిర్వహిస్తున్నట్టు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈయన వ్యాపారానికి మరింత అడ్డులేకుండా పోయింది. గ్రానైట్ క్వారీలకు అడ్డు వచ్చే వారిని తన అధికారంతో ఎలా ఇబ్బందులుపెడుతున్నారో గతంలో ఆయా క్వారీల వద్ద ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. గ్రానైట్, క్వార్జ్, ఇతర గనుల క్వారీ వ్యాపారం చేసే యజమానులందరూ వడ్డాది కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి రాజకీయంగా అండగా ఉంటూ గనుల దోపిడీలో ఈయన కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పనుల్లో దోపిడీ ప్రధానంగా సాగునీటి చెరువు, పంట కాలువల్లో పూడికలు తీయడం, అవసరమైన చోట స్లూయీస్‌లు, మదుంలు నిర్మించడం వంటి పనులను నీరు చెట్టు నిధులతో చేశారు. నియోజకవర్గంలో సుమారు రూ.15 కోట్లతో నామినేటెడ్ పద్ధతిలో నీరు–చెట్టు పథకంలో పనులు చేశారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూడికలు తీసిన చెరువుల్లోనే మరలా నీరు–చెట్ల నిధులతో యంత్రాలను ఉపయోగించి అరకొరగా పూడికలు తీసి, దాదాపు రూ.5 కోట్ల దోపిడీకి పాల్ప డ్డారు. ఉదాహరణకు నర్సాపురంలో ఒకే చెరువుకు మూడుసార్లు పూడికలు తీసినట్టు చూపించించి టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు సత్యనారాయణ సుమారు రూ.20 లక్షల మేర నిధులు పక్కదారి పట్టించారు. కొన్ని చెరువులకు కట్టిన స్లూయీస్‌లు, మదుంలు వర్షాలకు వెంటనే కొట్టుకుపోవడంతో ఈ పనుల్లో నాణ్యతా లోపం బట్టబయలైంది. సీనరేజ్ కట్టకుండానే చెరువుల్లో తీసిన మట్టిని అమ్మడం ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర అక్రమంగా కొందరు టీడీపీ నాయకులు సంపాదించుకున్నారు. ప్రభుత్వ జాగా.. వేసేయ్ పాగా.. చోడవరం మండలంలో వెంకన్నపాలెం, గంథవరం, రాయపురాజుపేట, శీమునా పల్లి, ఖండిపల్లి, చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం, చోడవరం, బెన్నవోలు, అంబేరుపురం, ముద్దుర్తి, దుడ్డుపాలెం, నర్సయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో ప్రభుత్వ బంజరు, కొండ పోరంబోకు భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు. 2004 నుంచి ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాల్లో అక్రమంగా డీ ఫారం పట్టాలు పొందారు. వెంకన్నపాలెం రెవెన్యూ పరిధిలో 432, 436 సర్వే నంబర్లలో సుమారు 317 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉండగా టీడీపీ నాయకులే సుమారు 70ఎకరాల మేర సీఎల్డీపీ పథకంలో అక్రమంగా భూ పట్టాలు పొందారు. విషయం ఏమిటంటే.. ఇక్కడ సాగులో ఉన్న వెంకన్నపాలేనికి చెందిన రైతులకు ఈ భూములపై హక్కులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యే సహకారంతో ఇతర ప్రాంతానికి చెందిన మోతుబరులైన టీడీపీ నాయకులకు డీ ఫారం పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఒకే చోట 500 ఎకరాలకు పైబడి బంజరు భూమి ఉండటంతో దొరికిన కాడికి ఆక్రమించుకుని ఎవరికి వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఈ పట్టాలన్నీ రద్దు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదన కూడా పెట్టారు. ఉదాహరణలివిగో... వెంకన్నపాలెం రెవెన్యూలో సర్వే నం.432లో కొండ బంజరులో టీడీపీ నాయకుడు, మా జీ వైస్ ఎంపీపీ ఉరుకుటి పెదరాము నాయుడు 5 ఎకరాలు ఆక్రమించి, మామిడి, జీడిమామిడి, యూకలిఫ్టస్ మొక్కలు వేసి సాగు చేస్తున్నారు. మరో 2 ఎకరాలకు ఆయన భార్య కాంతమ్మ పేరున డీ ఫారం పొందారు. పక్కనే ఉన్న మరో 3 ఎకరాలను కూడా ఆక్రమించేసుకున్నారు. వీటి విలువ అరకోటి పైమాటే. సబ్బవరం రోడ్డులో 530, 531 సర్వే నంబర్లలో రూ.3కోట్ల విలువైన సుమారు 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ స్థానిక నాయకుడు, మాజీ సర్పంచ్ బూరా వెంకటరమణ, ఆయన అనుచరులు కలిసి ఆక్రమించుకున్నారు. ఈ భూమిని అనకాపల్లి, చౌడువాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు రియల్టర్ల్లకు అమ్మేశారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో వారు సర్వే చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ ఆక్రమణలు ఆగలేదు. చోడవరం మండలంలో రూ.15 కోట్ల విలు వైన 120 ఎకరాలు ఆక్రమణలకు గురి కాగా, బుచ్చెయ్యపేట మండలంలో రూ.25 కోట్లు, రావికమతంలో రూ.30కోట్ల విలువైన బంజరు భూములు టీడీపీ నేతల చెరలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. రూ.8 కోట్ల తడిసిన పంచదార గోల్మాల్ గోవాడ సుగర్స్‌లో రూ.8 కోట్ల గోల్మాల్ వ్యవహారంలో టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే కుడిభుజంగా ఉన్న ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు రూ.లక్షలు దోచుకున్నారనే ఆరోపణ ఉంది. హుద్‌హుద్ సమయంలో అధికార టీడీపీకి చెందిన చైర్మన్ గూనూరు మల్లు నాయుడు ఆధ్వర్యంలో పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు సహకారంతో తడిసిన పంచదార అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగింది. దీనిపై రైతులు, అఖిలపక్షాలు ఆందోళనలు చేయడం, అప్పటి ఎండీతో పాటు 6 గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాని ఫ్యాక్టరీలో ఏ పని జరిగిన అది చైర్మన్ దృష్టిలో లేకుండా, ఆయన నిర్ణయం లేకుండా జరగదు. అధికార పార్టీకి చెందిన పాలకవర్గం కావడంతో చైర్మన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా అవసరం లేక పోయిన కాంట్రాక్టు పద్ధతిలో టీడీపీ కార్యకర్తలను చైర్మన్, ఎమ్మెల్యే అనుచరులను గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలో చైర్మన్ రూ.లక్షలు దండుకున్నారు. పాలకవర్గం వచ్చాక విజ్ఞాన, విహార యాత్రలు పేరుతో కొంత, అవసరానికి మించి ఓవరాయిలింగ్ పనులకు అదనపు దుబారా ఖర్చులు చేసి భారీగా చైర్మన్ కమీషన్లు తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, వ్యాపారం శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా నదుల్లో ఇసుక అక్రమ వ్యాపారం వెనుక టీడీపీ నాయకులు ఉన్నారు. తన సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఈ వ్యాపారానికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏటా సుమారు రూ.4 కోట్ల మేర ఇక్కడ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన ఇసుక లారీలు, ట్రాక్టర్లు పట్టుకుంటే వెంటనే ఎమ్మెల్యేనే నేరుగా ఫోన్లు చేసి విడిపించడంతో పోలీసు, రెవెన్యూ, మైన్స్ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చోడవరం జెడ్పీటీసీ సభ్యుడు మత్స్యరాజు కుటుంబసభ్యులతోపాటు గోవాడ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, జుత్తాడ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పల్లా అర్జున, సింహాద్రిపురానికి చెందిన టీడీపీ నాయకుడు, గవరవరం సర్పంచ్ చప్పగడ్డ అప్పలనాయుడు, దుడ్డుపాలేనికి చెందిన కొందరు ఇసుక మాఫియా సభ్యులు, లక్ష్మీపురం, భోగాపురం, విజయరామరాజుపేట, వడ్డాది, రావికమతం, కరక ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల భూములనూ వదల్లేదు రావికమతం మండలంలో ఆక్రమణల్లో ఎక్కువ మేర భూములు కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములే. ఇవన్నీ ఆయా గ్రామాల్లోని నిరుపేద గిరిజన, దళిత మహిళల వద్దే ఉన్నాయి. అయితే కొత్తకోట గ్రామంలో సర్వే నంబర్ 244–2 ఏ లోనూ, 219లో 8సెంట్ల గ్రామ కంఠం భూములు మాత్రం వాస్తవంగా శారద మహిళా మండలి పేరుతోనూ, శ్రీ సీతారామ యువజన సంఘం పేరుతో పట్టాలున్నాయి. ఇవి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెల్లంకి మోదినాయుడు చేతిలో ఉన్నాయి. పి.పొన్నవోలు రెవెన్యూలో 400 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డ బొట్టా సూర్యారావు కుటుంబ సభ్యుల పేరున, విశాఖకు చెందిన బడా వ్యాపారులు చేతుల్లో బినామీ పేర్లతో ఉండగా, కొత్తకోట గ్రామకంఠం భూముల్లో శారద మహిళా మండలి భవనం, దాని పక్కనే సుమారు రూ.40 లక్షలు విలువైన 4 సెంట్ల స్థలం, వెల్లంకి వారి రామకోవెల వద్ద శ్రీ సీతారామ యువజన సేవా సంఘం పేరుతో విలువైన భూమి టీడీపీ నాయకుడి చేతిలో ఉన్నాయి. నీరు–చెట్టు నిధులు దోచుకున్నారు నర్సాపురం గ్రామంలో చెరువును పూడికలు తీయకుండానే తీసినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి గ్రామ జన్మభూమి కమిటీ ప్రతినిధులైన టీడీపీ నాయకులు రూ.15 లక్షల వరకు నిధులు దోచుకున్నారు. ఒకే చెరువుకు మూడుసార్లు పని చేసినట్టుగా చూపించడంతోపాటు గతంలో ఎన్ఆర్జీఎస్ పనులు చేసిన చెరువులోనే నీరుచెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకున్నారు. వీరికి ఎమ్మెల్యే మద్దతు పలకడంతో అధికారులెవ్వరూ చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ విషయమై గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. – దొడ్డి హనుమంతు, నర్సాపురం, చోడవరం మండలం -
ఆ నియోజకవర్గ టికెట్ కోసం క్యూలో టీడీపీ నేతలు
2009లో వెయ్యి ఓట్లు.. 2014లో 805 ఓట్లు.. ఇలా వరుసగా రెండుసార్లు అదృష్టం వరించి అతి తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన నేత బహుశా రాష్ట్రంలో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ఒక్కరే అయిఉంటారు. కానీ ఏం లాభం.. తొమ్మిదేళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా.. ‘నేను ఇది సాధించాను.. నియోజకవర్గ ప్రజలకు ఇది చేశాను’.. అని గర్వంగా చెప్పుకొనే ఒక్క పని కూడా చేయలేకపోయారు. బినామీ పేర్లతో మైనింగ్, క్వారీ వ్యాపారాలు చేసుకోవడం, ఇసుక దందా, నిధుల గోల్‌మాల్‌తో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీల్చి పిప్పి చేయడం, ఆస్తులు సమకూర్చుకోవడం మినహా చోడవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలనే ఆయన మూటకట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో ‘ఇదే చివరి అవకాశం.. మళ్లీ పోటీ చేయను అని బహిరంగంగానే ప్రకటించి సానుభూతి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మూడోసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అంటున్నారు. ప్రజల కనీస ‘రుణం’ తీర్చుకోకుండా మూడో ‘ముచ్చట’ తీర్చుకునేందుకు ఆయన ఉబలాటపడినా.. సరైన ‘ఫలితం’ ఇచ్చేందుకు నియోజకవర్గ ఓటర్లు అప్పుడే రెడీగా ఉన్నారు. ఆయనకే కాదు.. టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగినా ఇదే పరిస్థితి.. ఇది తెలిసి కూడా చోడవరం టికెట్ కోసం పలువురు ఉబలాటపడుతుండటంతో చోడవరం దేశం రాజకీయం అప్పుడే రంగులు మార్చుకుంటోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికార దన్నుతో జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో చాలామంది భూములపై పడి రూ.కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటే.. చోడవరం ఎమ్మెల్యే రాజు మాత్రం గనుల దారి ఎంచుకున్నారు. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలెవరూ పెద్దగా దృష్టి పెట్టని మైనింగ్, క్వారీ పనులు చేపట్టడం, శారదా నదిలో ఇసుక దందా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం.. వెరసి తొమ్మిదేళ్ల కాలంలో ఆయన ఆర్ధికంగా బాగానే కూడబెట్టుకున్నారు. తనను గెలిపించిన చోడవరం నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న అప్రతిష్టను అదే స్థాయిలో మూటకట్టుకున్నారు. తన వెన్నంటి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతల బాగోగులను కూడా పట్టించుకోని సదరు ఎమ్మెల్యే రాజు విపక్ష పార్టీ శ్రేణులను మాత్రం గుర్తించుకుని మరీ టార్గెట్ చేస్తారన్న వాదనలు ఉన్నాయి. మళ్లీ పోటీకి సై గత ఎన్నికల ప్రచారంలో ఈసారికి గెలిపించండి.. ఇదే చివరిసారి.. మళ్లీ పోటీ చేయను.. అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఎమ్మెల్యే అయిన రాజు ప్రజలకు చేసిన వాగ్దానాల్లాగే ఆ మాటను కూడా మరచిపోయినట్టున్నారు. మళ్లీ ఎన్నికల గోదాలో దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు, జన్మభూమి సభల నిర్వహణలపై టీడీపీ అధిష్టానం చేసిన సర్వేల్లో ఈయనకు వరుసగా చివరి స్థానాలే దక్కుతున్నాయి. దీంతో ఈసారి రాజుకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన సొంత సామాజికవర్గం ఓట్లు ఒక్కశాతం కూడా లేకపోయినా పంచాయతీ సర్పంచ్ నుంచి వివిధ పదవులు చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే రాజు రాజకీయ చతురత అర్ధమవుతుంది. అందువల్లే ఈసారి టికెట్ మళ్లీ ఆయనకే వస్తుందని అతని వర్గీయులు చెప్పుకుంటున్నారు. కానీ రెండుసార్లు ఎమ్మెల్యే అయినా పనులేమీ చేయకుండా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్న రాజుకు టికెట్ రావడం అసాధ్యమేనన్న అభిప్రాయం మెజారిటీ టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్న జాబితా పెద్దదవుతోంది. బరిలోకి ‘మల్లు’డు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు ఈసారి ఎమ్మెల్యే సీటుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో సంబంధాలు నెరుపుతూ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అవంతి ఆసక్తి ‘ఎంపీగా చేద్దామా.. ఎమ్మెల్యేగా చేద్దామా.. అసలు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం.. అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా,, లేక విశాఖ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవడమా.. లేదా చోడవరం నుంచి చేద్దామా..’ ఇలా ఇప్పటివరకు ఎటూ తేల్చుకోలేకపోయిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఈసారి చోడవరం నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు.. తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఎంపీగా వస్తూ పోతూ తన కంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని కూడా తయారుచేసుకున్న అవంతి కన్ను చోడవరంపై ఉందన్న వాదన వినిపిస్తోంది. గంటా వారసుడొస్తాడా? చోడవరం నుంచే తొలిసారి శాసనసభకు ఎన్నికైన గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికీ నియోజకవర్గంలో వర్గ ప్రాబల్యం ఉంది. ఎన్నికలకో నియోజకవర్గానికి తిరిగే గంటా ఇప్పటివరకు ఒకసారి పోటీ చేసిన సెగ్మెంట్ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. ఈ లెక్కన గంటా తిరిగి చోడవరానికి రావడం అనుమానంగానే ఉన్నా.. ఆయన కుమారుడు జయదేవ్(రవితేజ)ను మాత్రం ఈసారి ఇక్కడి నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ మధ్య తాను నటించిన తొలి చిత్రం జయదేవ్ విడుదల సందర్భంగా చోడవరం వచ్చిన గంటా కుమారుడు రవితేజ... చోడవరం నుంచి పోటీ చేయాలనుందని చెప్పి టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు. ఎన్నికల్లో పోటీ విషయమై చివరి నిమిషం వరకు ఎటూ తేల్చని గంటా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆయనే చోడవరం వస్తారా.. లేదా తన కుమారుడిని రంగంలోకి దించుతారా అన్నది ఎన్నికల వరకు ప్రశ్నార్ధకమే. ఆడారి కుటుంబం ఇక్కడకొస్తుందా? విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం నుంచి అతని కుమార్తె, కుమారుల్లో ఎవరో ఒకరిని ఇక్కడ బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 11వేల వరకు తమ సామాజిక వర్గ ఓట్లు ఉండటంతో ఆడారి కుటుంబం టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. రెండు సార్లు తన విజయానికి ఆడారి తులసీరావు ఎంతో కొంత సాయం చేశారనే భక్తితో రాజు ఆయన్ను రాజకీయ గురువుగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజు ఈసారి నిలబడకపోతే తమకు మద్దతు ఇవ్వాలని ఆడారి కుటుంబం అతన్ని అడిగే అవకాశముంది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తోడు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఏమీ చేయని రాజు నిర్వాకానికి చోడవరంలో దేశం ప్రభ ఎప్పుడో తగ్గిపోయింది. కేవలం పోటీ కోసమే టీడీపీ నేతలు క్యూ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
జన్మభూమిలో కొందరికే పింఛన్లు ఇవ్వగలం
ఎమ్మెల్యే రాజు బుచ్చెయ్యపేట : రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే అర్హులందరికీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు తెలిపారు. శనివారం బుచ్చెయ్యపేటలో విలేకర్లతో మాట్లాడారు. జన్మభూమిలో కొందరికి మాత్రమే పింఛన్లు, రేషన్‌కార్డులు అందిస్తామని, మిగిలిన వారికి తరవాత పథకాలు అందేలా చూస్తామన్నారు. పోలవరం కాలువ నీరు నియోజకవర్గంలో అన్ని మండలాలకు తీసికొచ్చి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. సంక్రాంతి తరవాత కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం, ఎల్బి పురం ఎత్తిపోతల పథకాలకు శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, గోకివాడ కోటేశ్వరరావు, ఎం.తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సేవ దైవ సేవతో సమానం రావికమతం : దివ్యాంగుల సేవ ఆ దేవుని సేవతో సమానమని అంతా వారి పట్ల సేవా భావంతో ఉండాలని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నారు. ఏపీ సర్వశిక్ష అభియాన్ సహిత విద్యా కార్యక్రమం, జిల్లా వయో వృద్ధులు, వికలాంగ సంక్షేమ శాఖ సౌజన్యంతో రావికమతం భవిత కేంద్రంలోని దివ్యాంగ పిల్లలకు శనివారం 22 ట్రై సైకిల్, వీల్‌చైర్స్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో దివ్యాంగ విద్యార్థికి ఏడాదికి రూ.85వేలు చొప్పున ఖర్చుచేస్తోందన్నారు. ఎంపీపీ దంగేటి రామకృష్ణ, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి, పైలా ఫౌండేషన్ అధినేత సన్యాసిరావు, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు. కాగా 2017 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. -
ఎమ్యెల్యే అసహనం
వికలాంగుడైన స్నేహితుడికి పింఛన్ ఇప్పించాలన్న యువకులు ఏడాదిగా దరఖాస్తు చేస్తున్నా రాలేదని విన్నపం మొక్కుబడి జవాబుతో నిలదీత యువకులను తప్పించి ఎమ్మెల్యేకు దారి ఇచ్చిన పోలీసులు బుచ్చెయ్యపేట : రోడ్డు ప్రమాదంలో క్షత గాత్రుడై కుర్చీకే పరిమితమైన తమ స్నేహితునికి వికలాంగుని పింఛన్ మంజూరు చేయాలని కోరిన యువకులపై చోడవరం ఎమ్మెల్యే రాజు అసహనం వ్యక్తం చేశారు. దీంతో యువకులు ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి గ్రామానికి చెందిన వియ్యపు సోమునాయుడు లారీ క్లీనర్‌గా పని చేస్తూ, మూడేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చెయ్యి పోగొట్టుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో స్నేహితుల సహాయంతో వైద్యసేవలు పొంది పొట్ట నింపుకుంటున్నాడు. ఇతనికి మూడేళ్లుగా వికలాంగ పింఛన్ అందజేయాలని ప్రతి గ్రామ సభలోను, జన్మభూమి, రచ్చబండలో సోమునాయుడు దరఖాస్తులు అందజేసినప్పటికీ నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. ఇదే విషయమై ఆదివారం తమ గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు కారును సోముడు నాయుడు స్నేహితులు కుంచం సాయిరాం, దుర్గవరపు సతీష్‌కుమార్, గోకివాడ నాయుడు, దేవర కిషోర్, పాతరపల్లి సత్తిబాబు తదితరులు ఆపి సోమునాయుడుకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. పై అధికారులతో మాట్లాడి మంజూరు చేస్తానని ఎమ్మెల్యే మొక్కుబడిగా చెప్పడంతో.. ఇదే మాట ఏడాదిగా చెబుతున్నారని స్నేహితులు అన్నారు. సోమునాయుడు కన్నా వెనుక దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ల మంజూరు కాగా, తమ స్నేహితుడికి నేటికీ మంజూరు కాలేదని చెప్పడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం వికలాంగుడిపై జాలి చూపకుండా, కారు కూడా దిగకుండా ఆగ్రహంగా సమాధానం చెప్పడంతో యువకులు మండిపడ్డారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని కారుకు అడ్డుగా నిలిచారు. పోలీసులు ఆ యువకులను చెదరగొట్టి కారుకు దారి ఇచ్చారు. కారులో ఉన్న మండల నాయకులు ఎమ్మెల్యేకు వత్తాసు పలకడంతో యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎంపీ, ఎమ్మెల్యేలకు నిలదీత
చోడవరం టౌన్: మండలంలో లక్కవరం గ్రామంలో గురువారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ అవంతి శ్రీనివాసరావుని, అలాగే ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజుని ఎస్సీ కాలనీ వాసులు సమస్యలపై నిలదీశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం ఎస్సీకాలనీని సందర్శించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరుపెట్టారు. కాలనీలో ఇప్పటి వరకు డ్రైనేజీలు నిర్మించలేదని, వాటర్ ట్యాంకు శిథిలమైందని, కమ్యూని భవనం లేదని, హుద్‌హుద్ తుపానుకు కూలిపోయిన స్టేజ్‌కు ఇంతవరకూ మరమ్మతులు చేపట్టలేదని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ సమస్యలపై అడిగేందుకు ఇది సమయం కాదని, అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించేటప్పుడు దానిగురించి మాట్లాడాలని ఆవేశంగా అన్నారు. అయితే తమ సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలని అక్కడి యువకులు ప్రశ్నించడంతో చోడవరంలోనే నిత్యం ఉంటామని, గ్రామానికి చెందిన నాయకులను తీసుకొని వస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కారానిక చర్యలు తీసుకుంటానని ఎంపీ అవంతి హామీ ఇచ్చారు. దీంతో యువకులు శాంతించారు.