చిన్నారి మృతి, 32 మంది భారతీయులకు గాయాలు!
కల్లోలిత తూర్పు కాంగోలోని గోమా నగరంలో మంగళవారం పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఒక చిన్నారి మృతి చెందగా, 32 మంది భారత శాంతిదూతలు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న శాంతిదూతలు ఉదయం నడకకు వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించిందని ఐరాస మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని గోమా నగరం శివార్లలో ఉండే కీషెరో ప్రాంతంలో ఈ పేలుడు జరిగిందని, అయితే, ఈ పేలుడు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
అయితే, స్థానిక మసీదు ఇమామ్ ఇస్మాయిల్ సలుము మీడియాతో మాట్లాడుతూ ఈ పేలుడులో ముగ్గురు శాంతిదూతలు చనిపోయినట్టు తెలిపాడు. ఒక్కసారిగా తమకు పేలుడు చప్పుడు వినిపించిందని, ఆ వెంటనే ఆర్తనాదాలు విన్నంటాయని, దీంతో తాము సంఘటనా స్థలానికి పరిగెత్తుకు వెళ్లామని ఆయన చెప్పారు. 1996-2003మధ్యకాలంలో ప్రాంతీయ ఘర్షణలతో అట్టుడికిన కాంగోలో లక్షలాది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ అనేక సాయుధ మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసకు చెందిన 1800మంది సిబ్బంది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు.