breaking news
Indo-Pak match
-
తనివి తీరలేదే...!
కలిసి ఉన్నప్పుడు జీవితంలో చాలా సాయంత్రాలు చూసి ఉంటారు. కానీ విడిపోయాక... ఎవరి సాయంత్రం వారిదే.. అయితే పాక్ మాజీ స్టార్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఈడెన్‌లో ఓ అందమైన సాయంత్రాన్ని ఆస్వాదించారు. రాజకీయాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇండో-పాక్ మ్యాచ్ చూడటానికి కోల్‌కతా వచ్చిన ఆయన ముందర మాజీ భార్య రెహమ్ ఖాన్ ప్రత్యక్షం కావడం ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. ఇద్దరు ఒకరినొకరు తనివితీరా చూసుకుంటూ హుషారుగా పాక్ ఆటగాళ్లతో కబుర్లు చెబుతూ గడిపారు. -
'ఇండో-పాక్ మ్యాచ్ మాకు పెద్ద సమస్యేం కాదు'
వరల్డ్ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ టీ-20 మ్యాచును కోల్‌కతాలో నిర్వహిస్తుండటంపై బెంగాల్ క్రికెట్ అసిసోయేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచు వేదిక హఠాత్తుగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మారడం తమ అదృష్టమని పేర్కొన్నాడు. కోల్‌కతాలో గతంలోనూ ఇండో-పాక్ మ్యాచులను నిర్వహించామని, ఈసారి మరింత ఉత్తమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఓ జాతీయ చానెల్‌తో చెప్పారు. మధ్యప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల 19న జరుగాల్సిన భారత్-పాక్ మ్యాచును అకస్మాత్తుగా కోల్‌కతాకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచుకు కొన్ని రోజులే ఉండటంతో కోల్‌కతాలో ఇందుకు తగినన్ని సన్నాహాలు చేయడం కష్టమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాన్ని గంగూలీ సున్నితంగా తోసిపుచ్చారు. 'వరల్డ్ కప్ మ్యాచులతోపాటు ఫైనల్ కోసం కూడా మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాల్సి రావడం నాకు అవకాశమే కానీ సవాల్ కాబోదు. మొత్తం టోర్నమెంట్ కోసం మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో భాగంగానే మరో మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అకస్మాత్తుగా ఈ మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తే సమస్య ఎదురయ్యేది కానీ, మేం ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నేపథ్యంలో ఇదేం పెద్ద సమస్య కాదు' అని 43 ఏళ్ల గంగూలీ తెలిపారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మ్యాచుకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. -
కాయ్ రాజా కాయ్..
అమలాపురం/రాజమండ్రి క్రైం/ కాకినాడ క్రైం : ప్రపంచ కప్ క్రికెట్ ప్రియులకు రంజైన వినోదమైతే కొందరి భారీ జూదానికి దక్కిన అవకాశం. అలాంటి వారు కాయ్ రాజాకాయ్ అంటూ నోట్ల కట్టలతో బుకీల వెంట పడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో రూ.కోట్లలోనే బెట్టింగ్ జరుగుతుందని అంచనా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బుకీలు, బెట్టింగ్ ఆడే వారు గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేస్తున్నారు. ఈ ఉన్నత్త జూదం వల్ల ఎందరో.. ముఖ్యంగా యువత జీవితాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ప్రపంచకప్ క్రికెట్ ఆరంభమైందో, లేదో బెట్ కట్టేవారు, బుకీలు బిజీబిజీ అయిపోయారు. ఆన్లైన్ బెట్టింగ్‌తోపాటు స్పాట్ బెట్టింగ్ జోరందుకుంది. జిల్లావ్యాప్తంగా రోజుకు దాదాపు రూ.25 కోట్ల బెట్టింగ్ జరిగే అవకాశముందని అంచనా. కీలకమ్యాచ్లలో దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఆదివారం జరిగే భారత్- పాక్ మ్యాచ్‌లో రూ.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమండ్రి ప్రధాన కేంద్రాలుగా బెట్టింగ్ సాగుతోంది. బెట్టింగ్‌లో 60 శాతం కాకినాడలో జరుగుతుందని అంచనా. ఇక్కడ తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు, రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్‌లో జగ్గంపేట, కడియం, మండపేట వంటి ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు పాల్గొంటున్నారు. రాజమండ్రి, కాకినాడ కేంద్రాలకు మిగిలిన ప్రాంతాలకు చెందిన బుకీలు సబ్‌లుగా వ్యవహరిస్తుంటారు. కోనసీమలో జరిగే బెట్టింగ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రం కావడం విశేషం. రావులపాలెం ప్రాంతంలోనూ బడా బుకీలు ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ, భీమవరాలకు చెందిన బుకీలు దేశవ్యాప్తంగా జరిగే ఆన్లైన్ బుకీలకు ఫ్రాంఛైజీలుగా వ్యవహరిస్తున్నారు. పట్టణాల్లో పెద్దపెద్ద లాడ్జిలు, ఉన్నత వర్గాలకు చెందిన అతిథిగృహాలు కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోంది. పెద్దవారి జోలికి పోని పోలీసులు మినహాయించి చిన్నచిన్న వ్యక్తులపై పడుతుండడంతో వీరంతా మారుమూల ప్రాంతాలకు పోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లతో బెట్టింగ్‌ను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. బుకీ వద్ద 6 నుంచి 10 మంది వరకు ఉండే వ్యక్తులు బెట్టింగ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు సెల్ఫోన్లను కాన్ఫరెన్స్‌లో ఉంచడం ద్వారా మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు నిరంతరాయంగా బెట్టింగ్ జరుపుతున్నారు. ఇప్పుడంతా ఫ్యాన్సీ వైపే... : మ్యాచ్‌కు ముందు బెట్టింగ్ కట్టే కన్నా అప్పటికప్పుడు బెట్టింగ్ నిర్వహించడంపైనే జూదగాళ్లు మొగ్గు చూపుతున్నారు. కోహ్లీ 80 పరుగులు దాటగానే సెంచరీ అవుతుందా, 10 ఓవర్లలో 100 పరుగులు దాటితే జట్టు స్కోరు 300 చేరుతుందా అన్న రీతిలో ఫ్యాన్సీ బెట్టింగ్ సాగుతోంది. దీనిలో పాల్గొనడం స్టేటస్‌గా భావించే యువత ఎక్కువ. ఈ బెట్టింగ్‌లో నిమిషాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో మ్యాచ్ ఫలితాలపై వేసే బెట్టింగ్ కోట్లు దాటుతోంది. ఇదే చాలా మందిని బికారులు చేస్తోంది. కోసు పద్దతిలో కూడా బెట్టింగ్ జరుగుతోంది. బెట్టింగ్‌ను నియంత్రించడంలో జిల్లా పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. బెట్టింగ్ ఆడిస్తున్నదెవరో పక్కా సమాచారమున్నా సత్తా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు చిత్తశుద్ధితో కృషి చేస్తే బెట్టింగ్ ను అరికట్టడం అసాధ్యం కాదు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వాళ్లను గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్సీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఇప్పటి వరకూ బెట్టింగ్‌లకు పాల్పడి పట్టుబడిన పాతవాళ్ల మీద నిఘా పెంచామని,లాడ్జిలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులపై కూడా దృష్టి సారించామని చెప్పారు. నిఘా పెంచి ఎక్కడా క్రికెట్ బెట్టింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైతను ఆదేశించామన్నారు. కాగా బెట్టింగ్ నియంత్రణకు యువతలో మార్పు రావాలని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ అభిప్రాయపడ్డారు.