breaking news
Kidney Related Problems
-
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
తన అనారోగ్యంపై అరుణ్ జైట్లీ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన అనారోగ్యంపై స్పందించారు. కిడ్నీ సంబంధిత సమస్యతో తాను బాధపడుతున్నాని గురువారం ట్విటర్లో వెల్లడించారు. ఇన్ఫెక్షన్ బారిన పడ్డాననీ, దీనికి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నియంత్రిత వాతావరణంలో తాను ప్రస్తుతం ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నానన్నారు. తన చికిత్సకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలను తనను ట్రీట్ చేస్తున్న వైద్యులు నిర్ణయిస్తారని ట్వీట్ చేశారు. కాగా జైట్లీ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారనీ, వైద్యులు జైట్లీకి త్వరలో శస్త్రచికిత్స కూడా నిర్వహించనున్నారంటూ మంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జైట్లీ లండన్ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అనారోగ్యం నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపిగా తిరిగి ఎన్నికైన తర్వాత ఆర్థిక మంత్రి సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. కొత్తగా ఎన్నుకోబడిన 58 మంది సభ్యులలో 55 మంది ఎంపీలు ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేయని ముగ్గురు సభ్యులలో జైట్లీ కూడా ఉన్నారు. I am being treated for kidney related problems & certain infections that I have contracted. I am therefore currently working from controlled environment at home. The future course of my treatment would be determined by the doctors treating me. — Arun Jaitley (@arunjaitley) April 5, 2018 -
మూత్రపిండాలు చెడిపోయాయి...
నా వయసు 51. పదహారేళ్లుగా మధుమేహవ్యాధి ఉంది. ప్రస్తుతం ఇన్సులిన్ మీద ఉన్నాను. నాలుగేళ్ల క్రితం రక్తంలో క్రియాటినిన్ ఎక్కువైన కారణంగా డయాలసిస్ చేశారు. అలా మూడునాలుగు సార్లు జరిగింది. కానీ ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల రెండేళ్లనుంచి డయాలసిస్ చేయించుకోవడం లేదు. కేవలం మందుల పైనే ఉన్నాను. ప్రస్తుతం పాదాల వాపు, నీరసం, రక్తహీనత ఉన్నాయి. నా సమస్యలకు ఆయుర్వేదంలో మంచి మందులు సూచించండి. - కనకాద్రి, కర్నూలు మీరిచ్చిన వివరాలను బట్టి చిరకాలంగా మధుమేహవ్యాధిని సరిగా నియంత్రించుకోలేదని తెలుస్తోంది. ఈ వ్యాధి వల్ల చాలా ఉపద్రవాలున్నాయి. వాటిలో ఒకటి ‘కిడ్నీ ఫెయిల్యూర్’. దీని తీవ్రతను బట్టి మీలో కలిగే లక్షణాలు మారుతుంటాయి. మధుమేహం ప్రధానంగా ఓజోక్షయం (ధాతుపుష్టి, క్షమత్వం తగ్గడం) సంభవించడానికి దారితీస్తుంది. డయాలసిస్‌కి ప్రత్యామ్నాయంగా కేవలం మందులతో ఫలితాలు రాబట్టడం కష్టమే అయినప్పటికీ... మీరున్న పరిస్థితుల్లో ఈకింది సూచనలను పాటించి మందులు వాడండి. 40 రోజులు వాడిన తర్వాత కిడ్నీ ఫంక్షన్‌కు సంబంధించిన కొన్ని పరీక్షలు (ఉదా: రక్తంలోని క్రియాటినిన్, యూరియా, పొటాషియమ్ మొదలైనవి) చేయించుకోండి. అదేవిధంగా ఇన్సులిన్‌ను సరైన మోతాదులో వాడుతూ రక్తంలోని చక్కెరపాళ్లను అదుపులోకి తెచ్చుకోండి. ఆహారం: తీపి, ఉప్పు, మాంసాహారం, నూనెపదార్థాలను విసర్జించండి. శాకాహారం మంచిది. మొలకలు, గ్రీన్సలాడ్లు ఎక్కువగా తినండి. పుల్కాలు, ముడిబియ్యం, ఉడికించిన కూరలు మితమైన ప్రమాణంలో తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. విహారం: శక్త్యానుసారం తేలికపాటి వ్యాయామం చెయ్యండి. రెండుపూటలా ‘ప్రాణాయామం’ తప్పనిసరిగా చెయ్యాలి. ధూమ, మద్యపానాలు, ఇతర వ్యసనాలు ఉంటే వాటిని వెంటనే త్యజించాలి. ఔషధం : అమైల్క్యూర్ డి.ఎస్. క్యాప్సూల్స్ : ఉదయం 2, సాయంత్రం 2 పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 గుడూచీసత్వం (తెల్లగా మెత్తగా పౌడర్లా ఉంటుంది) మూడు గ్రాముల మోతాదుతో మూడు పూటలా నీళ్లతో కలిపి సేవించాలి. వీటితో పాటు, మీకు వీలుంటే ‘బూడిద గుమ్మడికాయ’ ముక్కని దంచి 3 చెంచాల రసం తీయండి. దానికి రెండు చెంచాలు ఉసిరికాయ రసం, చెంచా తులసి ఆకుల రసం కలిపి, రోజూ రెండు పూటలా తాగండి. గమనిక: ఎక్కిళ్లు, తలతిరగడం, మూర్ఛ వంటి అత్యవసర లక్షణాలు కలిగితే మాత్రం ఉపేక్షించకుండా తక్షణం వైద్యనిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్


