breaking news
gowtami putra shatakarni
-
సునీత... 750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అంటూ గులాబీ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కథానాయిక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పారు. తెలుగుజాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ : ‘బాలకృష్ణగారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి డబ్బింగ్ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రియ అద్భుతంగా నటించడంతో నేనూ బాగా డబ్బింగ్ చెప్పగలిగా. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తిచేసుకోవడం వెనుక దర్శక, నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. 750 చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, ప్రతి టెక్నీషియన్ నా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించినవారే. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలన చిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. సునీత డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో ది బెస్ట్ సెలక్ట్ చేయమంటే కష్టమే. ఒకటా.. రెండా... 750 సినిమాల్లో ఎన్నని ఎంపిక చేయగలం! అందుకే, మచ్చుకి కొన్ని సినిమాల పేర్లు: 1) జయం 2) చూడాలని వుంది 3) నిన్నే ప్రేమిస్తా 4) నువ్వు నేను 5) ఆనంద్ 6) గోదావరి 7) హ్యాపీడేస్ 8) మన్మథుడు 9) మల్లీశ్వరి 10) శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. 11) మంత్ర 12) అనుకోకుండా ఒక రోజు 13) మనం 14) నేనున్నాను 15) ఆడవారి మాటలకు అర్థాలు వేరులే 16) శ్రీ రామదాసు 17) రాధాగోపాలం 18) శ్రీరామరాజ్యం ఇప్పుడు... గౌతమిపుత్ర శాతకర్ణి -
ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు
న్యూఢిల్లీ: గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరపుకోవడం మొదలైందని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే చరిత్రను పూర్తిగా వక్రీకరించినట్లే. చరిత్రను హృద్యంగా, అందంగా తెరకెక్కించడానికి వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చు. కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదు. గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభం అయిందనడం చారిత్రక తప్పిదం. అసలు గౌతమీపుత్ర శాతకర్ణికి, శాలివాహనుడికి సంబంధమే లేదు. ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన 25వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు. శాతకర్ణి కలియుగంలో 2,669 నుంచి 2,694 వరకు అంటే క్రీస్తు పూర్వం 433 నుంచి 408 వరకు అంటే, దాదాపు పాతికేళ్లు ‘గిరి వ్రజం’ను రాజధాని చేసుకొని భారత దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత శాతకర్ణి చనిపోయాక దాదాపు 485 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు శకం 78లో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన ఉజ్జయనిని రాజధానిగా చేసుకొని భారత్‌ను పాలించారు. గిరివ్రజం ప్రస్తుతం బీహార్‌లో ఉండగా, ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. భారత్‌ను పాలించిన రాజవంశాల్లో శాతకర్ణిది ఎనిమిదవ వంశంకాగా, శాలివాహనుడిది పదవ వంశం. అలాంటప్పుడు శాతకర్ణితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని ఎలా చెబుతారు? ఇక ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కూడా జరుపుకుంటారు. కలియుగం ప్రారంభానికే ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక, ఇతిహాసక ఆధారాలు ఉన్నాయి. కలియగం నుంచి లెక్కేసుకున్నా చంద్రమానం ప్రకారం ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5,118 సంవత్సరాలు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలన కలియుగంలో 2,669 ఏళ్లనాడు ప్రారంభమైనదంటే, ఆయన పాలనకన్నా దాదాపు 2,500 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుంది? గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు వేర్వేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు. వీరిద్దరికి వీరోచిత చరిత్ర ఉంది. వీరిద్దరిపైనా వేర్వేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఇద్దరి చరిత్రను కలిపినట్లయితే అది చరిత్రను వక్రీకరించినట్లే అవుతుంది. సంస్కృతంలో బాస మహాకవి రాసిన ‘చారుదత్తా’కు శూద్రుడు రాసిన ‘మృత్య్సకటికం’ నాటకంలోని ఓ భాగాన్ని జోడించి ప్రముఖ దర్శకుడు గిరీష్ కర్ణాడ్ ‘ఉత్సవ్’ పేరిట నాటి సంస్కతిని కళ్లకు కట్టినట్లు తీశారు. చరిత్రను వక్రీకరించకుండా అలాంటి ప్రయోగం చేయవచ్చు. చరిత్రేదో, కల్పనేదే ప్రేక్షకులకు తెలిసేలా ఉండాలి. తప్పుదారి పట్టించేలా ఉండరాదు. గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, ఉగాది పండుగ ప్రారంభమైందని చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, హీరో బాలకష్ణ ఘంటా పథంగా చెప్పారట. వారికి రాసిచ్చిన స్క్రిప్టులో లోపం వుండవచ్చు. కానీ సినిమాకు రాసిన స్క్రిప్టులో కూడా లోపం ఉంటే అది ఎంతమాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కాదు, ‘క్రిష్‌పుత్ర శాతకర్ణి’ అవుతుంది.