మార్కెట్లో ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు?
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకుమాదిరిగా దొరుకుతున్నట్లు సమాచారం. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన పేపర్లు ముందుగానే మార్కెట్లో హల్చల్ చేస్తున్నట్లు తెలియవస్తోంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మార్కుల దాహం, ఫెయిల్ అయిన విద్యార్థుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఇంటర్మీడియెట్ రీజినల్ కార్యాలయం ఉద్యోగులే ఈ తంతంగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలో మాస్‌కాపీయింగ్‌తో పాటు ప్రశ్నపత్రాలను ఒకరోజు ముందుగానే లీక్ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్ఐవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇందులో కీలక పాత్ర పోషిస్తూ సదరు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం. ఇప్పటి వరకు నిర్వహించిన ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం, మ్యాథ్స్-ఏ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఇంగ్లిష్, మ్యాథ్స్ పేపర్లు మార్కెట్లో విరివిగా అమ్ముడుబోయినట్లు తెలుస్తోంది. గురువారం నిర్వహించే మ్యాథ్స్-1 బీ పేపర్‌ను సైతం బేరానికి పెట్టినట్లు తెలిసింది.
ఒక్కో పేపర్‌కు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలు చేసిన విషయం విదితమే. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆర్ఐవో విశ్వేశ్వరరావును సస్పెండ్ కూడా చేశారు. ఆ విషయం మర్వకముందే అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు దొడ్డిదారిన ప్రశ్నపత్రాలను విక్రయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.