ప్రముఖ హిందూ ఆలయ పేల్చివేతకు కుట్ర
కౌలాలంపూర్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. కౌలాలంపూర్లోని బాతు కేవ్స్ సమీపంలోగల ప్రఖ్యాత హిందూ దేవాలయాన్ని పేల్చివేసేందుకు వారు కుట్ర చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నేడు (ఆగస్టు 31) మలేషియా స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేయనున్న నేపథ్యంలో హిందూ దేవాలయంతోపాటు ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ పరికరాల విక్రయ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని ఐసిస్ కుట్రలు చేసినట్లు మలేషియా పోలీసులు గుర్తించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్రాన్స్ ఇండిపెండెన్స్డే సందర్భంగా ఓ ఉగ్రవాది సృష్టించిన నరమేధంలాంటిదాన్ని మరోసారి క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఈ తరహా దాడులు జరుగుతాయని ముందే ఊహించిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక శాఖ పోలీసులు రెండు ప్రాంతాల్లో 27, 29 తేదీల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
ఇక్కడ బాతు కేవ్స్ ప్రముఖ హిందూ దేవాలయానికి ప్రసిద్ధి. మలేషియాలో జరిగే ప్రతి సినిమా షూటింగ్లో ఈ ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. దాడికి కుట్ర చేసిన ముగ్గురు కూడా 20 నుంచి 30 ఏళ్లలోపు మధ్యవారే. ఈ దాడుల ఆపరేషన్ సమర్థంగా పూర్తి చేసిన వెంటనే సిరియాకు వెళ్లిపోవాలని వారు ప్రణాళికలు రచించుకున్నారట. వారి దగ్గరి నుంచి గ్రనేడ్లు, తుపాకులు, 24 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు లారీ డ్రైవర్ గా మరొకరు పానీయాల విక్రయదారుడిగా, కసాయిదారుడిగా ఇంకొకరు పనిచేస్తున్నారు.