breaking news
kyapsikam
-
క్యాలీ ఫ్లేవర్
క్యాలీ ఫ్లవర్ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కూర పువ్వు ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేయండి. క్యాలీఫ్లవర్ బటర్ మసాలా కర్రీ కావలసినవి: – క్యాలీఫ్లవర్ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్ – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; జీడిపప్పు పలుకులు – 12; కసూరీ మేథీ – అర టీ స్పూను; తాజా క్రీమ్ – పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నీళ్లు, పసుపు వేసి మరిగించాలి ►క్యాలీఫ్లవర్ తరుగును జత చేసి కొద్దిగా ఉడికించి, క్యాలీఫ్లవర్‌ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►స్టౌ మీద పాన్‌లో బటర్ వేసి కరిగాక క్యాలీఫ్లవర్ తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి మూత ఉంచి పది నిమిషాలు ఉడికించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త బటర్ వేసి కరిగాక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం వేసి టొమాటో తరుగు ఉడికేవరకు కలిపి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక నూనె వేసి కాగాక, ఈ మసాలా ముద్దను అందులో వేసి బాగా కలిపి, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు జత చేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►తాజా క్రీమ్, కసూరీ మేథీ జత చేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి. ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1 (మీడియం సైజు); నూనె – 6 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; బంగాళ దుంప – 1 (పెద్దది, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టే బుల్ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ ►గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, పసుపు, బంగాళ దుంప ముక్కలు వేసి బాగా వేయించి, ముక్కలు మెత్తపడేవరకు మూత ఉంచాలి ►క్యాలీ ఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మూత ఉంచాలి ►క్యాప్సికమ్ తరుగు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి (ముక్కలు మరీ మెత్తగా అవకూడదు) ►మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి ►టొమాటో తరుగు జత చేసి మరోమారు కలిపి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►కొత్తిమీర తరుగు జత చేసి దింపేయాలి ►గోబీ ధాబా స్టయిల్ కూర రెడీ అన్నం, రోటీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఫ్రై కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – 3 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; సోంపు – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి ►క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలియబెట్టాలి (నీళ్లు పోయకూడదు) మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీ ఫ్లవర్ తోరణ్ (కేరళ స్టయిల్) కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1; ఉల్లి తరుగు – ఒక కప్పు; కొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర వేసి వేయించాలి ►మినప్పప్పు వేసి మరోమారు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, పసుపు, కరివేపాకు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, క్యాలీఫ్లవర్ మెత్తబడే వరకు ఉడికించాలి ►కొబ్బరి తురుము వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచి దింపేయాలి అన్నంలో రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కుర్మా కావలసినవి: –క్యాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు; క్యారట్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 2; టొమాటో గుజ్జు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; కరివేపాకు – రెండు రెమ్మలు; పల్చటి కొబ్బరి పాలు – ఒక కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – అర కప్పు ; ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – 10; నూనె – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద ఒక పెద్ద పాత్రలో నీళ్లు, క్యాలీ ఫ్లవర్ తరుగు, క్యారట్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి ఉడికించాక, దింపి నీళ్లు ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు, మిరప కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి ►పల్చటి కొబ్బరి పాలు, ఉప్పు, కూరముక్కలు వేసి ఉడికించాలి ►ఐదారు నిమిషాల తరవాత బాగా ఉడికిందనుకున్న తరవాత చిక్కటి పాలు, జీడిపప్పు పలుకులు జత చేసి కలిపి దింపేయాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి ►రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది. గోబీ మసాలా కావలసినవి: – క్యాలీఫ్లవర్ – చిన్నది (ఒకటి); పసుపు – అర టీ స్పూను; ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; బిర్యానీ ఆకు – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టీ స్పూన్లు + ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; గరం మసాలా – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; టొమాటో గుజ్జు – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; జీడిపప్పు ముక్కలు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్నగా విడదీసి పక్కన ఉంచాలి ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడిగి బయటకు తీసేయాలి ►ఒక పాత్రలో క్యాలీఫ్లవర్ తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల తరవాత తీసేయాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మంట కొద్దిగా తగ్గించి నూనె వేసి, కాగాక అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►ఆ బాణలిలో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు, రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, టొమాటో గుజ్జు అన్నీ వేసి బాగా కలియబెట్టాలి ►వేయించిన ఉల్లి తరుగు, మిరప కారం, ఒక కప్పు నీళ్లు జత చేసి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాల తరవాత తాజా క్రీమ్, గరం మసాలా పొడి, నెయ్యి వేసి కలియబెట్టాలి ►జీడిపప్పులతో అలంకరించి తందూరీ రోటీతో కాని, అన్నంతో కాని వేడివేడిగా అందించాలి ►ఈ కూర మనమే తయారుచేసుకుంటే ఇంక రెస్టారెంట్ మీద ఆధారపడక్కర లేదు. మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్ కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; లవంగాలు – 2; ఏలకులు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – 1; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిక్స్డ్ స్ప్రౌట్స్ – ఒక కప్పు (పెసలు, సెనగలు, పల్లీలు... నచ్చినవన్నీ); చెన్నా మసాలా – అర టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – మూడున్నర కప్పులు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పుదీనా – కొద్దిగా. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా వేయించాలి ►చెన్న మసాలా, చాట్ మసాలా, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరవాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి, ఉడికించాలి ►కొద్దిగా ఉడికిన తరవాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికించాలి పావు గంట తరవాత మూత తీసి, ప్లేట్లోకి తీసుకోవాలి ►వేడివేడిగా అందించాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
కుక్డ్... అన్కుక్డ్
పచ్చిగా తినాల్సినవివీ... వండి తినాల్సినవివీ... కూరగాయలు, ఆకుకూరల్లోని పోషకాలను గరిష్టస్థాయిలో పొందాలంటే, వాటిలో కొన్నింటిని పచ్చిగానూ, మరికొన్నింటిని వండుకుని తినాలని బ్రిటీష్ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. క్యారట్లు, టొమాటోలు, క్యాబేజీ, మొలకెత్తిన గింజలు వంటివి వండిన తర్వాత తింటే వాటి ద్వారా రెట్టింపు పోషకాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి పచ్చిగా తింటేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతాయని వివరించారు. పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, కేప్సికమ్లో ఉండే విటమిన్ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే పుష్కలంగా అందుతాయని విశదీకరించారు. శాకాహార పదార్థాలను తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం బాగుంటుందని బ్రిటిష్ డైటీషియన్ హెలెన్ బాండ్ వివరిస్తున్నారు. -
మేకప్!
చేపల్లాంటి కనులు... కేశాలంకరణలో ‘ఫిష్ టెయిల్’ చాలామందికి సుపరిచితమే! ఐ మేకప్‌లోనూ ‘ఫిష్ టెయిల్’ అమితంగా ఆకట్టుకుంటుంది. మన సంప్రదాయం కాస్త.. ఈజిప్షియన్ స్టైల్ ఇంకాస్త జోడించి లైనర్‌తో కంటిని తీర్చిదిద్దితే ‘ఫిష్ టెయిల్’ కనువిందు చేస్తుంది. యువతులను ఆకర్షిస్తున్న ఈ స్టైల్‌ను అనుసరించాలంటే... కంటి ముందు భాగం నుంచి చివరల వరకు రెప్పలకు లైనర్‌తో పొడవైన గీతలా తీర్చాలి. ఆ తర్వాత లైనర్‌తో మరింత చిక్కగా వచ్చేలా కనురెప్ప మధ్య భాగం నుంచి చివర వరకు దిద్దాలి. ఇలాగే పై కనురెప్పను (టియర్ లైన్ నుంచి చివరి వరకు) తీర్చిదిద్దాలి. ఐ షాడోతో పై కనురెప్పను అలంకరించాలి. మేలిమి! క్యాప్సికమ్! ఎరుపురంగు క్యాప్సికమ్ ఉడికించి లేదా పచ్చిగా ఇతర పండ్లు, కూరగాయల సలాడ్స్‌తో కలిపి తింటే ఆరోగ్యానికి, చర్మ కాంతికి మేలైన ప్రయోజనాలు కలుగుతాయి.. క్యాప్సికమ్‌లో శరీరానికి కావ ల్సిన విటమిన్ ‘సి’, పీచుపదార్థాలు, విటమిన్ ‘బి6’ సమృద్దిగా వుంటాయి. దీంట్లో అధిక మొత్తంలో ఉండే కెరొటినాయిడ్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి, చర్మంపై ముడతలను నివారిస్తుంది. అందుకని మధ్య వయసు వారు దీనిని తప్పక తీసుకోవాలి. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు రోజూ కొద్ది మోతాదులో దీనిని ఆహారంలో భాగంచేసుకుంటే మొటిమల సమస్య దరిచేరదు. మచ్చలు ఏర్పడవు. దీంట్లో కొవ్వు తక్కు వగా ఉండటం వల్ల అధికబరువుకు దూరంగా ఉండవచ్చు. మెరుగు! చెడువాసన వస్తుంటే... కాలంతో సంబంధం లేకుండా కొందరి శరీరం నుంచి చెడు వాసన వస్తుంటుంది. దీనిని పోగొట్టడానికి పెరఫ్యూమ్లు, పౌడర్ల వాడకం కన్నా దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల 99 శాతం సమస్యను నివారిం చవచ్చు. సాధారణంగా చెడు వాసన అనేది స్వేదరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోయి, చెమటతో కలిసి జిడ్డుగా ఏర్పడుతుంది. ఈ జిడ్డును సరిగ్గా వదిలించకపోతే చెడు వాసన ఎక్కువవుతుంది. ఈ సమస్య నివారణకు ... రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ‘బాడీ బ్రష్’తో చర్మంపై వలయకారంలా మృదువుగా రుద్దాలి. పైకి, కిందకు రుద్దుతూ ఇలా స్నానం చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. వాడిన బ్రష్‌ను ప్రతిసారి పొడిగా ఉంచాలి. 6 నెలలకు ఒకసారి పాత బ్రష్‌ను మారుస్తూ ఉండాలి. ఒకరు వాడిన బాడీ బ్రష్‌ను మరొకరు వాడకూడదు.