breaking news
hindupuram people
-
సెల్ఫీల కోసం వచ్చావా! బాలకృష్ణ తీరుపై హిందూపురం ప్రజల ఆగ్రహం
హిందూపురం టౌన్: ‘ఇండ్లలోకి నీళ్లొచ్చి ఇబ్బంది పడుతున్నాం. మా బాధలు చెప్పుకునేందుకు ఆయప్ప అవకాశం ఇవ్వడం లేదు. సెల్ఫీల కోసం ఇక్కడికి వచ్చినాడా!’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఆదివారం అనంతపురంలో ఓ టీడీపీ నాయకుడి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అనంతరం బెంగళూరు వెళ్తూ.. హడావుడిగా హిందూపురం పట్టణంలో వరద ముంపునకు గురైన ప్రాంతంలో పర్యటించారు. మారుతీనగర్‌లో బాలకృష్ణ సెల్ఫీ ఫొటోలకే ప్రాధాన్యమిస్తూ.. తమ బాధలను పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా బాధ చెప్పుకుందామంటే సెల్ఫీలు దిగుతున్నాడు. ఆయప్ప ఇక్కడకు సెల్ఫీలు దిగడానికే వచ్చాడా?’ అని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు.. వారిని తీసుకెళ్లి బాలకృష్ణతో మాట్లాడించారు. మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన బాలకృష్ణ.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రుషికేష్‌లో హిందూపురం వాసులు క్షేమం
హైదరాబాద్: చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న హిందూపురం వాసులు ఆదివారం సాయంత్రం క్షేమంగా సురక్షిత ప్రాంతానికి (రుషికేష్) చేరుకున్నారు. యాత్రికులు మాట్లాడుతూ.. 'రెండు రోజులు వరదల్లో చిక్కుకుని నరక యాతన అనుభవించాం. వెంటనే స్పందించిన మీడియాకు ప్రభుత్వానికి ధన్యవాదాలు' అన్నారు. జూలై 2న హిందూపురం చేరుకునే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.