breaking news
gumma laxmipuram
-
మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పోలీసుల కథనం.. పెంగవ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడేళ్ల కూతురు భవ్యశ్రీతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే చిన్నారితో కలిసి నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన సొంత చిన్నాన్న కుమారుడు వినోద్.. రాత్రి 11 గంటల సమయంలో టార్చిలైట్ సాయంతో వారి వద్దకు వెళ్లి తల్లి పక్కనే పడుకున్న భవ్యశ్రీ మెడను కత్తితో కోశాడు. భవ్యశ్రీ గిలగిలా కొట్టుకోవడంతో పార్వతికి మెలకువ వచ్చి చూసేసరికి వినోద్ పారిపోయాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. పార్వతిని భర్త వదిలేయడంతో అతని మీద కోపం పెంచుకున్న వినోద్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వినోద్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. -
గిరిజనులతో మమేకమైన కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం : కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎం.హరిజవహర్‌లాల్ జిల్లాలోనే మారుమూల గిరిశిఖర గ్రామంగా పిలువబడే మంత్రజోల గ్రామాన్ని సందర్శించడం గిరిజనులకు ఆనందాన్నిచ్చింది. బుధవారం మంత్రజోల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌కు గ్రామస్తులంతా గిరిజన సంప్రదాయ రీతిన సాదరంగా ఆహ్వానించారు. మొట్టమొదటి సారిగా గ్రామానికి విచ్చేసిన కలెక్టర్ ఇతర అధికారులకు గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ మంత్రజోల గ్రామానికి కలెక్టర్ హోదాలో సందర్శించిన మొట్టమొదటి వ్యక్తి తానే కావడం గుర్తించుకోదగ్గ విషయమంటూ కలెక్టర్ చెప్పారు. మంత్రజోల గ్రామాన్ని చూస్తే తాను పుట్టిన గ్రామం గుర్తుకొచ్చిందని, తాను కూడా చిన్న గిరిజన గ్రామంలోనే పుట్టానని గుర్తు చేసుకున్నారు. రెండు కిలోమీటర్లు కాలినడకతో వెళ్లి చదువుకునేవాడినని, ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. మీరు కూడా కష్టపడి మీ పిల్లల్నీ ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సాహించాలని సూచించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ, వారు వాయించే వాయిద్యాలను కూడా వాయించారు. ఆయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీఓ జి.లక్ష్మీషా, ఆర్డీఓ బి.సుదర్శనదొర, సర్పంచ్ మిన్నారావు తదితరులు ఉన్నారు.\ మంత్రజోల గ్రామానికి కలెక్టర్ వరాలు గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లోవముఠా ప్రాంతం చినగీసాడ పంచాయతీ మంత్రజోల గిరిశిఖర గిరిజన గ్రామానికి కలెక్టర్ ఎం.హరిజవహార్‌లాల్ వరాలు కురిపించారు. ఈ మేరకు ఈ గ్రామానికి ప్రత్యేక అభివృధ్ధి నిధులు (ఎస్డీపీ) రూ.20 లక్షలతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ పువ్వల మిన్నారావు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ మంత్రజోల గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగింది కాబట్టి అభివృద్ధికి బాటలు పడినట్టేనన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ రహదారిని తారురోడ్డుగా మారుస్తామన్నారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ తక్షణమే ఏర్పాటు చేయిస్తానన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మిస్తామని, ప్రతిపాదనలు పంపించాలని సీడీపీఓ శోభారాణికి ఆదేశిస్తూ వచ్చే జనవరి 26లోగా అంగన్వాడీ భవనం నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎస్ఎస్ఏ ద్వారా పాఠశాల భవనం మంజూరైందని ఈ పనులను కూడా రాబోవు జనవరి 26లోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ టి.శంకరరావుకు సూచించారు. గ్రామాల్లోని ప్రతీ కుటుంబం వారికి అందుబాటులో ఉండే వనరుల ద్వారా నెలకు రూ.10వేలు ఆదాయం సాధించుకునేలా తగినంత ప్రోత్సాహం అందించాలని వెలుగు ఏపీఎం త్రినాధమ్మకు చెప్పారు. పిల్లలను ఎంత వరకు చదువుతానంటే అంత వరకు చదివించాలని సూచిస్తూ, వారిచే ప్రమాణం చేయించారు. అంతకు ముందు గ్రామంలో కలియతిరిగారు. పార్వతీపురం ఐటిడీఏ పీఓ జి.లక్ష్మీషా, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కుమార్, భద్రగిరి డీఈఈ టి.మోహన్‌రావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి, తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షం
గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానతో మండల కేంద్రంలోని ఎల్విన్‌పేట స్టేట్‌బ్యాంక్ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు గ్రామస్తులు నానా ఇబ్బందులు పడ్డారు.