breaking news
kadavakallu
-
పెళ్లి చేసుకుని ఐదేళ్లుగా పత్తాలేడు
సాక్షి, అమరావతిబ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకొని గర్భం దాల్చాక మొహం చాటేసి దక్షిణాఫ్రికాలో రహస్యంగా ఉంటున్న తన భర్తను, తనను కలపాలని, లేదా చర్యలైనా తీసుకోవాలని ఓ మహిళ ‘స్పందన’లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లుకు చెందిన ఎ.శృతిసుహాసిని దక్షిణాఫ్రికాలో బ్యూటీ థెరపిస్టుగా పనిచేసేది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా చీపునుంతలకు చెందిన సందీప్‌రెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2011 జనవరి 1న వీరు అక్కడే రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు మగబిడ్డ పుట్టాడు. సందీప్‌రెడ్డి తన భార్యను పుట్టింట్లోనే ఉంచేసి దక్షిణాఫ్రికా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. పెళ్లి సమయంలో రూ.30 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చామని.. కానీ, అదనంగా మరో రూ.50 లక్షలు తెస్తేనే తమను దక్షిణాఫ్రికా తీసుకెళ్తానని చెప్పాడని శృతిసుహాసిని వాపోయింది. తన భర్త దక్షిణాఫ్రికాలో రహస్యంగా ఉంటున్నాడని, ఆయన ఆచూకీ తెలుసుకుని తాను అతనితో కలిసి ఉండేలా చూడాలని, లేదా వారిపై చర్యలైనా తీసుకోవాలని సోమవారం ‘స్పందన’లో తన ఎనిమిదేళ్ల కుమారుడు హర్దీప్‌సాయితో కలిసి విజయవాడ సబ్‌కలెక్టర్ ధ్యాన్‌చంద్రను బాధితురాలు ఆశ్రయించింది. -
కడవకల్లులో దేహశుద్ధి
పుట్లూరు: కడవకల్లులో ప్రభాకర్ అనే యువకుడిని సోమవారం రాత్రి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారని పోలీసులు తెలిపారు. గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే కాలనీకి చెందిన ప్రభాకర్ చనువుగా మాట్లాడుతున్నాడనే కారణంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద చెట్టుకు కట్టేసి మరీ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని విడిపించారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.