breaking news
Irrigation DE
-
ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ
బాన్సువాడ టౌన్/పెర్కిట్/ఆర్మూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇరిగేషన్ డీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంతో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాన్సువాడలోని ఇరిగేషన్ కార్యాలయం, డీఈ అద్దె ఇంట్లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉండే ఇంట్లో, హైదరాబాద్‌లో అతని నివాసంపై ఏక కాలంలో దాడులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నియోజక వర్గంలో ని కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాల ఇరిగేషన్ డీఈగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై నిజామాబాద్‌లో కేసు నమోదైంది. శనివారం తెల్లవారు జాము నుంచి డీఈ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాన్సువాడ బస్‌డిపో సమీపంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో శ్రావణ్‌కుమార్‌రెడ్డి నివాసముంటున్నాడు. ఇంట్లోనే ఉన్న డీఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృపా నగర్లో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, సంగారెడ్డి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోదా లు చేశారు. రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో కొనుగోలు చేసిన రూ. 33 లక్షల విలువ గల ప్లాట్ పత్రాలు, రూ. 37 వేల నగదును అద్దె ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఉన్న ల్యాప్టప్ను పరిశీలించారు. డీఈతో పాటు జూనియర్ అసిస్టెంట్ అజీమొద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు నివసించే ఇంటికి వేకువజామున ఐదు గంటలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు సోదాలు నిర్వహించారు. సోదాల్లో శ్రావణ్ కుమార్ రెడ్డి పేరు మీద అంకాపూర్‌లో ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు దస్త్రాలు లభ్యమయ్యాయి. అధికారులు దస్త్రాలను సీజ్ చేశారు. అలాగే శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకరును అధికారులు తెరిచి చూశారు. లాకర్లో 30 తులాల బంగారు ఆభరణాలుండగా అవి తమ పూర్వీకుల నుంచి సంక్రమించాయని ఇందిరాదేవి అధికారులకు తెలిపారు. కాగా అధికారులు లాకర్‌ను ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోనూ తనిఖీ నిర్వహించారు. మొత్తం రూ. 5.50 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీబీ ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్ కాశయ్య తెలిపారు. దాడుల్లో కరీంనగర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరో ముగ్గురు సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే దాడులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏకకాలంలో దాడులు నిర్వహించాం. అంకాపూర్‌లో శ్రావణ్ కుమార్ రెడ్డికి ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించాం. అలాగే ఆయన తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకర్లో 30 తులాల నగలు లభ్యమయ్యాయి. లాకర్‌ను ఫ్రీజ్ చేశాం. ఆస్తికి సంబంధించిన దస్త్రాలను సీజ్ చేశాం. సోదాల్లో లభ్యమైన ఆస్తుల వివరాలను డీజీపీ కార్యాలయానికి నివేదిస్తాం. – కాశయ్య, ఏసీబీ ఇన్స్పెక్టర్, ఆదిలాబాద్ -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన చెల్లింపుల నిధులు విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డీఈ రూ.15 వేలు లంచం అడిగాడు. ఈ విషయం గురించి కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి డీఈ లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబా పథకం ప్రకారం పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీఈ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడి
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నీటి పారుదల శాఖ డివిజనల్ ఇంజినీర్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని హిందూపల్లి, రాయాచోటిలోని ఆయన బంధువులు నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వారి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడుల్లో నాయక్ ఇంటిలో భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నాయక్‌కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. -
ఇరిగేషన్ డీఈ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన ఇరిగేషన్ డీఈ తలమంచి గంగాధర్‌ను గురువారం నాల్గో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు తోటపల్లి గూడూరు మండలం కోవెరపాళేనికి చెందిన గంగాధర్ జంగం కులస్తుడు. అయితే బుడగజంగంకు చెందిన వ్యక్తిగా ఎస్సీ కులధ్రువీకరణ పత్రం పొంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1989లో ఇరిగేషన్‌శాఖలో ఉద్యోగం పొంది ప్రస్తుతం రాపూరు తెలుగుగంగ ప్రాజెక్టులో డీఈగా పని చేస్తున్నారు. మాగుంట లేఅవుట్ ధీరజ్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. తన పిల్లలను సైతం నకిలీ కులధ్రువీకరణ పత్రాల ద్వారానే బీటెక్ చదివిస్తున్నాడు. గతేడాది ఈ కుటుంబ వ్యవహారంపై కలెక్టర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. విచారణలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడని నిర్ధారణ అయింది. దీంతో డీఈ, అతనిపిల్లలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నెల్లూరు తహశీల్దార్ పి. జనార్దన్‌రావును కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టులో నాల్గోనగర పోలీసులు తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి డీఈని నాల్గో నగర ఎస్ఐ డి. వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కులధ్రువీకరణ పత్రాలిచ్చి అధికారులను సైతం పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పటి ఆర్డీఓ, తహశీల్దార్లు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.