breaking news
Military court
-
9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు
వాషింగ్టన్: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్‌ఫోర్స్ కల్నల్ డబ్ల్యూ షేన్ కోహెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002–2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది. చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది. మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్ ఖైదా సీనియర్ నేత ఖలీద్ షేక్ మొహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచి, ముస్తఫా అల్ హౌసవి ఉన్నారు. అల్‌ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేసి రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. -
మేజర్ గొగోయ్‌పై ముగిసిన కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఓ యువతితో సన్నిహితంగా ఉంటూ పట్టుబడిన ఆర్మీ మేజర్ లీతుల్ గొగోయ్‌పై సైనిక కోర్టులో విచారణ పూర్తయింది. మేజర్ లీతుల్ గొగోయ్ 2018 మేలో స్థానిక యువతి(18)తో కలిసి శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు. అక్కడ పోలీసులతో గొడవకు దిగడంతో వారు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్..కోర్టు మార్షల్‌కు ఆదేశించారు. మేజర్ గొగోయ్ మారు పేరుతో ఫేస్బుక్లో పరిచయమైనట్లు శ్రీనగర్ యువతి వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు సైనిక న్యాయస్థానం..ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన మేజర్ గొగోయ్ సీనియారిటీని తగ్గించే అవకాశమున్నట్లు సమాచారం. 2017లో కశ్మీర్లో పెట్రోలింగ్ సందర్భంగా రాళ్లు రువ్వుతున్న మూకల నుంచి రక్షణ పొందేందుకు మేజర్ గొగోయ్ తన జీప్ బోయ్నెట్పై ఓ సాధారణ పౌరుడిని కట్టేసిన ఘటనపై తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. -
మోడీ సర్కారుకు కొత్త చిక్కు!
కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను తప్పుబట్టిన సైనిక ట్రిబ్యునల్ ►సుక్నా భూ కుంభకోణం కేసులో ఘాటు వ్యాఖ్యలు ►ఆర్మీ చీఫ్‌గా సైన్యానికి ఆయన మచ్చ తెచ్చారన్న కోర్టు ► సీనియర్ అధికారులను వేధించారు, కోర్టు మార్షల్నూ ప్రభావితం చేశారని మండిపాటు.. ఆర్మీ మాజీ అధికారి రథ్‌పై కోర్టు మార్షల్ రద్దు న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన కేబినెట్ సహచరుడు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ గతంలో సుక్నా భూ కుంభకోణం కేసులో వ్యవహరించిన తీరును సైనిక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైన్యానికి ఆయన మచ్చతెచ్చారని, సీనియర్ అధికారులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారిని వేధింపులకు గురి చేశారని, నిబంధనలను అతిక్రమించి మిలటరీ కోర్టును కూడా ప్రభావితం చేశారని సైనిక దళాల ట్రిబ్యునల్(ఏఎఫ్‌టీ) తాజాగా పేర్కొంది. సైన్యంలోని 33వ పటాళానికి చెందిన మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీకే రథ్‌పై జరుగుతున్న కోర్టు మార్షల్(సైనిక కోర్టు విచారణ)ను రద్దు చేసింది. ఇంతకాలం వేధించినందుకు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు ఆయనకు రూ.లక్ష చెల్లించాలని సైన్యాన్ని ఆదేశించింది. అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్లోని సుక్నా ప్రాంతంలో మిలిటరీ కంటోన్మెంట్‌కు ఆనుకుని ఉన్న 70 ఎకరాల్లో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ఓ ప్రైవేటు బిల్డర్‌కు నిరభ్యంతర పత్రము(ఎన్వోసీ) ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా ఉన్న జనరల్ వీకే సింగ్ దీనిపై సైనిక విచారణ ప్రారంభించారు. రథ్‌ను దోషిగా తేల్చుతూ ఇందుకు శిక్షగా ఆయన రెండేళ్ల సీనియారిటీని తగ్గిస్తూ 2011లో కోర్టు మార్షల్ నిర్ణయించింది. విద్యా సంస్థ ఏర్పాటు అవసరాన్ని సిఫారసు చేసిన అప్పటి ఆర్మీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అవదేశ్ ప్రకాశ్‌పైనా విచారణ కొనసాగించారు. అయితే దీనిపై జనరల్ రథ్ సైనిక ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వీకే సింగ్ ఈ కేసుకు అనుచిత ప్రాధాన్యమిచ్చారని, ఆయన పుట్టిన సంవత్సరాన్ని 1951కి బదులు 1950గా అవదేశ్ ప్రకాశ్ తేల్చినందున ఆర్మీ చీఫ్‌గా సింగ్ పదవీ కాలం 8 నెలలకే పరిమితమైందని రథ్ తన పిటిషన్లో వివరించారు. దీంతో తమపై కక్ష పెంచుకుని ప్రతీకార చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్... కోర్టు మార్షల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. సైన్యం పరిధిలో లేని భూమికి ఎన్వోసీ ఇవ్వడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కాగా దీనిపై జనరల్ రథ్ స్పందిస్తూ.. ఈ తీర్పుతో నా నిర్దోషిత్వం నిరూపితమైందన్నారు. ఇన్నేళ్లుగా తానెంతో వేదనను అనుభవించానన్నారు. సీనియర్ అధికారుల చేతిలో కింది సిబ్బంది బలికాకుండా, ఇలాంటివి పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుపై వీకే సింగ్ ధ్వజం ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని వీకే సింగ్ కోరారు. సైనిక విచారణలో అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. ట్రిబ్యునల్ తనపై వ్యక్తిగత దాడికి దిగిందని, ఈ వ్యవహారంలో తాను అవినీతిని అడ్డుకోడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. 77 పేజీల తీర్పు మొత్తంలో ఎక్కడా స్కాం గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు.