అంగట్లో ఐటీఐ ప్రశ్నపత్రాలు
⇒ అడ్డూ అదుపు లేకుండా మాస్ కాపీయింగ్
⇒ అధికారులు పర్యవేక్షించినా ఆలస్యంగానే పరీక్షలు
ఖమ్మం: జిల్లాలో జరుగుతున్న ఐటీఐ పరీక్షలు రెండోరోజు శనివారం కూడా తీరు మారలేదు. గత సంవత్సరం ఈ పరీక్షల తీరు, అధికారుల లాలూచీపై విజిలెన్స్ విచారణ చేపట్టినా.. ఈ సంవత్సరం పరీక్షలు ఇష్టానుసారంగా జరుతున్నాయని పత్రికలు, మీడియా చానెల్స్ ప్రచారం చేసినా అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు. జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లలో మాస్ కాపీయింగ్ జోరుకు అడ్డుకట్టలేయడంలో అధికారయంత్రాంగం విఫలమైంది.
వేళాపాళాలేని పరీక్షలు
ఐటీఐ పరీక్షలు అంటేనే జిల్లాలో హాస్యాస్పదంగా మారాయి. చిన్నపిల్లలకు నిర్వహించే యూనిట్ పరీక్షలకు కూడా ఒక సమయం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఐటీఐ పరీక్షలకు మాత్రం ఏలాంటి నిబంధనలు, పరీక్ష సమయాలు లేకుండా నిర్వహించడాన్ని చూసి అవ్వా ఇవీ పరీక్షలేనా.. అన్నటుల నవ్వుకుంటున్నారు. విద్యార్థుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థి నుండి అడ్మిషన్ ప్రక్రియ నుంచి ప్రాక్టికల్స్, ఇతర రికార్డులు, చిరవరి పరీక్షల వరకు రేట్లు మాట్లాడుకోని పలు ప్రైవేట్ పాఠశాలలు పరీక్షలను శాసిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
శుక్రవారం రోజు ఉదయం జరగాల్సిన పరీక్షలు మధ్యాహ్నం, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలు అర్ధరాత్రి వరకు జరిగిన విషయం విదితమే. దీనిని చూసైనా అధికారులు తమ నైజం మార్చుకోలేదు. శనివారం కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ఉదయం జరగాల్సిన పరీక్షలు గంట ఆలస్యంగా జరిగాయి. అశ్వారావుపేట సెంటర్లో ఉదయం జరగాల్సిన పరీక్షలు సాయంత్రం నిర్వహించారు. ఆన్లైన్లో ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ చేసుకునేందుకు ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు.
అయితే ముందురోజు జరిగిన పరిస్థితిచూసైనా రెండోరోజు ప్రశ్నపత్రాల సేకరణపై దృష్టి సారించకపోవడం విడ్డూరం. ఐటీఐ ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకులు మారాయి. ఢిల్లీ నుండి మెయిల్లో పంపించే ఈ ప్రశ్నపత్రాలను సేకరించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. పరీక్ష సమయం దాటిన తర్వాత కూడా ప్రశ్నపత్రాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సి వచ్చింది. దీంతో ఒక్కపేపర్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాటిని ఇతర ప్రాంతాల్లో ఉన్న జీరాక్స్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లి జీరాక్స్‌లు తీయించాల్సి వచ్చింది.
ఇదే సందర్భంగా ముందు తీసిన ప్రశ్నత్రాల జీరాక్స్‌లను బయటకు తీసుకువచ్చి పలువురు ప్రైవేట్ వ్యక్తులు అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రాలను తీసుకెళ్ళి జవాబులు తయారు చేసి పరీక్షా కేంద్రాలకు పంపినట్లు సమాచారం. అరకొర వసతుల మధ్య, టెంట్ల కింద, నేలపైన కూర్చొని విద్యార్థులు పరీక్షలు రాయూల్సి వచ్చింది. మొదటిరోజు అవకతవకల మధ్య పరీక్షలు కొనసాగినా రెండోరోజు కూడా మార్పురాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గంటన్నర ఆలస్యంగా ఐటీఐ పరీక్ష
అశ్వారావుపేట: ఐటీఐ పరీక్ష శనివారం అశ్వారావుపేటలోని ఓ ఐటీఐ కళాశాలలో గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్‌కు ప్రశ్నాపత్రాలు అందలేదు. ఈ విషయాన్ని జిల్లా కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి దృష్టికి ప్రిన్సిపాల్ జాన్‌బాబు తీసుకెళ్లారు. ఆ తరువాత, ప్రశ్నాపత్రాలను అధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపారు. వాటిని ప్రిన్సిపాల్ జిరాక్స్ తీయించి ఇచ్చారు. గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
ఐదువేలు ఇస్తే గట్టెక్కినట్టే..!
ఈ పరీక్షల నుంచి గట్టెక్కించేందుకుగాను కళాశాల నిర్వాహకులు, సిబ్బంది ఒక్కో విద్యార్థి నుంచి ఐదువేల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్ కూడా ఇవ్వలేదని సమాచారం.