breaking news
Jitendra Vyas
-
ఇవి నరేంద్ర మోడీ ఫొటోలు కావు... జిరాక్స్ కాపీలు
ఈ ఫొటోల్లో ఉన్నది నరేంద్ర మోడీ కాదు.. ఆయన జిరాక్సు కాపీలు. అచ్చు మోడీలా ఉన్న మోడీ అభిమానులు. వీళ్లంతా మోడీలా తయారై ఎన్నికల ప్రచారంలోకి దూకారు. గతంలో మోడీ మాస్కుల పేరిట ఒక ఎన్నికల్లో, త్రీ డీ మోడీ పేరిట ఒక ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నరేంద్ర మోడీ ఈ సారి మాస్కులు, హోలోగ్రాములు కాదు. ఏకంగా తన జిరాక్సు కాపీలనే రంగంలోకి దించేశారా? ఇప్పటికి కనీసం ఇలాంటి మూడు నరేంద్ర మోడీ జిరాక్సు కాపీలు ఎన్నికల ప్రచారంలో హడావిడిగా తిరిగేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ కి చెందిన పీటీ టీచర్ అభినందన్ పాఠక్ ఉత్తరప్రదేశ్, దాని సమీప రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో తిరిగి నరేంద్ర మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని మలాడ్ లోని వికాస్ మహంతే కూడా అచ్చు గుద్దినట్టు నరేంద్ర మోడీలా ఉంటారు. ఇంకేం ... ఆయన తెల్లగడ్డం, బట్టతల, ఖాదీ కుర్తాలతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. శివసేన-బిజెపి కూటమికోసం ఆయన పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీకి దొరికే ట్రీట్ మెంటే మహంతేకి కూడా లభిస్తోంది. ఆయనతో ఫోటోలు దిగేందుకు అందరూ తహతహలాడుతున్నారు. ఇక మూడో ఆయన పేరు జితేంద్ర వ్యాస్. ఈయన ఉండేది నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వడోదరలో. 'నరేంద్ర మోడీ... నువ్వు దేశమంతా ప్రచారం చెయ్యి... నేను వడోదరలో ప్రచారం చేస్తాను' అని వ్యాస్ గారు భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద ముగ్గురు మోడీలు ఎక్కడికక్కడ సంచలనం సృష్టిస్తూంటే అసలు మోడీ మాత్రం దేశమంతా చుట్టేస్తున్నారు. -
మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం
వడోదరా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్త ప్రచారంలో బిజీబిజీగా ఉంటే ఆయన కోసం ఓ ‘డూప్లికేట్’ మోడీ రంగంలోకి దిగాడు. ఆయన పోలికలతో ఉన్న జితేంద్ర వ్యాస్ అనే స్థానికుడు మోడీ విజయం కోసం వడోదరాలో ప్రచారం చేస్తున్నాడు. మోడీ వారణాసితోపాటు వడోదరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాస్ వడోదరాలో శుక్రవారం ఆలయంలో పూజ చేసి ప్రచారం ప్రారంభించాడు. ‘మోడీ దేశమంతా తిరుగుతూ ప్రచార కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేడు. అందుకే ఆయనకు మద్దతుగా వడోదరాలో నేను ప్రచారం చేసి రికార్డు స్థాయిలో గెలిపిస్తా’ అని వ్యాస్ చెప్పాడు.