breaking news
Jayammu nischayammura
-
శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పెళ్లి
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా హీరోగా దూసుకుపోతున్న శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ పెళ్లి. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే నిజం పెళ్లి కాదులెండి. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సంచలన విజయం సాధించిన జంబ లకిడి పంబ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుంది. కమెడియన్ గా కొనసాగుతూనే హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాతో పాటు అనసూయతో కలిసి ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలోనూ నటిస్తున్నాడు. Malli Pelli 🙈 #jambalakidipambamovie @Siddhi_Blue pic.twitter.com/aeEfPrLjUd — Srinivasareddy (@Actorysr) 5 January 2018 -
మరోసారి హీరోగా..!
కమెడియన్ గా, సహాయ పాత్రల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో కథానాయకుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత కమెడియన్ గా బిజీ అవ్వటంతో హీరో పాత్రలకు కొద్ది రోజులు దూరంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి మరోసారిర హీరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా రైట్ రైట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మను డైరెక్షన్ లో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడనుంది. హీరోగా అవకాశాలు వస్తున్నా... సహాయపాత్రల్లోనూ కొనసాగుతూ సత్తా చాటుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. -
దేవత నువ్వంటూ... భక్తుడు అయ్యాడే!
‘‘అమ్మాయి నడిచే దారి తెలుసు.. ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే దారి తెలీదు! తన కోసం యుద్ధం చేయడం తెలుసు.. తనతో కలసి ఏడడుగులు వేసే మార్గం తెలీదు! మౌనంగా ప్రేమించే యువకుల మనసిది’’ అంటున్నారు పాటల రచయిత వి.వి.రామాంజనేయులు. ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. సమైక్యంగా నవ్వుకుందాం... అనేది ఉపశీర్షిక. పూర్ణ కథానాయికగా నటిస్తున్నారు. రవిచంద్ర స్వరకర్త ఈ సినిమాలోని ‘ఓ రంగుల చిలకా..’ పాటతత్వం గురించి, ఆ పాట రచయిత వి.వి.రామాంజనేయులు మాటల్లోనే.. పల్లవి: ఓ రంగుల చిలకా.. చూడే నీ యెనకా అలుపంటూ లేనీ ఈ పిల్లాడి నడకా ఓ బంగరు తళుకా.. చుట్టూ ఏం కనకా ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ప్రేమలో పడితే.. రంగులన్నీ అమ్మాయిలోనే కనిపిస్తాయి. అమ్మాయి ఎటు వెళితే, అలుపనేది లేకుండా అబ్బాయి కూడా అటు వెళతాడు. అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. సాధారణంగా అడుగులు వేస్తుంటే చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వినకుండా ఎక్కడికి వెళ్తున్నావని రాశాను. పాపం.. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు? ఒకడు మౌనంగా ప్రేమిస్తున్నాడని! కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి.. నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే నాకు తెలిసినంత వరకూ.. ఓ అమాయకత్వంతో కూడిన అబ్బాయిలే ప్రేమలో పడతారు. (నవ్వుతూ..) అమాయకులే ప్రేమిస్తుంటారు. ప్రేమికుడిని పసివాడితో పోల్చడానికి కారణమదే. మా సినిమాలో హీరో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు ఏం మాట్లాడకుండా అమ్మాయిల వెనకాలే దూరంగా తిరుగుతుంటారు. పోనీ, అమ్మాయిలు వీళ్లను చూస్తారా? అంటే, ప్చ్... ఏం పట్టించుకోకుండా వెళ్తుంటారు. మనోళ్లు మాత్రం ఒక్కసారి అమ్మాయి వెనక్కి తిరిగి చూడకపోతుందా? అని ఎదురు చూపుల్లో తమ సమయాన్నంతా గడిపేస్తుంటారు. ప్రపంచంతో ఆ ప్రేమికుడికి సంబంధం లేదు. అమ్మాయే వాడి ప్రపంచం. ప్రేయసి గురించి ఆలోచిస్తూ, ఆమె కలల్లో గడిపేస్తూ నిద్ర కూడా మరిచిపోతుంటాడు. చరణం: నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వేవేలడుగులైనా నడిచే ఘనుడే ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమించిన అమ్మాయిని గొప్పగా చూడడం మొదలు పెడతాడు. అతడి స్నేహితులకు, మిగతావాళ్లకు విచిత్రంగా అనిపించే అంశం ఏంటంటే.. వీడు అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ, ఎవరైనా ఆ అమ్మాయిపై కామెంట్ చేసినా.. ఇంకేమైనా చేసినా.. గొడవకు దిగుతాడు. ఎంత భయస్తుడైనా ఆ సమయంలో యుద్ధానికి సిద్ధమవుతాడు. కొన్ని ప్రేమకథలు ఏడడుగులు (పెళ్లి వరకూ వెళ్లకుండా) వేయకుండా ఆగుతాయి. కానీ, ఎప్పటికైనా ఆ అమ్మాయితో ఏడడుగులు వేస్తాననే ఆశతో వేల మైళ్లు నడుస్తూనే ఉంటాడు. కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నువు నడిచే దారిని వదలని ప్రేమికుడే గుండె తలపుల్నే.. తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే మనకు ప్రపంచంలో ఏ దారైనా తెలియకపోవచ్చు. ఏ దారి ఎక్కడికి వెళుతుందో? తెలుసుకోవడం కష్టమే. కానీ, ప్రేమించిన అమ్మాయి దారి తెలుసుకోవడం చాలా సులువు. కాలేజీకి వెళ్తుందా? ఆఫీసుకు వెళ్తుందా? అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమె చిరునామా ఏంటి? ప్రతిరోజూ ఏ దారిలో వెళ్తుంది? అనే విషయాలను చాలా సులభంగా తెలుసుకుంటాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడైనా గాళ్ ఫ్రెండ్ వెళ్లే దారిని మాత్రం మరువడు. అమ్మాయి వచ్చినా.. రాకపోయినా.. ఆ టైమ్‌కి దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవత అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తుడిలా.. ఎప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? అని గుండె గది తలుపులు తెరిచి ఎదురు చూస్తుంటాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ మనకు కనిపిస్తారు. కొందరు ఆ స్టేజి నుంచి వచ్చిన వాళ్లయితే.. మరికొందరు ఆ స్టేజిలోనే ఉన్నారు. తర్వాతి తరంలో ఆ స్టేజికి వచ్చేవాళ్లు తప్పకుండా ఉంటారు. సాధారణంగా యవ్వనంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక అమ్మాయి వెనక తిరుగుతారు. ప్రపంచంలో అందరూ తప్పకుండా తిరుగుంటారు. మోడర్న్ యుగంలో ఓ అమ్మాయిని చూడగానే వెళ్లి, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ధైర్యంగా చెప్పే అబ్బాయిలకు కూడా ఏదో ఒక సమయంలో ఈ తరహా సందర్భం ఎదురయే ఉంటుంది. అటువంటి వాళ్లందరూ... ఈ పాట చూడగానే ‘నా కోసమే ఈ పాటను రాశారా?!’ అని భావించాలి. ఎక్కడ ఈ పాట వినపడినా తమకు తాము గుర్తు రావాలనే ఉద్దేశంతో రాసిన పాట ఇది. వి.వి.రామాంజనేయులు గీత రచయిత ఇంటర్వ్యూ: సత్య పులగం -
కాపీ కొట్టలేదు!
‘‘భాగ్యరాజా, జంధ్యాల, వంశీ స్టయిల్ కామెడీ మా ‘జయమ్ము... నిశ్చయమ్మురా’లో ఉంటుంది. ఇందులోని వినోదం కాపీ కొట్టింది కాదు. మన మూలాలు తెలియజేయడం కోసమే దేశవాళీ వినోదం అంటున్నాం’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ఆయన హీరోగా, పూర్ణ హీరోయిన్గా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయమ్ము... నిశ్చయమ్మురా’ ఈ నెల 25న విడుదలవుతోంది. నేడు పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ ‘గీతాంజలి’ చిత్రంలో నేను హీరో అనుకోవడం లేదు. ఓ క్యారెక్టర్ చేశానని భావిస్తున్నా. కానీ, ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ కథ నాతోనే నడుస్తుంది. శివరాజ్ ఈ చిత్రంతో పెద్ద డెరైక్టరవు తాడు. తొలుత ‘సర్వమంగళం’ టైటిల్ అనుకున్నాం. నెగటివ్‌గా ఉంటుందని మార్చాం’’ అన్నారు. -
బాబూ... చిట్టీ!
కమెడియన్ అంటే మగవాడేనా? ఆడవాళ్లు నవ్వించలేరా? శ్రీలక్ష్మిని చూసి కూడా ఆ మాట అనగలమా! ఒక్క శ్రీలక్ష్మి... వంద కమెడియన్ల పెట్టు. జంధ్యాల ప్రసాదించిన కామెడీ వరాల్లో శ్రీలక్ష్మి మేలైన వరం. కాదు కాదు... ఫిమేలైన వరం. శ్రీలక్ష్మి చేసిన అయస్కాంతాల్లాంటి అనేక పాత్రల్లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లోని ఈ కాంతం పాత్ర ప్రత్యేకమైనది! రాంబాబు, సూరిబాబు... ఇద్దరూ జంట కవుల్లాంటి వాళ్లు. ఒకే మంచంలో తిని, ఒకే కంచంలో పడుకునేంత... సారీ సారీ... ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత ఫ్రెండ్సాతి ఫ్రెండ్సు. రాంబాబుకు తలపోటు వస్తే, సూరిబాబు శారిడాన్ వేసుకునేంత క్లోజన్నమాట. వీళ్లిద్దరూ ఓ ఇంట్లో అద్దెకుంటుంటారు. అప్పటివరకూ హుషారుగా రోడ్లన్నీ బలాదూర్‌గా తిరిగేసిన ఈ జంట... ఇంటి సమీపానికి రాగానే మాత్రం టెన్షనైపోతారు. అటెన్షనైపోతారు. ధైర్యం కోసం ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, పిల్లుల్లా నడుస్తూ ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. ఎందుకంత భయం? ఆ ఇంట్లో అల్సేషియన్ కుక్క ఉందా?... లేదు. రెంట్ బాకీ ఉందా? అస్సల్లేదు. కుక్క ఉంటే కరిపించుకుని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్స్ అయినా చేయించుకోవచ్చు. రెంట్ కట్టాలనుకుంటే నానాగడ్డీ కరిచి, వాళ్ల గడ్డం... వీళ్ల గడ్డం పుచ్చుకుని అప్పు తీసుకోవచ్చు. మరేంటి ప్రాబ్లమ్? ఓకే... మీకంత ఆరాటంగా ఉంటే... పదండి ముందుకు... పదండి తోసుకు... పోదాం పోదాం. గోపాలం అండ్ కాంతం ఇంటికి. తలుపు చప్పుడైతే కాంతం వెళ్లి తీసింది. రాంబాబు, సూరిబాబు లోపలకొచ్చి, చాలా బుద్ధిగా పైన రూమ్కెళ్లడానికి మెట్లు ఎక్కబోతున్నారు. వాళ్లు ఊహించిన ప్రమాదం ఎదురవ్వనే అయ్యింది. ‘‘అవునూ... ఎందుకింత లేటయ్యింది?’’ అడిగింది కాంతం. ‘చచ్చాంరా దేవుడోయ్’ అనుకున్నారిద్దరూ. రాంబాబు నీళ్లు నములుతూ ‘‘ఊళ్లోకి ‘శనిదేవుని లీలలు’ అనే భక్తి సినిమా వచ్చింది అక్కయ్యగారూ’’ అని చెప్పాడు. కాంతం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ‘‘ఏంటి... మిమ్మల్నే... భక్తి సినిమాకెళ్లొస్తున్నారా?’’ అనడిగింది. ఇద్దరూ బుర్రలూపారు. అంతే... కాంతం కళ్లల్లో మున్సిపాల్టీ ట్యాప్ ఓపెనైపోయింది. ఇక్కడ రాంబాబు గుండెను ఎవరో డోలు వాయిస్తున్న ఫీలింగ్. సూరిబాబుకేమో తనే సన్నాయిలా అయిపోయినట్టు డ్రీమ్. పి... పి....పీ... పీ... డుం... డుం... వచ్చేసింది సునామీ. ‘బాబూ... చిట్టీ’ అంటూ కాంతం గభాల్న రాంబాబును గట్టిగా కౌగిలించుకుంది. బోనులో పడ్డ ఎలకలాగా రాంబాబు తెగ కంగారుపడిపోయాడు. కాంతమ్మక్కయ్య కౌగిలిని విడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ‘‘ఏవండీ... పొరపాటైపోయిందండీ’’ అని వాపోయాడతను. అయినా కాంతం వదిలితేగా! ‘‘మా చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబూ’’ అని తెగ కన్నీరు మున్నీరైపోయింది. చివరకు ఎప్పటికో వదిలిందామె. పులి నోట్లో చిక్కుకుని తప్పించుకున్న కుందేలు పిల్లలాగా బెదిరిపోయాడు. ఇప్పుడర్థమైందిగా... రాంబాబు, సూరిబాబులు ఎందుకంత భయపడుతున్నారో! ఈ కాంతానికి ఓ విషాదకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. చెబితే మీరు కూడా కరిగిపోయి ‘బాబూ! చిట్టీ’ అంటూ ఎవరో ఒకరిని వాటేసుకోవడం ఖాయం! వీళ్లకు ఒక్కగానొక్క సంతానం. పేరు చిట్టి. 21 ఏళ్లు నిండకుండానే నూరేళ్లూ నిండిపోయాయి పాపం. ఆ చిట్టిని మర్చిపోవడం ఆమె వల్ల కావడం లేదు. చిట్టి జ్ఞాపకాలు ఈ చిట్టి తల్లిని టీవీ సీరియల్లాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా ‘మాట’ అంటే చాలు... ‘మా చిట్టి కూడా సేమ్ టూ సేమ్ ఇలానే...’ అంటూ వాళ్లను వాటేసుకుని మరీ భోరున విలపించడం ఆమెకు కామనైపోయింది. ఈ ‘చిట్టి’తల్లి బాధితుల్లో చాలామంది ఉన్నారు. పాలవాడు... కూరలవాడు... పోస్ట్‌మేన్... మన రాంబాబు, సూరిబాబు... ఇలా కోకొల్లలు. అయితే అందరికీ ఆమె తల్లిప్రేమ తెలుసు కాబట్టి, ఎవరూ అపార్థం చేసుకోరు. రాంబాబు బాగా పడ్డాడు. బురదలో కాదండోయ్... ప్రేమలో. అమ్మాయిది సూరిబాబు వాళ్ల ఊరే. ఆ ప్రేమ ప్రయత్నంలో భాగంగా ఆ ఊళ్లోనే తిష్ఠ వేశాడు మన రాంబాబు. గుళ్లూ గోపురాలు తిరుగుతూ పుణ్యదంపతులైన గోపాలం-కాంతం కూడా ఈ ఊరొచ్చారు. లటుక్కున దొరికేశాడు రాంబాబు. సరే.. అని ఓ ప్లాన్ వేశాడు. తన అమ్మానాన్నల్లా నటించమని అడిగాడు. వాళ్లు ఓకే... సూరిబాబు నాన్నది ఓ చిత్రమైన కేరెక్టర్. పేరు పటేల్. నైజాం నుంచి ఇక్కడికి ఇల్లరికం వచ్చాడు. మహా సినిమా పిచ్చి, డబ్బు పిచ్చి. ఇంటికొచ్చి ఎవరు కాఫీ తాగినా, టిఫినీ తిన్నా చేతిలో బిల్లు పెట్టేస్తాడు. గోపాలానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆయన ఎంచక్కా కాఫీ జుర్రుకుంటూ తాగేసరికి, ఈ పటేల్ వచ్చి చేతిలో బిల్లు పెట్టాడు. గోపాలం షాక్. ‘‘నేను పైసలు కాడ బరాబర్ ఉంటా’’ చెప్పాడు పటేల్. అంతే... ఈ మాటలు విని లోపల్నుంచీ పరిగెత్తు కుంటూ వచ్చింది కాంతం. ‘‘ఏమన్నారు... పైసలు దగ్గర కచ్చితంగా ఉంటాననా?’’ అనడిగింది. పటేల్ అయోమ యంగా ‘‘అవును’’ అన్నాడు. అంతే... డోలు- సన్నాయి ఒక్కసారిగా పి... పి... పీ... పీ... డుం... డుం... అంటూ మోగాయి. ‘‘బాబూ... చిట్టీ’’ అంటూ కాంతం, పటేల్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడింది. గోపాలం అడ్డుపడ్డాడు. ‘‘కాంతం ఆగిపో... ఆవేశపడకు... కావలించుకుంటే చొక్కా నలిగిపోయిందని బిల్లు చేతిలో పెడతాడు’’ అన్నాడు గోపాలం. దాంతో కాంతం తన ఆప్యాయతానురాగాభి మానాల ప్రేమ సముద్రాన్ని తనలోనే దాచేసుకుంది. ఈ పటేల్ చెప్పే సైన్మా కథలకు గోపాలం బుర్ర వాచి పోతోంది. ఎంత తప్పించుకుందామన్నా వదిలి చావడే. చివరకు ఈ ‘బాబూ చిట్టీ’ నామస్మరణే గోపాలానికి పటేల్ పీడ వదిలేలా చేసింది. అదెలా అంటే... పటేల్ ‘పాండవ వనవాసం’ సైన్మా కథ చెబుతున్నాడు. ‘‘ఎస్వీవోడు తొడగొడుతున్నాడు... సావిత్రమ్మ ఏడుస్తోంది... భీముడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు...’’ ఇలా పటేల్ ఊకదంపుడుగా చెబుతూనే ఉన్నాడు. గోపాలంలో ఆగ్రహం బ్యారికేడ్లు దాటేసింది. దాంతో తానే రివర్స్‌లో కథ చెప్పడం మొదలుపెట్టాడు గోపాలం. ఎన్టీవోడంటాడు... గవాస్కరంటాడు... హేమమాలిని మనవరాలంటాడు... మహ్మద్ బీన్ తుగ్లక్ అంటాడు... ఇక చూడాలి పటేల్ తిప్పలు. బెంబేలెత్తిపోయాడు. ‘‘తమ్మీ... ఇంక నన్ను వొదిలేయరాదే... ఒడ్డున పడ్డ చేప తీరునయిపోయింది నా బతుకు’’ అని వాపోయాడు పటేల్. అప్పుడే ఎంటరైంది కాంతం. ‘‘ఏమన్నావ్ బాబూ... ఒడ్డున పడ్డ చేపా?’’ అనడిగింది. పటేల్ బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. ‘‘బాబూ... చిట్టీ’’ అని కాంతం వాటేసుకోవడానికి సిద్ధమైంది. పటేల్ బిక్కచచ్చిపోయాడు. దెబ్బకు పరుగో... పరుగు... అదండీ... ఈ ‘చిట్టి’ కథ. ఇక కథ కంచికి... మీరు ఇంటికి. ఎక్స్‌క్యూజ్‌మీ... మీరుండేది సొంతిల్లా? అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అయితే కాంతంగారు లేరు కదా..! హహ్హహ్హహ్హహ్హ... - పులగం చిన్నారాయణ ఇన్స్పిరేషన్ ఎవరో ఉండే ఉంటారు! ‘‘ఈ పాత్ర అనే కాదు... జంధ్యాల గారు సృష్టించిన ఏ పాత్ర అయినా చిరంజీవుల్లా కలకాలం నిలిచి పోయేవే. 26 ఏళ్ల క్రితం చేసిన ఈ పాత్ర ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మార్మోగిపోతూనే ఉంది. ఈ క్రెడిట్ ఓ రకంగా ‘సాక్షి’ టీవీకి దక్కుతుంది. వాళ్లు ఈ ‘బాబూ! చిట్టీ’ని సెటైరిక్‌గా బాగా వాడుకోవడంతో, అన్ని గేమ్ షోల్లోనూ, న్యూస్ చానల్స్‌లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. జంధ్యాలగారు చుట్టూ ఉన్న సమాజం నుంచి, మనుషుల నుంచి ప్రేరణ పొంది పాత్రలు సృష్టిస్తుంటారు. ఈ పాత్రక్కూడా కచ్చితంగా ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది. నాకైతే తెలీదు.’’ - శ్రీలక్ష్మి ఆ నాదస్వరం బిట్ తప్ప మరేదీ అక్కడ అతకదు! ‘‘జంధ్యాల గారి దర్శకత్వంలో తొలిసారిగా మేము సంగీతం అందించిన చిత్రం ‘జయమ్ము... నిశ్చయమ్మురా!’. శ్రీలక్ష్మి ‘బాబూ చిట్టీ’ అనే డైలాగ్ చెప్పినచోటల్లా ప్రత్యేకమైన రీరికార్డింగ్ మ్యూజిక్ బిట్ పెట్టాలనుకున్నాం. కె.వి. మహదేవన్ సంగీతంలో వచ్చిన పాత తమిళ సూపర్‌హిట్ ‘తిల్లానా మోహనాంబాళ్’లో శివాజీగణేశన్ నాదస్వర విద్వాంసుడు. పద్మిని నర్తకి. అందులో పద్మిని, శివాజీ జంట మీద వచ్చే ‘నలందానా....’ (బాగున్నావా అని అర్థం) అనే పాట పెద్ద హిట్. పాటలో హీరోయిన్ పలికే ఆ మాటకు, ‘పి...పి.. పీ..పీ...’ అంటూ నాదస్వరంలో బదులిస్తాడు హీరో. సరిగ్గా ఆ పాపులర్ నాదస్వరం బిట్‌నే ఈ ‘బాబూ చిట్టీ’కి వాడితే కామెడీ బాగా పండుతుందని అనిపించింది. అది తప్ప మరేదీ అక్కడ అతకదని అనిపించింది. అలా చేసిన ప్రయోగం ఇవాళ్టికీ అందరూ చెప్పుకొనే పెద్ద హిట్ కామెడీ సీన్ అయింది.’’ - రాజ్ - కోటి జంటలో ఒకరైన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: జయమ్ము నిశ్చయమ్మురా (1989) డెరైక్ట్ చేసింది: జంధ్యాల; సినిమా తీసింది: జీవీహెచ్ ప్రసాద్ మాటలు రాసింది: జంధ్యాల