breaking news
jayashenkar district
-
ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు
కోల్‌బెల్ట్ : జయశంకర్ జిల్లా (భూపాలపల్లి) ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో భాగంగా కేటాయించిన భవనాలను ఆయా శాఖలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. దసరా పండుగ రోజున జయశంకర్ జిల్లా పరిపాలన ప్రారంభించేలా పనులు ముమ్మరం చేశారు. మంజూర్‌నగర్ బంగ్లా ఏరియాలోని సింగరేణి అతిథిగృహాన్ని కలెక్టర్ కార్యాలయం, భూపాలపల్లి పట్టణంలోని దేవాదుల అతిథిగృహాన్ని ఆర్డీఓ కార్యాలయం, ఐటీఐ నూతనభవనాన్ని 12 శాఖలకు, సింగరేణి ఎంవీటీసీ భవనాన్ని జిల్లా పోలీసు కార్యాలయానికి, కమ్యూనిటీహాల్‌ను పోలీసు విభాగానికి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని డీఈఓ కార్యాలయానికి ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయాలకు అనుగుణంగా ఆయా శాఖలకు చెందిన అధికారుల గదులు, మౌలిక వసతుల కల్పన పనులు చేస్తున్నారు. దసరా పండుగ నాటికి కార్యాలయాలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దిలా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. -
చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం
11న జిల్లా ఆవిర్భావ వేడుకలు 10వేల బైక్‌ల ర్యాలీతో అధికారులకు ఘనస్వాగతం స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా ఆవిర్భావ వేడుకలను చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఏర్పాటులో భాగంగా ఈ నెల 11న భూపాలపల్లి పట్టణంలో 60 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసేందుకు రానున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 10వేల బైక్‌లతో భారీ ర్యాలీ, పూలవర్షం, బాణసంచా, కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని వివరించారు. ఉద్యోగులు దసరా రోజున విధులకు హాజరవుతున్నందున వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని సంఘాలు, పార్టీల నాయకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్న జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా భూపాలపల్లిలో భవనాలు, సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భవనాల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ఎంతగానో కృషి చేసిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేరోజున పట్టణంలోని సింగరేణి వర్క్‌షాప్ కూడలి వద్ద 7 అడుగుల ఆచార్య జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాలకు మంత్రి చందూలాల్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధును ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్, వివిధ మండలాల నాయకులు మేకల సంపత్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, మోడెం ఉమేష్‌గౌడ్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, గోవిందుల శ్యామ్ పాల్గొన్నారు. -
క్వార్టర్ల కోసం సింగరేణి జీఎంను కలిసిన ఏఎస్పీ
కోల్‌బెల్ట్ : జయశంకర్ జిల్లాలో పోలీస్ అధికారుల నివాసాల కోసం సింగరేణి క్వార్టర్స్ కేటాయించాలని ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి కోరారు. ఈమేరకు సోమవారం ఆయన సింగరేణి భూపాలపల్లి పట్టణంలో జీఎం పాలకుర్తి సత్తయ్యను కలిశారు. దసరా నుంచి భూపాలపల్లి జిల్లా కార్యకలాపాలు ప్రారంభం కానున్నందున ఏఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు మంజూర్‌నగర్ బంగ్లా ఏరియాలో 8 ఎంఏ క్వార్టర్స్‌ను కేటాయించాలని కోరారు. కాగా మంజూర్‌నగర్ సమీపంలోని వెయ్యి క్వార్టర్స్ నిర్మాణ స్థలం వద్ద పోలీస్‌శాఖ పరేండ్ గ్రౌండ్‌కు 30 ఎకరాలు కేటాయించినట్లు జీఎం సత్తయ్య తెలిపారు.