ఈవీలకు ‘హైబ్రిడ్’ దన్ను
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలతో హైబ్రిడ్ వాహనాలు పోటీపడటం కాకుండా వాటి విక్రయాలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రెండు రకాల కస్టమర్ల సెగ్మెంట్లు వేర్వేరుగా ఉంటున్నాయని పేర్కొంది. భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో.. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే హైబ్రిడ్లు, సీఎన్జీలు, బయోఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రాధాన్యం కొనసాగుతుందని వివరించింది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్హెచ్ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) ఒకదాని మార్కెట్‌ను మరొకటి ఆక్రమించకుండా, వేర్వేరు వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయి. ఎస్హెచ్ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రాల్లో బీఈవీల అమ్మకాలు కూడా పటిష్ట వృద్ధిని సాధించాయి. దేశంలోనే అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్హెచ్ఈవీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచి్చనప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్ఈవీ విక్రయాలకు సరిసమాన స్థాయిలో ఈవీల అమ్మకాల వృద్ధి నమోదైంది. ఎస్హెచ్ఈవీల విక్రయాలు, బీఈవీల అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఈ ధోరణితో తెలుస్తోంది‘ అని నివేదిక వివరించింది. ఎస్హెచ్ఈవీలను ప్రోత్సహిస్తే, ఈవీల విక్రయాలు తగ్గిపోతాయనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త మోడల్స్ రాకతో గత ఆరు నెలల్లో ఈవీల వినియోగం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.మరిన్ని ముఖ్యాంశాలు.. → గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.9 శాతంగా ఉన్న ఫోర్ వీలర్ ఈవీల విక్రయాలు, ఆఖరు త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగాయి. → మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో (పీవీ) ఎస్హెచ్ఈవీల వాటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతంగా ఉంది. → ధరకు తగ్గ విలువను అందించే విధంగా ఉంటే ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉంటున్నారు. విండ్సర్ కస్టమర్లు 7–8 ఏళ్ల తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయం గురించి ఆందోళన చెందకుండా ఎంజీ సంస్థ లీజింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం, రేంజి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంఅండ్ఎం తమ బీఈవీల్లో భారీ బ్యాటరీని అందించడం మొదలైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. → మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్), టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ప్రవేశపెట్టిన ఎస్హెచ్ఈవీలు 2023 అలాగే 2024 ఆర్థిక సంవత్సరాల్లో డీజిల్ వేరియంట్ల మార్కెట్ వాటాను ఆక్రమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వేరియంట్లు, హైబ్రిడ్ల వాటా స్థిరంగా నమోదైంది. → కొత్త మోడల్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సమీప భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనున్నాయి.