breaking news
gostani river
-
ఆశల దీపం ఆరిపోయింది..
పద్మనాభం(భీమిలి): ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. గోస్తని నదిలో గల్లంతైన బాలుడు మంగళవారం శవమై తేలాడు. రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్ కుమార్ రెడ్డి(9) సోమవారం ఉదయం 5.13 గంటలకు పాండ్రంగి సమీపంలో గోస్తని కాజువే ఒడ్డున స్నానం చేస్తుండగా.. కాలుజారి గల్లంతైన విషయం తెలిసిందే. పాండ్రంగి జాలర్లు, గజ ఈతగాళ్లు సోమవారం నదిలో గాలించినా బాలుడు జాడ కనిపించలేదు. చివరకు 18 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెల్లవారంతా ఎదురు చూపులు చూశారు. మంగళవారం వేకువ జామున రేవిడికి చెందిన ఈతగాళ్లు నదిలో గాలించారు. సంఘటన జరిగిన కాజువేకు సుమారు 200 మీటర్ల దూరంలో.. నీలకంఠ రాజు కళ్లానికి సమీపంలో ఉదయం ఆరు గంటల సమయంలో యశ్వంత్ కుమార్ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. బాలుడు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి ఇంటికి తీసుకువెళ్లారు. ఆ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. యశ్వంత్ చదువుతున్న కృష్ణాపురం స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల విద్యార్థులు విషాద వదనంలో మునిగిపోయారు. వెంకటలక్ష్మి, గౌరి రెడ్డిలకు కుమారులు యశ్వంత్ కుమార్ రెడ్డి(9), గౌశిక్(6), కుమార్తె శరణ్య(3) ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డిని నది రూపంలో మృత్యువు కబళించడంతో.. ఆ తల్లిదండ్రులు గుండె విసేలా రోదిస్తున్నారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. -
నదిలో దిగి ఒకరి గల్లంతు
తగరపువలస (విశాఖపట్టణం): గోస్తనీ నదిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. విశాఖప్టణం జిల్లా భీమిలి పట్టణం వలందపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం తగరపువలస సమీపంలోని గోస్తనీ నదికి వెళ్లారు. లోపల దిగి స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. నర్సింగరావు(35) అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోగా మిగతా ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. స్థానికుల సమాచారం మేరకు చిట్టివలస నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ప్రవాహ వేగం చూసి నీటిలోకి దిగలేకపోయారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలించేందుకు గజ ఈతగాళ్లను రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.