breaking news
minoritees develops
-
సంక్షేమంలోను మైనార్టీలే..
జిల్లాలోని మైనారిటీలు సంక్షేమంలోనూ ‘మైనారిటీ’లమే అన్న రీతిలో వెనుకబడి ఉన్నారు. ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదు. వారి విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జనాభా పరంగా జిల్లాలో 14 శాతం మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ 15 పాయింట్ ఫార్ములా, ఉస్తాద్ లాంటి పథకాల అమల్లో విఫలమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని దుల్హన్, రోష్ని, ఉపకార వేతనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరులోనే పథకాలున్నా అవి లబ్ధిదారులకు అందుతున్నది శూన్యం. బద్వేలు: ఉర్దూ విద్యపై నిర్లక్ష్యం కారణంగా ఐదారేళ్లలో దాదాపు 100కుపైగా ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. దేశంలో ద్వితీయ అధికార భాషగా ఉన్నా ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా నిర్వీర్యమవుతోంది. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. చాలావరకు ఏకోపాధ్యాయ పాఠశాలలుగానే ఉన్నాయి. దీంతో ఇంటర్ ఉర్దూ మీడియంలో చదవాలంటే రాజంపేటకు వెళ్లాల్సిందే. చాలా ప్రాంతాలకు రాజంపేట దూరంగా కావడంతో తమ పిల్లలను తల్లిదండ్రులు పంపడం లేదు. డీఎస్సీలో అరకొర పోస్టులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కు పైగా ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు గతేడాది 29 ఉర్దూ పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రతి పాఠశాలలకు రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టు, ఒక ఉర్దూ పండిట్ పోస్టు మంజూరు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి 87 పోస్టులు మంజూరు కాలేదు. అప్గ్రేడ్పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ కింద నియమితులైన ఉర్దూ వలంటీర్లే దిక్కుగా మారారు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో కేవలం 29 పోస్టుల మాత్రమే మంజూరు చేయడంతో ఉర్దూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఇప్పటికే ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో 30కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దుల్హన్ పథకం అమలులో విఫలం ముస్లింలోని పేద యువతుల పెళ్లిళ్లకు అర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందులో పొందుపరిచిన నిబంధనలు కఠినతరంగా ఉండటంతో చాలా మంది అనర్హులుగా మారుతున్నారు. పేదలను ఆదుకోని ఈ పథకం ప్రవేశపెట్టడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రోష్ని... జోష్ నహి: ముస్లింల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా పాఠశాలలను స్థాపించి వారిని విద్యావంతులుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది.కానీ ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక పాఠశాల కూడా స్థాపించబడలేదు. ముస్లింలు అధికశాతంలో నివసిస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా వరకు ఉర్ధూ పాఠశాలలు మూత పడుతుండగా ఉన్న వాటిలో ఉపాధ్యాయలు కొరత వేధిస్తోంది. మకాన్ దుకాన్ కహా...: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ముస్లింలకు సొంతింటితో పా టు ఆదుంలోనే చిరు వ్యాపారం చేసుకునేందుకు చిన్నస్థాయి ఆంగడి మంజూరు చేసి వారిని ఆర్థికంగా పుష్టివంతులను చేయడమే మకాన్దుకాన్ పథకం ఉద్దేశం. జిల్లాలో ఎక్కడా ఈ పథకం అమలుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు..: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమం నానాటికి తీసికట్టు అన్నట్లుగా అయింది. దేశంలోనే మైనారిటీ మంత్రి లేకుండా మంత్రివర్గం ఉండటం రాష్ట్రంలోనే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వారి స్థితిగతులు బాగు పడ్డాయి. ఆయన మరణాంతరం తిరిగి పరిస్థితి మొదటికే వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పదవి కేటాయించారంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగని వక్ఫ్ భూముల కబ్జా జిల్లాలో వక్ఫ్ బోర్డు కింద పలు దర్గాలు, పీర్లచావిడి, మసీదులకు సంబంధించి 1945 ఎకరాల విలువైన భూమి ఉంది. పలు ప్రాంతాల్లో వక్ఫ్ భూములను ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 244 ఎకరాలు అన్యాక్రాంతం కాగా మరో 70 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉంది. వక్ఫ్ చట్టం 52–ఏ ప్రకారం ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవంటున్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు లేవు. -
మైనార్టీల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయం
చిలమత్తూరు : మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని రక్ష అకాడమీని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా ముస్లిం మైనార్టీ యువకులకు కానిస్టేబుల్స్, జైళ్ల శాఖలో ఉద్యోగాల కోసం రక్ష అకాడమీలో ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందిని ఎంపిక చేసి 300 మందికి రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కో వ్యక్తి మీద ప్రభుత్వం సుమారు రూ.18 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ కమిషనర్ మహమ్మద్ ఇక్బాల్, ఎండీ అరుణకుమారి, సీఈఓ శాస్త్రి, కమాండెంట్ చియన్న, జెడ్పీ చైర్మన్ చమన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు తదితరులు ఉన్నారు.