breaking news
Gochi
-
'గోచీ పండుగ'..ఎందుకోసం నిర్వహిస్తారో తెలిస్తే షాకవ్వుతారు..!
వినడానికి వింతగా; అనడానికి విడ్డూరంగా ఉన్నా.. కనడానికి కన్నులవిందుగా ఉంటుందా వేడుక. పేరులో ‘గోచీ’ ఉండొచ్చు కాని, పండగలో పాల్గొనేవారు మాత్రం నిండుగా సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతారు. సంతానోత్పత్తికి సంకేతంగా నిర్వహించే ఈ పర్వదినంలో ఆబాలగోపాలానికి అవకాశం లేదు. పెళ్లిళ్లయిన, పెళ్లీడుకొచ్చిన స్త్రీ పురుషులు మాత్రమే అర్హులు. ఆశ్చర్యంగా అనిపించే ఆ వేడుక పేరే ‘గోచీ’ పండుగ. ఇంతకీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? ఏమిటా వేడుక విశేషాలు? తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదివేయండి. శిశుజననం.. వారికి పండుగదేవభూమిగా భాసిల్లే హిమాచల్ ప్రదేశ్ దేశంలోని అగ్రగామి పర్యాటక ప్రాంతాల్లో ఒకటనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో సింహభాగం మైదాన ప్రాంతం కంటే పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. సముద్ర మట్టానికి సగటున 50 మీటర్ల ఎత్తున ఉండే ఆవాసాలే అధికం. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత వాసులే! 2016 నాటికి 99.5 శాతం విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా నమోదైంది. అంతేకాదు 2017 సర్వే ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడింది. 2014కు ముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉండేది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆ రేటు 1.7కు పడిపోయింది. ఇక 2019–21 జాతీయ నివేదిక ఆధారంగా ఆ రేటు మరింత దిగజారి 1.5గా నమోదైంది. ఇక ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ రేటు మరింత క్షీణించింది. బహుశా ఈ పరిణామాలే పర్వత శ్రేణుల్లోని లోయల్లో నివసించే గిరిజనులు గోచీ పండగను మరింత ఘనంగా నిర్వహించేందుకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి లాహోల, స్పితి జిల్లాల్లోని చంద్, భాగ్ లోయల్లోని గిరిజనులు సంతానప్రాప్తిని అదృష్టంగా భావిస్తారు. అందుకు ప్రతీకగా శిశువు జన్మించిన సందర్భంలో ఊరంతా ఏకమై ఉత్సవం నిర్వహిస్తారు. ఎవరికైతే బిడ్డ పుట్టాడో ఆయా కుటుంబాలు గోచీ ఉత్సవానికి సంకల్పిస్తాయి. ఏటా మాఘ మాసంలో ఈ పండగ జరుపుకొంటారు. స్థానిక గిరిజన తెగల ప్రజలు చలిమంటల చుట్టూ చేరి, స్త్రీ పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేస్తూ పండగను ప్రారంభిస్తారు.లక్ష్యం చేరిన బాణమే సంతానానికి సంకేతంగహర్ లోయలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. వేర్వేరు తండాల్లో ఒక్కో రీతిన ఈ ఉత్సవం నిర్వహిస్తారు. మగబిడ్డ పుడితే ఓ గ్రామం, ఆడ బిడ్డ జన్మిస్తే ఇంకో గ్రామం ఇలా ఒక్కొక్కరు గోచీ పండగ నిర్వహిస్తారు. పండగకు ఒకరోజు ముందు గ్రామపూజారి విల్లుబాణం పట్టుకుని ఊరంతా తిరిగి స్థానిక గ్రామదేవతకు ప్రార్థన చేస్తాడు.ఆ తర్వాత బిడ్డ పుట్టిన ఇంటిని సందర్శిస్తాడు. పండగ రోజు ఉదయాన్నే ఊరంతా సమావేశమై ఎలా ముందుకువెళ్లాలో నిర్ణయిస్తారు. పర్వదినం సందర్భంగా సత్తు పిండితో శివలింగాన్ని చేసి, దానికి పూజలు చేస్తారు. ఈ రూపాన్ని స్థానికులు ‘యుల్లా’ దేవత అని పిలుస్తారు. ఊరంతా కలియతిరిగి ఓ కూడలిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. దేవతారా«ధన అనంతరం విలువిద్య ఆట ఆడతారు. పెళ్లైన మగవారికి మాత్రమే ఇందులో ప్రవేశం. నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని తాకిన బాణాల సంఖ్య ఆధారంగా ఆ గ్రామానికి రానున్న కాలంలో అంతమంది శిశువులు జన్మిస్తారని వీరి నమ్మకం. లక్ష్యం చేరిన బాణాల సంఖ్య పదికి దాటితే చాలు వీరి ఆనందానికి అవధులుండవు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. సంప్రదాయ వంటకాలతో అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆడపిల్లతో అదృష్టమని..ఈసారి భాగ్ లోయలోని పుకార్ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఇక్కడి వారు కేవలం మగబిడ్డలు పుడితేనే గోచీ పండుగ జరిపేవారు. కాని, ఈసారి ఆడ శిశువు పుడితే ఘనంగా వేడుక నిర్వహించడం విశేషం. తమ ఇంట అమ్మాయి పుడితే అదృష్టంగా భావించారు పుకార్ గిరిజనులు. తాజాగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజులు ఉత్సవాన్ని జరిపారు. ‘తంగ్జన్’గా పిలిచే గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారి బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించాడు. అనంతరం బారసాల (తొట్టి పండగ) నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భంగా బిడ్డకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీయరు. ఆరునెలలు నిండేంత వరకు ఈ నిబంధనను పాటిస్తారు. అలా చేస్తే కనుదృష్టి తగులుతుందని వీరి భయం. లోహర్ అని పిలిచే డప్పుల దరువులతో పండగ మారుమోగుతుంది. ‘చాంగ్’ అనే సంప్రదాయ మద్యాన్ని అంతా సేవిస్తారు. డప్పుల దరువులకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలను విసరడంతో గోచీ పండుగ ముగుస్తుంది. · -
బికినీ- గోచీ పేచీ
సముద్రతీర అందాలకు నెలవైన గోవాలో బికినీ-గోచీ పేచీ కలకలం రేపింది. బీచుల్లో బికినీలను నిషేధించాలని ఓ మంత్రిగారంటే.. గోచీ పెట్టుకు తిరగడంటూ ఓ ఫ్యాషన్ డిజైనర్ రుసరుసలాడారు. దీంతో బికినీ-గోచీల చర్చ హాట్ టాఫిక్ గా మారింది. గోవా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి అందమైన బీచ్‌లు. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుండడం ఇక్కడ సర్వసాధారణం. అయితే బికినీ సంస్కృతితో తమ రాష్ట్రం భ్రష్టుపట్టిపడుతోందని ఆందోళన చెందిన గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ దీన్ని నిషేధించాలని గళమెత్తారు. ఎక్కడపడితే అక్కడ ఇలా 'టూపీస్' స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని వాపోయారు. తాము దీన్ని అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. బికినీ సంస్కృతిని నిషేధించాలన్న సుదీన్ దావలికర్ డిమాండ్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటుగా స్పందించారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని ఆయనకు పరోక్షంగా సూచించారు. విదేశాల్లో తయారైన ఫ్యాంటు, చొక్కాలు తొడుక్కోవడం మానేసి, శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా అంటూ బహిరంగ లేఖ రాశారు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని దావలికర్ కు కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. టూరిజంపై అధిక ఆదాయం ఆర్జించే గోవా.. సుదీన్ దావలికర్ డిమాండ్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బికినీలను నిషేధించబోమని స్పష్టం చేసింది. బీచుల్లో బికినీ ధరించడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని గోవా సీఎం మనోహర్ పారికర్ అంటూ ఔదార్యం దాల్చడంతో వివాదం సద్దుమణిగింది. అయితే బికినీ-గోచీ పేచీ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించింది.