కాంగ్రెస్ అధికారంలోకి రాదు
కృష్ణగిరి ఎన్నికల సభలో నరేంద్ర మోడీ
హొసూరు(తమిళనాడు), న్యూస్‌లైన్ : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి - బర్గూరు జాతీయ రహదారి పక్కనే కందికుప్పం వద్ద ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పార్టీలు, అభ్యర్థుల మధ్య జరుగుతున్నవి కాదని, కోట్లాది ప్రజల అభిమతం మేరకు జరుగుతున్నాయని వివరించారు.
కాంగ్రెస్ వంద రోజుల్లో పది కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారని, అయితే ఈ పదేళ్ల యూపీఏ పాలనలో 1.5 కోట్ల మంది నిరద్యోగులకు ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. వాజ్‌పేయి హయాంలో ఆరు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు. విద్యుత్ కోతతో తమిళనాడులో పరిశ్రమలు మూత పడ్డాయని అన్నారు. ఇందుకు కారణం యూపీఏ సర్కార్ వైఖరే కారణమని విమర్శించారు. బొగ్గును అక్రమంగా పక్కదారి పట్టించడం వల్ల విద్యుత్ ఉత్పాదన గణనీయంగా పడిపోయిందని తెలిపారు.
బొగ్గు కుంభకోణాలపై సుప్రీం కోర్టు అడిగిన రికార్డులు సమర్పించకుండా గల్లంతు చేశారని కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్షగాడు సైతం తీసుకెళ్లలేని బొగ్గును కాంగ్రెస్ నేతలు దొంగలించారని ఎద్దేవా చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దొంగలించిన బొగ్గును దాచుకునేందుకు బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తుందని చలోక్తి విసిరారు. గుజరాత్లో బీజేపీ అధికారంలోకి రాక ముందు విద్యుత్ కోత తీవ్రంగా ఉండేదని, రాత్రి పూట భోజన సమయంలోనైనా విద్యుత్ సరఫరా చేయాలని కోరితే తాను అధికారం చేపట్టిన తర్వాత ఏడాదికి 365 రోజులూ 24 గంటలూ నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నానని చెప్పారు.
తమిళనాడులో తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుజరాత్‌లోని తొమ్మిది వేల గ్రామాలలో గతంలో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారని, బీజేపీ హయాంలో నర్మదా నది నంచి రక్షిత మంచినీరు అందివ్వడం ద్వారా ఈ సమస్యను అధిగమించామని చెప్పారు. తాగునీటిని సరఫరా చేస్తున్న పైపుల్లో మారుతీ కారు కూడా దూసుకెళుతుందని, అంత పెద్ద పైప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాలన్న వాజ్‌పేయి ఆశయాన్ని కాంగ్రెస్ తొక్కి పట్టిందని మండిపడ్డారు.
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మారి మారి అధికారంలోకి వస్తూ ఒకరిపై ఒకరు కేసులు వేసుకొని ప్రజలను మోసగించారే తప్పా రాష్ట్రాభివృద్ధికి ఏ చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. తమిళనాడులో ఎన్టీఏ కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ధర్మపురి అభ్యర్థి అన్భుమణి రామదాస్, కృష్ణగిరి అభ్యర్థి జీ.కే.మణి, ఆరణి అభ్యర్థి ఏ.కే.మూర్తి, తిరువణ్ణామల్లైఅభ్యర్థి ఎదురొళి మణియన్, అరక్కోణం అభ్యర్థి ఆర్.వేలు, వేలూరు అభ్యర్థి ఏ.సీ.షణ్ముగం తదితరులు వేదికపై ఆశీనులైయ్యారు. 25 నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసంలో కాంగ్రెస్ అవినీతి పాలనపై మోడీ నిప్పులు చెరిగారు.