breaking news
kumram bheem
-
భీం ధామం అద్భుతం..!
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల అడవి బిడ్డ కుము రం భీం ధామం చాలా అద్భుతంగా ఉందని మహా రాష్ట్ర ఆదివాసీ సొసైటీ చైర్మన్ శ్యాంరావు కోట్నాకే, రాజూర తహసీల్దార్ వరోవింద్రవోటి అన్నారు. మంగళవారం మండలంలోని చారిత్రాత్మక ప్రదేశమైన జోడేఘాట్‌ను వారు సందర్శించారు. కుమురం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. నాలుగు గోత్రాలకు చెందిన జెండాల ముందు పూజలు చేశారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. వారికి క్యూరేటర్ మంగంరావు అవగాహన కల్పించారు. ఆదివాసీల ఆభరణాలు, విల్లులు, వాడుకునే వస్తువులను చూశారు. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం కోయ, గోండు, కొలాం, నాయక్‌పోడ, పెర్సపేన్, పహండి కుపర్‌లింగో తదితర దేవతలకు పూజలు చేశారు. గిరిజన సంప్రదాయం, ఆదివాసీ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు. -
కుమ్రంభీమ్‌ను పట్టించిన ఇన్ఫార్మర్ను వేటాడి..
సాక్షి, బెల్లంపల్లి: భూమికోసం.. భుక్తికోసం, నిజాం నిరంకుశ, రాచరిక పాలన విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు బాసటగా నిలిచాయి. ‘దొర నీబాంచెన్ కాల్మోక్తా..’ అని మోకరిల్లిన గ్రామీణులు కమ్యూనిస్టు సాయుధ దళాలకు ఆయుధమయ్యారు. పోరాటయోధులకు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. పోలీసుల కంటపడకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న పల్లెలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇందులో బెల్లంపల్లి మండలం లంబాడితండా ఒకటి. నిజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగించిన పోరాటంలో ఆ గ్రామస్తులు పోషించిన పాత్ర అద్వితీయం, అనిర్వచనీయం. షెల్టర్ జోన్ బెల్లంపల్లి.. బెల్లంపల్లి ఏరియాను రహస్య స్థావరంగా చేసుకుని కమ్యూనిస్టు దళాలు సాయుధ పోరాటం చేశాయి. కమ్యూనిస్టు యోధులు బాసెట్టి గంగారాం, జె.కుమారస్వామి, పోతుగంటి పోశెట్టి తదితరులు పోరాటంలో ముఖ్యభూమిక పోషించారు. అజ్ఞాతవాసం గడిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), జన్నారం, ఉట్నూర్, చెన్నూర్ ప్రాంతాల్లో కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహించారు. ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్న దొరలు, భూస్వాముల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భూస్వాముల ఇళ్లపై కరువు, మెరుపు దాడులు సాగించి ధాన్యం, మిర్చి, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లి పేదలకు పంచారు. దొరలు, భూస్వాముల భూముల దస్తావేజులను బహిరంగంగా దహనం చేశారు. సాయుధ దళాల చర్యలు దొరలు, భూస్వాములకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఈక్రమంలో సాయుధ దళాలపై పోలీసు నిఘా పెరగడంతో దళనాయకులు షెల్టర్ జోన్‌గా భావించిన లంబాడితండా గ్రామానికి వచ్చి తలదాచుకునేవారు. అజ్ఞాతవాసం గడుపుతున్న దళాన్ని పోలీసులబారిన పడకుండా ఆ గ్రామస్తులు కడుపులో దాచుకుని కాపాడుకున్నారు. ఉద్యమకారులు చీల విఠల్, చీల శంకర్ ఓ రోజు ఏం జరిగిందంటే..? లంబాడితండా గ్రామానికి ఓ రోజు పోలీసులు ఆకస్మికంగా చేరుకుని ఇంటింటా సోదాలు ప్రారంభించారు. అప్పటికే దళనాయకుడు కుమారస్వామి తలదాచుకున్నాడు. పోలీసులు వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు క్షణాల్లో దళ నాయకుడికి ఉప్పందించారు. అంతలోనే ఆశ్రయం పొందిన ఇంటి దరిదాపుల్లోకి పోలీసులు రావడాన్ని పసిగట్టిన కుమారస్వామి మహిళ వేషధారణ వేసుకున్నాడు. ఇంట్లోకి పోలీసులు రాగానే మహిళ ముసుగులో పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు. గ్రామానికి చెందిన సుకాసి బాలయ్య, సుకాసి పోశం, సల్లం పోశం తదితరులు దళ నాయకులకు నమ్మిన కొరియర్లుగా వ్యవహరించినట్లు చెబుతుంటారు. కుమ్రంభీమ్‌ను పట్టించిన ఇన్ఫార్మర్ను.. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడుతున్న గిరిజన వీరుడు కుమ్రం భీంను అంతమొందించడానికి నిజాంసైన్యం ఎప్పటినుంచో పన్నాగం పన్నింది. పోలీసులపై తిరుగుబాటు చేసిన భీం కంటగింపుగా మారాడు. భీమ్ ఆచూకీ కోసం నిజాం పోలీసులు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజనుడైన మడావి కొద్దు భీమ్ గురించి పోలీసులకు ఉప్పందించడంతో నిజాంసైన్యం కుమ్రంభీమ్ ను కాల్చి చంపింది. వీరుడి ఆచూకీ చెప్పడంతోనే పోలీసులు కాల్చి చంపినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే గిరి గూడాలు అగ్నిజ్వాలలై మండుతున్నాయి. ఆ సమాచారం తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు అగ్రనేతలు రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్‌రావుకు అందడంతో తీవ్రంగా స్పందించారు. నిజాం సైన్యానికి ఉప్పందించిన ఇన్ఫార్మర్ను గుర్తించి తుదముట్టించాలని తిర్యాణి ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాసెట్టి గంగారం నాయకత్వంలోని సాయుధదళాన్ని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మడావి కొద్దును వేటాడిన సాయుధ దళం కాల్చి చంపి పగ తీర్చుకుంది. భూస్వామిగా భావించి... ఆసిఫాబాద్‌కు చెందిన భూస్వామి పైకాజీని తుదముట్టించాలని నిర్ణయం తీసుకుంది. తాండూర్ మండలం రాంపూర్ గ్రామానికి పైకాజీ వచ్చినట్లు దళానికి సమాచారం అందింది. ఓ ఇంట్లో పైకాజీ నిద్రపోతున్నట్లు తెలుసుకుని దళం దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆరోజు పైకాజీ అక్కడికి రాకపోవడంతో బతికిపోయారు. మంచంలో నిద్రిస్తున్న భూస్వామి గుమస్తా చనిపోయాడు. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తప్పుడు సమాచారంతోనే ఆ ఘటన జరిగినట్లు సాయుధదళం తర్వాత గుర్తించింది. కరువు దాడుల్లో ప్రసిద్ధి సాయుధ పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టు దళాల్లో బాసెట్టి గంగారాం నాయకత్వంలోని దళం ఎంతో చురుకునైదిగా ప్రసిద్ధిగాంచింది. దొరలు, భూస్వాముల ఇళ్లపై కరువు, మెరుపుదాడులు చేయడంలో నేర్పరిగా చెబుతుంటారు. తిర్యాణి మండలం గిన్నేదరి, రోంపల్లి, గంగాపూర్ శివారు అటవీప్రాంతాల్లో ఆ దళం ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఆసిఫాబాద్, ఉట్నూర్, జన్నారం ప్రాంతాల్లో ఉన్న భూస్వాములు, దొరల ఇళ్లపై మెరుపుదాడులు సాగించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ ప్రాంతాల్లోని అటవీవనాలను నరికి వేయించి గిరిపుత్రులకు భూ పంపిణీ చేశారు. భూస్వాముల ఇళ్లపై ఎన్నోమార్లు కరువు దాడులు చేసి వస్తు, సామగ్రిని అపహరించుకుపోయి అన్నార్థులకు పంపిణీ చేశారు. రజాకార్లపై పోరులో అద్దాల మేడ చెన్నూర్: రజాకార్లపై పోరాటంలో అద్దాలమేడ ప్రధాన భూమిక పోషించింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని సిరొంచాలో ఆనాడు నిర్మించిన అద్దాలమేడ నేటికి చెక్కుచెదరకుండా ఉంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో.. ప్రాణహితనది అవతలి ఒడ్డున ఉన్న సిరోంచాలోని అద్దాలమేడ నుంచే రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా ఇండియా మిలటరీ సైనిక్‌లు పోరాటాలు చేశాయి. ఇక్కడినుంచి హైదరాబాద్ నిజాంపై సైతం సైనికులు ఉద్యమాన్ని నిర్వహించారు. 1906లో అప్పటి కలెక్టర్ గ్లాస్‌ఫోర్డ్ ఈ అద్దాలమేడ నిర్మించారు. ఆనాడు కలెక్టర్ బంగ్లాగా అద్దాలమేడను వినియోగించేవారు. అప్పటి మద్రాసు ప్రెస్డెన్సీలో అప్పటి గోదావరి జిల్లా కేంద్రంగా సిరోంచా ఉండేది. సిరొంచా జిల్లా పరిధిలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, మరోవైపు జన్నారం, లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉండేది. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల విభజన తర్వత ఈ పట్టణాలు ఆంధ్రప్రదేశ్‌లో కలువగా.. సిరొంచా మహారాష్ట్రలో భాగమైంది. మహారాష్ట్రలోని సిరొంచాలో గల అద్దాల మేడ అద్దాలమేడలో ఎన్నో విశేషాలు.. మూడంతస్తులు కలిగిన ఈ భవనంపైకి ఎక్కితే చుట్టూ 12 కిలోమీటర్లు మేర కన్పిస్తుంది. ఇలాగే శత్రువుల రాకను సైనికులు కనిపెట్టేవారు. భవనం లోపలి నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర సొరంగం ఉండేది. ఈ సొరంగం ద్వారానే సైనికులకు ఆయుధాలు అందుతుండేవని ప్రచారంలో ఉంది. ఇక్కడి నుంచి పోరాడిన ఇండియన్ మిలటరీ సైనికుల్లో సుమారు 211 మంది స్వాతంత్య్ర సంగ్రామంలో తుది శ్వాస విడిచారు. వేలాదిమంది రజాకార్లను మట్టి కరిపించారు. చెన్నూర్, నస్పూర్, కోటపల్లి మండలాలకు చెందిన అప్పటి సమరయోధులు ఇండియన్ మిలటరీ సైనికులకు రజాకార్ల కదలికలపై సమాచారాన్ని చేరవేసేవారు. సైనికులు వాడిన ఫిరంగులు కాలగర్భం లో కలసిన ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కన్పించడం విశేషం. 1947లో మద్రాసు గవర్నర్ పట్టాభిసీతారామయ్య ఈ భవనంలో బసచేశారు. రజాకార్ల ఉద్యమం అనంతరం నిజాంతో చర్చలు జరపడానికి అప్పటి హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దివంగత పీఎం పీవీ సైతం అద్దాలమేడను సందర్శించారు. ఇలా రజాకార్ల వ్యతిరేక ఉద్యమకేంద్రంగా ప్రధాన భూమిక పోషించి మరాఠీ, హిందీ, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన అద్దాలమేడ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రహస్య జీవనం సాగించారు చెన్నూర్: చెన్నూర్ పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథాసూరి రజాకార్ల నిరంకుశ పాలను వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. అధిష్టానం ఆదేశాల మేరకు చెన్నూర్‌లో ఉండి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. నిజాం సర్కార్ నిర్భంధం పెరగడంతో రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రెండేళ్లు అజ్ఞాత జీవనాన్ని సాగించాడు. 1946లో సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరోంచ గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి తరలివెళ్లారు. విశ్వనాథ్సూరి శత్రువులపై దాడి ఎలా చేయాలో అక్కడ ఏడాదిపాటు శిక్షణ పొందారు. అక్కడినుంచి బల్లార్ష శిబిరానికి చేరుకుని స్వాతంత్య్రానంతరం జనజీవనంలో కలిసిపోయారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 1952 నుంచి 57 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 1957 నుంచి నేటివరకు స్థానికుడు చెన్నూర్ ఎమ్మెల్యే అయ్యింది కేవలం విశ్వనాథాసూరి మాత్రమే. – సుడిగాల విశ్వనాతాసూరి (ఫైల్) – సుడిగాల విశ్వనాతాసూరి (ఫైల్), దండనాయకులు గోపాల కిషన్‌రావు నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఆసిఫాబాద్: నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లా. చాందా క్యాంపులో శిక్షణ పొందాను. సాయుధ పోరాటంతో నైజాంను తరిమికొట్టాం. నైజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. తెలంగాణ విమోచన దినం రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నా.. తెలంగాణలో నిర్వహించకపోవడం శోచనీయం. – దండనాయకులు గోపాల కిషన్‌రావు, స్వాతంత్ర సమరయోధుడు,ఆసిఫాబాద్ -
‘కుమ్రం భీం’ జిల్లా అని ఉండాలి
పేరు విషయంలో చరిత్రాత్మక తప్పు జరగకుండా చూడాలి ఏవోకు ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం వినతి ఆదిలాబాద్ రూరల్ : ప్రస్తుతం జిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరుణంలో, ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రం భీం పేరును పలువురు కొమరం భీంగా పేర్కొంటూ తప్పుగా ప్రచురించడం, పలకడం చేస్తున్నారని.. కొమరం భీం బదులు కుమ్రం భీంగా ఉండాలని ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుడ్మెత భీంరావు మాట్లాడుతూ, కుమ్రం భీం పేరిట జిల్లాను ఏర్పాటు చేయడంపై యావత్ ఆదివాసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుమ్రం భీం వర్ధంతికి హాజరైన సీఎం చంద్రశేఖర్‌రావు గిరిజనులపై వరాల జల్లు కురిపించారని పేర్కొన్నారు. జిల్లాలోని జోడేఘాట్‌లో కుమ్రంభీం స్మారక ఉద్యానవనం, స్మతి చిహ్నం ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. ఆదివాసీ పోరాటయోధుడికి ప్రభుత్వం గుర్తింపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అయితే 22–08–2016న ఆదిలాబాద్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తూ జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కుంరంభీం జిల్లా పేరును సైతం తప్పుగా కొమరంభీం జిల్లాగా ప్రచురించారని పేర్కొన్నారు. కానీ ఆదివాసీ గోండు తెగలో కొమురం అనే ఇంటి పేరు లేనేలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీంకు, జోడేఘాట్‌కు చారిత్రక గుర్తింపునిచ్చిన ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు సరైన పేరుగా కుమ్రం భీం లేదా కుంరం భీం జిల్లాగా నామకరణం చేసి చరిత్రత్మాక తప్పిదం కాకుండా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉయికే విఠల్, రాష్ట్ర నాయకుడు సిడాం వామన్రావ్ పాల్గొన్నారు.