breaking news
Intoxicating
-
గుట్కా రవాణాకు రాచబాట!
నగరమే అడ్డా ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ దాడుల్లో చిక్కుతున్న రూ.కోట ్ల సరుకు కాసుల మత్తులో ఖాకీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయని సీఐలు చలానాతో వదిలేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత గుట్కా తయారీ వ్యాపారం నగరం, శివార్లలో జోరుగా సాగుతోంది. కోట ్ల ఖరీదు చేసే లారీల కొద్దీ సరుకు పోలీసుల కనుసన్నల్లో రాష్ట్రం దాటిపోతోంది. దీనిపై కన్నేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. ఇంతవరకు ఒక్క కేసూ నమోదు కాలేదంటే ఏ మేరకు ‘చేతులు తడిపి’ ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన ప్రతిసారి గుట్కా ప్యాకెట్ల విలువ రూ.లక్షల్లో ఉంటే దానిని వేలల్లో చూపించి చలానా విధించి వదిలేస్తున్నారు. కాసులకు పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాసోహమవడంతో తయారీదారులు, సరఫరాదారులు తమ దందా యథేచ్ఛగాసాగిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని తమ అక్రమాలకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇలా పట్టుకుంటారు.. అష్ట కష్టాలకోర్చి ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్న అక్రమార్కులను గ్రేటర్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని వదిలేస్తున్నారు. ఇందుకు వారిని తయారీదారులు సంతృప్తి పరుస్తున్నారు. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఇన్ఫార్మర్లకు భరోసా ఇచ్చి, వారిచ్చిన సమాచారం మేరకు లారీల్లో రహస్యంగా గుట్కా ప్యాకెట్లు సరఫరా అవుతున్న సమయంలో దాడులు చేసి పట్టుకుంటున్న సంఘటనలు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో కొల్లలుగా ఉన్నాయి. పట్టుబడిన లారీలు, డ్రైవర్లను వీరు ఆయా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తారు. దీనిపై ఆయా ఇన్స్పెక్టర్లు.. గుట్కా ప్యాకెట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతున్నాయి. ప్రధాన సూత్రధారి ఎవరు, తయారీ ఎక్కడ తదితర అంశాలపై దర్యాప్తు చేయాలి. అనంతరం యంత్రాలను సీజ్‌చేసి, కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించే అధికారం ఉంది. కానీ సంబంధిత ఇన్స్పెక్టర్లు ‘గుట్కా ఫుడ్ ఐటం’ అన్న కారణంతో అంశాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెల క్రితం శంషాబాద్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ గుట్కా తయారీ దారుడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. అలా వదిలిపెడతారు.. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి స్థానిక ఇన్స్పెక్టర్కు అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్దకు గుట్కా కేసు వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా అధికారులు కాసులకు లొంగిపోయి లక్షల ఖరీదు చేసే ప్యాకెట్లు పట్టుబడితే కేవలం వేలల్లో పట్టుబడినట్లు దొంగ లెక్కలు చూపించి చలానాలు కట్టించుకుని వదిలి పెడుతున్నారు. గుట్కా తయారీ, సరఫరాలో ముంబై మాఫియా హస్తం ఉన్నట్టు సమాచారం. తయారీ దారులు కోట్లాది రూపాయల గుట్కా ప్యాకెట్లను నగరం, శివార్లతో తయారు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వందల సార్లు లారీల సరుకు నగరం దాటుతుంటే ఒకసారి పోలీసులకు చిక్కుతారు. ఇక్కడా వారు చలానా చెల్లించి దర్జాగా వెళ్లిపోతున్నారు. ఇందులోనూ కేసు లేదు, దర్యాప్తు ఉండదు.. శిక్ష అసలే లేదు. లోపం ఎక్కడుందో ఉన్నతాధికారులకే తెలియాలి. పెండింగ్‌లో 100కుపైగా కేసులు... పోలీసు శాఖలోని రెండు విభాగాల నుంచి చివరకు జీహెచ్ఎంసీకి చేరిన సుమారు 100 ‘గుట్కా’ కేసులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. నిందితులు గత ఆరు నెల లుగా దర్జాగా బయటే తిరుగుతున్నా.. అధికారులు వీరి వద్ద నుంచి చలాన్ కూడా కట్టించలేకపోయారు. అసలు చలానా ఎంత కట్టాలనేది కూడా అధికారులు నిర్ణయించలేదు. ఈ కేసులలో గుట్కాలను తరలిస్తున్న వాహనాల (లారీలు, ఆటోలు, ద్విచక్ర)ను సైతం జీహెచ్ఎంసీ అధికారులు విడిచిపెట్టారు. వాహనాలను సీజ్ చేసే అధికారం తమకు లేదని జీహెచ్ఎంసీ అధికారులంటున్నారు. నిషేధిత వస్తువులు తరలిస్తున్న వాహనాలను పట్టుకొని వెంట నే విడిచిపెట్టేస్తుండటంతో కొందరు నిర్భయంగా ఈ దం దాను కొనసాగిస్తున్నారు. గుట్కాలను సరఫరా చేస్తున్న అక్రమార్కులపై జీహెచ్ఎంసీ అధికారులు ‘2006- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారటీ ఆఫ్ ఇండియా-రూల్స్ మేక్-2011 గుట్కా యాక్ట్’ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా నిందితులను జైలుకు పంపే అవకాశం లేదు. కేవలం జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరుపర్చి జరిమానా మాత్రమే విధిస్తారు. ఇదే నిందితులకు వరంగా మారింది. -
మత్తిచ్చి.. నిలువు దోపిడీ
డీఎంయూ రైలులో ఏడు తులాల బంగారు ఆభరణాల అపహరణ బొబ్బిలి : విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న డీఎంయూ రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నా దంపతులకు మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీ చేశారు కొందరు దుండగులు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన దంపతులు తెలివి తెచ్చుకుని బొబ్బిలిలో ఉండే బంధువుల కు సమాచారం అందించడంతో వారికి బొబ్బిలి ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం విశాఖ పంపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మల్కాపురంలో నివాసముంటున్న గండి భాస్కరరావు స్టీల్ ప్లాంటులో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. పార్వతీపురంలో దగ్గర బందువుల అమ్మాయి వివాహ నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం భార్య వసంతతో పాటు విశాఖలో డీఎంయూ రైలు ఎక్కారు. టీ తాగడానికి కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా, ఎదురుగా కూర్చున్న యువకులు మీరు ఎందుకు వెళ్ల డం మేమే తెస్తామంటూ రెండు కాఫీలను తీసుకువచ్చారు. కాఫీలు తాగిన వెంటనే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో భార్య వసంత వద్ద ఉన్న నెక్లెస్, చైన్, పుస్తెలతాడు, గాజులు, భాస్కరరావు వద్ద ఉండే బ్రాస్లెట్, గొలుసు, ఉంగరం వంటివి దుండగులు తెంచుకుని పారిపోయారు. డీఎంయు రైలు ప్రతి కంపార్టుమెంటులో ప్రయణికు లు పుష్కలంగా ఉన్నప్పటికీ నిలువుదోపిడీ ఎంత చాకచక్యంగా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.. విజయనగరం దాటిన తరువాత వీరిద్దరూ అపస్మారక స్థితిలో ఉండడం, వారి దగ్గర ఆభరణాలు ఏవీ లేకపోవడాన్ని తోటి ప్రయాణికులు గమనించి వారికి సపర్యలు చేశారు. దాంతో వారికి కొద్దిగా తెలివి రావడంతో అసలు విషయం గుర్తించారు. కాఫీ తాగిన తరువాత మత్తులోకి వెళ్లిపోవడాన్ని తెలుసుకొని జరిగి న మోసాన్ని, బం గారు ఆభరణాలు పోవడాన్ని గుర్తిం చారు. ఇదే రైలులో బొబ్బిలి నుంచి ప్రయాణించడానికి వసంత చెల్లెలు నాగమణి, మిగిలిన బంధువులంతా సిద్ధమవుతుండగా గజపతినగరం వద్దకు వచ్చేసరికి వారికి ఫోన్లో బాధితులు సమాచా రం అందించారు. దాంతో బొబ్బిలిలో ఉండే బంధువులంతా రైల్వే స్టేషనుకు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను అక్కడ దించేసి 108లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారికి వైద్య సహాయం అందించినా, అపస్మారక స్థితి నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో వెంటనే విశాఖ తరలించారు. అటు రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు వాపోతున్నారు. -
భార్య, కుమారుడికి నిప్పంటించి.. భర్త ఆత్మహత్యాయత్నం
తాగిన మైకంలో ఘాతుకం చికిత్స పొందుతూ మృతి తాగిన మత్తులో ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య, కన్నకొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. ముగ్గురూ మృతిచెందారు. మహారాష్ర్ట నాందేడ్ జిల్లా ముద్కేడ్ మండలం రాజదప్క గ్రామానికి చెందిన శరత్(30), పద్మావతి (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జయంత్ ఉన్నాడు. వీరు రెండు నెలల క్రితం నగరానికి వచ్చి మియాపూర్‌లోని సాయినగర్ కాలనీలో ఉంటున్నారు. పెయింటర్‌గా పనిచేస్తున్న శరత్.. ఈనెల 14న మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో పద్మ.. భర్తను మందలించింది. అనంతరం నిద్రపోయిన భార్య, కుమారుడిపై శరత్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తన ఒంటిపై కూడా కిరోసిన్ పోసుకుని అంటించుకున్నాడు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్ని 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రీకొడుకులు ఆదివారం రాత్రి మృతిచెందగా, సోమవారం పద్మ ప్రాణాలు కోల్పోయింది.