breaking news
Hand ball tournment
-
వరంగల్‌కు పురుషుల టైటిల్
ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ ఎల్బీ స్టేడియం: ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌డీహెచ్‌ఏ) సౌజన్యంతో తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఫైనల్లో వరంగల్ 25-19 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో వరంగల్ జట్టు 15-12తో ఆధిక్యాన్ని సాధించింది. వరంగల్ జట్టులో అశోక్ 10 గోల్స్, ఆర్. సింగ్ 6 గోల్స్ చేశారు. ఎల్బీ స్టేడియం జట్టులో రాజ్ కుమార్, వాసు చెరో 8 గోల్స్ చేశారు. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్‌గా అశోక్ (వరంగల్) ఎంపికయ్యాడు. సెమీఫైనల్లో వరంగల్ జట్టు 15-13స్కోరుతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌పై, ఎల్బీ స్టేడియం జట్టు 12-10 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) జట్టుపై గెలిచాయి. మహిళల చాంప్ సాయ్: మహిళల విభాగంలో సాయ్ ఎస్టీసీ (సరూర్‌నగర్) జట్టు విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం జట్టు రెండో స్థానం సాధించగా, మహర్షి విద్యా మందిర్‌కు మూడో స్థానం దక్కింది. ఫైనల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జట్టు 15-13 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై గెలిచింది. సాయ్ జట్టులో రమ్య 10 గోల్స్ చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకుంది. సెమీఫైనల్లో సాయ్ ఎస్టీసీ జట్టు 12-6తో సెయింట్ పాయిస్ కాలేజిపై, ఎల్బీ స్టేడియం 9-6తో మహర్షి విద్యా మందిర్‌పై గెలిచాయి. హాకీ విజేత సెయింట్ పీటర్స్ స్కూల్ హాకీ టోర్నమెంట్లో సెయింట్ పీటర్స్ హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. జింఖానా మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ పీటర్స్ జట్టు 1-0తో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను సెయింట్ పీటర్స్ ఆటగాడు అజహర్ సాధించాడు. సెమీఫైనల్లో సెయింట్ పీటర్స్ స్కూల్ 1-0తో విజయా హైస్కూల్ (కాప్రా)పై, భవాన్స్ జూనియర్ కాలేజి 1-0తో కేంద్రీయ విద్యాలయ (తిరుమలగిరి)పై నెగ్గాయి. -
హ్యాండ్‌బాల్ చాంప్ హైదరాబాద్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హ్యాండ్‌బాల్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. వరంగల్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 18-7 స్కోరుతో పశ్చిమ గోదావరి జట్టుపై విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ కీర్తి, అంజు శర్మ నాలుగు గోల్స్, రమ్య ఆరు గోల్స్ చేశారు. పశ్చిమ గోదావరి జట్టులో మాధవి నాలుగు, శ్రీలత మూడు గోల్స్ చేశారు. -
హ్యాండ్‌బాల్ టోర్నీలో రన్నరప్‌గా హైదరాబాద్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో రన్నరప్‌గా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జిల్లాలోని బాసరలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 16-21 స్కోరుతో వరంగల్ జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు 29-24తో గుంటూరు జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో చక్కటి నైపుణ్యాన్ని కనబర్చిన హైదరాబాద్ ఆటగాళ్లు రాజ్ కుమార్, శక్తి యాదవ్‌లకు రాష్ట్ర జట్టులో చోటు దక్కింది. జాతీయ సీనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీ ఈనెల 10 నుంచి బీలాస్పూర్లో జరుగనుంది. -
భవాన్స్ జూనియర్ కాలేజికి టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి బాలుర హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను నిరుటి విజేత భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు నిలబెట్టుకుంది. ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో జరిగిన ఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు 18-11 స్కోరుతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. భవాన్స్ కాలేజి జట్టు తరఫున కేశవ 6, విక్రమ్ 5, దీపాన్షు 4, వెంకట్‌రెడ్డి 3 గోల్స్ చేశారు.