మూత్రపిండాలు చెడిపోయాయి... | Ayurveda Health Tips by Vuddula Laxmi Narsimha Shastry | Sakshi
Sakshi News home page

మూత్రపిండాలు చెడిపోయాయి...

Aug 5 2013 11:29 PM | Updated on Sep 1 2017 9:40 PM

మూత్రపిండాలు చెడిపోయాయి...

మూత్రపిండాలు చెడిపోయాయి...

మీరిచ్చిన వివరాలను బట్టి చిరకాలంగా మధుమేహవ్యాధిని సరిగా నియంత్రించుకోలేదని తెలుస్తోంది. ఈ వ్యాధి వల్ల చాలా ఉపద్రవాలున్నాయి.

 నా వయసు 51. పదహారేళ్లుగా మధుమేహవ్యాధి ఉంది. ప్రస్తుతం ఇన్సులిన్ మీద ఉన్నాను. నాలుగేళ్ల క్రితం రక్తంలో క్రియాటినిన్ ఎక్కువైన కారణంగా డయాలసిస్ చేశారు. అలా మూడునాలుగు సార్లు జరిగింది. కానీ ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల రెండేళ్లనుంచి డయాలసిస్ చేయించుకోవడం లేదు. కేవలం మందుల పైనే ఉన్నాను. ప్రస్తుతం పాదాల వాపు, నీరసం, రక్తహీనత ఉన్నాయి. నా సమస్యలకు ఆయుర్వేదంలో మంచి మందులు సూచించండి. 
 - కనకాద్రి, కర్నూలు
 
 మీరిచ్చిన వివరాలను బట్టి చిరకాలంగా మధుమేహవ్యాధిని సరిగా నియంత్రించుకోలేదని తెలుస్తోంది. ఈ వ్యాధి వల్ల చాలా ఉపద్రవాలున్నాయి. వాటిలో ఒకటి ‘కిడ్నీ ఫెయిల్యూర్’. దీని తీవ్రతను బట్టి మీలో కలిగే లక్షణాలు మారుతుంటాయి. మధుమేహం ప్రధానంగా ఓజోక్షయం (ధాతుపుష్టి, క్షమత్వం తగ్గడం) సంభవించడానికి దారితీస్తుంది. డయాలసిస్‌కి ప్రత్యామ్నాయంగా కేవలం మందులతో ఫలితాలు రాబట్టడం కష్టమే అయినప్పటికీ... మీరున్న పరిస్థితుల్లో ఈకింది సూచనలను పాటించి మందులు వాడండి. 
 
 40 రోజులు వాడిన తర్వాత కిడ్నీ ఫంక్షన్‌కు సంబంధించిన కొన్ని పరీక్షలు (ఉదా: రక్తంలోని క్రియాటినిన్, యూరియా, పొటాషియమ్ మొదలైనవి) చేయించుకోండి. అదేవిధంగా ఇన్సులిన్‌ను సరైన మోతాదులో వాడుతూ రక్తంలోని చక్కెరపాళ్లను అదుపులోకి తెచ్చుకోండి. 
 
 ఆహారం: తీపి, ఉప్పు, మాంసాహారం, నూనెపదార్థాలను విసర్జించండి. శాకాహారం మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్‌లు ఎక్కువగా తినండి. పుల్కాలు, ముడిబియ్యం, ఉడికించిన కూరలు మితమైన ప్రమాణంలో తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. 
 
 విహారం: శక్త్యానుసారం తేలికపాటి వ్యాయామం చెయ్యండి. రెండుపూటలా ‘ప్రాణాయామం’ తప్పనిసరిగా చెయ్యాలి. ధూమ, మద్యపానాలు, ఇతర వ్యసనాలు ఉంటే వాటిని వెంటనే త్యజించాలి. 
 
 ఔషధం : అమైల్‌క్యూర్ డి.ఎస్. 
 క్యాప్సూల్స్ : ఉదయం 2, సాయంత్రం
 2  పునర్నవాది మండూర (మాత్రలు):  ఉదయం 1, రాత్రి 1  గుడూచీసత్వం (తెల్లగా మెత్తగా పౌడర్‌లా ఉంటుంది) మూడు గ్రాముల మోతాదుతో మూడు పూటలా నీళ్లతో కలిపి సేవించాలి. 
 
 వీటితో పాటు, మీకు వీలుంటే ‘బూడిద గుమ్మడికాయ’ ముక్కని దంచి 3 చెంచాల రసం తీయండి. దానికి రెండు చెంచాలు ఉసిరికాయ రసం, చెంచా తులసి ఆకుల రసం కలిపి, రోజూ రెండు పూటలా తాగండి. 
 
 గమనిక: ఎక్కిళ్లు, తలతిరగడం, మూర్ఛ వంటి అత్యవసర లక్షణాలు కలిగితే మాత్రం ఉపేక్షించకుండా తక్షణం వైద్యనిపుణుడిని సంప్రదించండి.
 
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి 
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), 
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement