క్యాలీ ఫ్లేవర్‌

Special Dishes for Cauliflower - Sakshi

క్యాలీ ఫ్లవర్‌ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ కూర పువ్వు ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్‌ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్‌ చేయండి.

క్యాలీఫ్లవర్‌ బటర్‌ మసాలా కర్రీ
కావలసినవి: – క్యాలీఫ్లవర్‌ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; జీడిపప్పు పలుకులు – 12; కసూరీ మేథీ – అర టీ స్పూను; తాజా క్రీమ్‌ – పావు కప్పు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; ఉప్పు – తగినంత.

తయారీ:
►క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో నీళ్లు, పసుపు వేసి మరిగించాలి
►క్యాలీఫ్లవర్‌ తరుగును జత చేసి కొద్దిగా ఉడికించి, క్యాలీఫ్లవర్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►స్టౌ మీద పాన్‌లో బటర్‌ వేసి కరిగాక క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
►కొద్దిగా నీళ్లు జత చేసి మూత ఉంచి పది నిమిషాలు ఉడికించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి
►అదే బాణలిలో మరి కాస్త బటర్‌ వేసి కరిగాక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
►టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం వేసి టొమాటో తరుగు ఉడికేవరకు కలిపి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక నూనె వేసి కాగాక, ఈ మసాలా ముద్దను అందులో వేసి బాగా కలిపి, క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు జత చేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి
►తాజా క్రీమ్, కసూరీ మేథీ జత చేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.

ధాబా స్టయిల్‌ క్యాలీఫ్లవర్‌
కావలసినవి: – క్యాలీ ఫ్లవర్‌ – 1 (మీడియం సైజు); నూనె – 6 టేబుల్‌ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; బంగాళ దుంప – 1 (పెద్దది, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టే బుల్‌ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ:
►గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి శుభ్రంగా కడగాలి 
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, పసుపు, బంగాళ దుంప ముక్కలు వేసి బాగా వేయించి, ముక్కలు మెత్తపడేవరకు మూత ఉంచాలి 
►క్యాలీ ఫ్లవర్‌ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మూత ఉంచాలి
►క్యాప్సికమ్‌ తరుగు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి (ముక్కలు మరీ మెత్తగా అవకూడదు)
►మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి
►టొమాటో తరుగు జత చేసి మరోమారు కలిపి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి
►కొత్తిమీర తరుగు జత చేసి దింపేయాలి
►గోబీ ధాబా స్టయిల్‌ కూర రెడీ  అన్నం, రోటీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది.

క్యాలీఫ్లవర్‌ ఫ్రై
కావలసినవి: క్యాలీఫ్లవర్‌ తరుగు – 3 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత; పేస్ట్‌ కోసం; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; సోంపు – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి శుభ్రంగా కడగాలి
►స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి
►క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి
►ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి
►క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి బాగా కలియబెట్టాలి (నీళ్లు పోయకూడదు) మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి)
►కొత్తిమీరతో అలంకరించాలి
►అన్నం, చపాతీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది.

క్యాలీ ఫ్లవర్‌ తోరణ్‌ (కేరళ స్టయిల్‌)
కావలసినవి: – క్యాలీ ఫ్లవర్‌ – 1; ఉల్లి తరుగు – ఒక కప్పు; కొబ్బరి నూనె – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ:
►క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర వేసి వేయించాలి
►మినప్పప్పు వేసి మరోమారు వేయించాలి
►ఉల్లి తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి
►పచ్చి మిర్చి తరుగు, పసుపు, కరివేపాకు జత చేసి మరోమారు కలియబెట్టాలి
►క్యాలీఫ్లవర్‌ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, క్యాలీఫ్లవర్‌ మెత్తబడే వరకు ఉడికించాలి
►కొబ్బరి తురుము వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచి దింపేయాలి  అన్నంలో రుచిగా ఉంటుంది.

క్యాలీఫ్లవర్‌ కుర్మా
కావలసినవి: –క్యాలీఫ్లవర్‌ తరుగు – ఒక కప్పు; క్యారట్‌ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – 3 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 2; టొమాటో గుజ్జు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; కరివేపాకు – రెండు రెమ్మలు; పల్చటి కొబ్బరి పాలు – ఒక కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – అర కప్పు ; ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – 10; నూనె – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►స్టౌ మీద ఒక పెద్ద పాత్రలో నీళ్లు, క్యాలీ ఫ్లవర్‌ తరుగు, క్యారట్‌ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి ఉడికించాక, దింపి నీళ్లు ఒంపేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి వేయించాలి
►టొమాటో గుజ్జు, మిరప కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి
►పల్చటి కొబ్బరి పాలు, ఉప్పు, కూరముక్కలు వేసి ఉడికించాలి
►ఐదారు నిమిషాల తరవాత బాగా ఉడికిందనుకున్న తరవాత చిక్కటి పాలు, జీడిపప్పు పలుకులు జత చేసి కలిపి దింపేయాలి
►కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి
►రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది.

గోబీ మసాలా
కావలసినవి: – క్యాలీఫ్లవర్‌ – చిన్నది (ఒకటి); పసుపు – అర టీ స్పూను; ఆవ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; బిర్యానీ ఆకు – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టీ స్పూన్లు + ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; గరం మసాలా – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; టొమాటో గుజ్జు – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా క్రీమ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; జీడిపప్పు ముక్కలు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ:
►క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్నగా విడదీసి పక్కన ఉంచాలి
►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి అందులో క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి శుభ్రంగా కడిగి బయటకు తీసేయాలి
►ఒక పాత్రలో క్యాలీఫ్లవర్‌ తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల తరవాత తీసేయాలి
►స్టౌ మీద బాణలి వేడయ్యాక మంట కొద్దిగా తగ్గించి నూనె వేసి, కాగాక అందులో క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేవరకు వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి
►అదే బాణలిలో ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►ఆ బాణలిలో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు, రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి
►క్యాలీఫ్లవర్‌ తరుగు, టొమాటో గుజ్జు అన్నీ వేసి బాగా కలియబెట్టాలి
►వేయించిన ఉల్లి తరుగు, మిరప కారం, ఒక కప్పు నీళ్లు జత చేసి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి
►మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాల తరవాత తాజా క్రీమ్, గరం మసాలా పొడి, నెయ్యి వేసి కలియబెట్టాలి
►జీడిపప్పులతో అలంకరించి తందూరీ రోటీతో కాని, అన్నంతో కాని వేడివేడిగా అందించాలి
►ఈ కూర మనమే తయారుచేసుకుంటే ఇంక రెస్టారెంట్‌ మీద ఆధారపడక్కర లేదు.

మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ పులావ్‌
కావలసినవి: నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; లవంగాలు – 2; ఏలకులు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – 1; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాప్సికమ్‌ తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ – ఒక కప్పు (పెసలు, సెనగలు, పల్లీలు... నచ్చినవన్నీ); చెన్నా మసాలా – అర టీ స్పూను; చాట్‌ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – మూడున్నర కప్పులు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పుదీనా – కొద్దిగా.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి
►ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి
►క్యాప్సికమ్‌ తరుగు, టొమాటో తరుగు, మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ వేసి బాగా వేయించాలి
►చెన్న మసాలా, చాట్‌ మసాలా, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి
►జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి
►మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరవాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి,  ఉడికించాలి
►కొద్దిగా ఉడికిన తరవాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికించాలి  పావు గంట తరవాత మూత తీసి, ప్లేట్‌లోకి తీసుకోవాలి
►వేడివేడిగా అందించాలి.

– నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top