breaking news
Incheon Asiad
-
సరితాపై కఠిన చర్యలు!
దీర్ఘకాల నిషేధం విధించే యోచనలో ఏఐబీఏ నేడు క్రమశిక్షణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ/కౌలాలంపూర్: ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సిద్ధమవుతోంది. ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినా... ఆమెపై దీర్ఘకాల నిషేధం విధించాలని యోచిస్తోంది. నేటి (గురువారం) క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత బాక్సర్‌పై తుది చర్యలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కౌ వు తెలిపారు. స్విట్జర్లాండ్, అమెరికా, స్పెయిన్, ఇంగ్లండ్‌ల నుంచి ఒక్కొక్కరు క్రమశిక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘సరితా కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఆమెకు భారీ శిక్ష విధించనున్నాం. అంతర్జాతీయ పోటీల్లో అలాంటి సంఘటనలను మేం సహించం. గెలుపును అంగీకరించినప్పుడు ఓటమిని కూడా ఆమోదించాలి. ప్రతి ఒక్కరు సరితలాగా ప్రవర్తిస్తే ఈ పోటీలు ఎందుకు?’ అని వు ప్రశ్నించారు. నిషేధం ఎత్తివేస్తారు మరోవైపు తనపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తారని సరితా ఆశాభావం వ్యక్తం చేసింది. రింగ్‌లోకి మళ్లీ దిగేందుకు అనుమతి లభిస్తుందని చెప్పింది. ‘ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పా. ఏఐబీఏ అధ్యక్షుడు ఏం మాట్లాడాడో తెలుసుకుంటా. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా. నాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారని నమ్ముతున్నా. ఈ కేసులో నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నా’ అని సరితా వ్యాఖ్యానించింది. బాక్సర్ క్షమాపణలు చెప్పింది కాబట్టి శిక్ష తక్కువగా ఉంటుందని బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా అన్నారు. ముందస్తు ప్రణాళికతో కాకుండా భావోద్వేగంలో ఆ సంఘటన జరిగిందన్నారు. -
ఆసియా ఒక్కటే
ఇంచియాన్: ‘ఒక్కటే ఆసియా.. ఆసియా అంతా ఒక్కటే’ అనే నినాదంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో 17వ ఏషియాడ్ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తమ సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కొరియా స్థానిక ఇంచియాన్ ఏషియాడ్ ప్రధాన స్టేడియాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆరంభంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా చూపిన దృశ్యాలు ఔరా అనిపించగా... ఫినిషింగ్ టచ్‌గా పాప్ సెన్సేషన్ సై ప్రేక్షకులతో పాటు స్టేడియంలో ఉన్న అథ్లెట్లను కూడా చిందులు వేయించాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో ఇక నేటి (శనివారం) నుంచి 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. ముఖ్యంగా ఆరంభ వేడుకలు నాలుగు విభాగాలుగా జరిగాయి. ప్రాచీన ఆసియా, సముద్ర మార్గాల ద్వారా ఆసియాలో ప్రవేశం, ఆ కుటుంబం.. స్నేహితులుగా ఆసియా రూపాంతరం, చివరిగా ఒకే ఆసియా అనే థీమ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఆసియాలో ఇంచియాన్ నగరం ప్రధాన భూమికగా ఉందనే వీడియో సందేశంతో పాటు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో వేడుకలు ఆరంభమయ్యాయి. అనంతరం 45 మంది చిన్నారుల ప్రదర్శన... ఆ తర్వాత సంప్రదాయ వేషధారణలో పురాతన ఇంచియాన్ నాగరికతను గుర్తుచేసే విధంగా కళాకారుల ప్రదర్శన సాగింది. సింగర్ కో-ఉన్ ‘సాంగ్ ఫర్ ది ఏషియాడ్’ను ఆలపించాడు. ఆ తర్వాత కొరియా జానపద గాథలను చూపడంతో పాటు వారి అభివృద్ధి పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. వీటన్నింటినీ ప్రధాన స్టేడియంపైనే అతి పెద్ద తెరను ఏర్పాటు చేసి అందులో డిజిటల్ సహాయంతో చూపడం అబ్బురపరిచింది. ఒపెరా సింగర్స్ చుట్టూ గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ఓడను సృష్టించగా దాన్ని ఒకరు తర్వాత మరొకరు నడుపుతూ ఆసియా సరికొత్త అభివృద్ధి వైపు పయనిస్తున్నట్టుగా ప్రదర్శన సాగింది. అనంతరం 45 దేశాలకు చెందిన 9,500 మంది క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు స్టేడియంలోకి ప్రవేశించారు. భారత్ తరఫున హాకీ ఆటగాడు సర్దార్ సింగ్ జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు నడిచాడు. పురుష ఆటగాళ్లు నల్లటి బ్లేజర్ ధరించగా మహిళా అథ్లెట్స్ నీలి రంగు చీరలో మెరిశారు. అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జ్యూన్హై పోటీలను ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. {పసిద్ధ నటి లీ యంగీ ఇ ఆసియా క్రీడల జ్యోతిని వెలిగించగా ఆ వెంటనే స్టేడియం అంతా బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. కార్యక్రమం చివర్లో కొరియన్ పాప్ స్టార్ సై తన పాపులర్ సాంగ్ ‘ఒప్పా గంగ్నమ్ స్టయిల్’ను పాడడంతో పాటు అక్కడున్న వారందరిచేత డ్యాన్స్ చేయించడంతో కార్యక్రమం ముగిసింది.