breaking news
Girls Rape
-
రేప్‌కు మరణదండన!
న్యూఢిల్లీ: 12 ఏళ్ల లోపున్న బాలికలపై అత్యాచారం చేసిన కేసులో దోషులకు మరణశిక్ష ప్రతిపాదిస్తూ బిల్లును కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.. ► 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారిపై రేప్‌కు పాల్పడి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష(జీవితఖైదుగా పొడిగించొచ్చు) లేదా మరణ దండన విధిస్తారు. సామూహిక అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష వేస్తారు. ► మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను జీవితఖైదుగా పొడిగించే వెసులుబాటు కల్పించారు. ► 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై రేప్‌కు పాల్పడితే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దీన్ని కూడా జీవితఖైదుగా మార్చొచ్చు. ► అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేయాలి. ► అప్పీళ్లను 6 నెలల్లోగా పరిష్కరించాలి. ► 16 ఏళ్ల లోపున్న బాలికపై రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్ జారీ చేయడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ► ఒకవేళ వారికి బెయిల్ మంజూరీపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, 15 రోజుల ముందే బాధితురాలి తరఫు లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆమోదం. ► చెరకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.20 పెంపు. దీంతో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నుంచి మిల్లులు రైతులకు క్వింటాలు చెరకుకు కనీసం రూ.275 చెల్లించాలి. ► జైలులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధ ఖైదీలకు కేంద్రం క్షమాబిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. శిక్షను కనీసం సగం పూర్తిచేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ అక్టోబర్ 2, వచ్చే ఏడాది ఏప్రిల్ 10, వచ్చే ఏడాది అక్టోబర్ 2న దఫాల్లో వారికి విముక్తి కలిగించనున్నారు. అయితే వరకట్న హత్యలు, అత్యాచారాలు, మనుషుల అక్రమ రవాణా, పోటా, టాడా, ఫెమా లాంటి తీవ్ర నేరాల్లోని దోషులకు ఈ పథకం వర్తించదు. ► మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో 81 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్ల సాయానికి అనుమతి. ► మైనారిటీ విద్యార్థులకు ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను 2020 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.5 వేల కోట్లకు వ్యయం కానుంది. -
అత్యాచారాల నియంత్రణకు ‘డ్రస్కోడ్’
ప్రభుత్వానికి బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడి సూచన బళ్లారి : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలికల డ్రస్‌కోడ్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు కుడితిని శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను ఆయన బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాలల్లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 90 శాతం విద్యార్థినిలకు మోకాళ్ల పైకి ఉన్న డ్రస్‌లను యూనిఫాంగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి డ్రస్‌లతో బెంచీలపై కూర్చొన్నప్పుడు విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థినిలపై అత్యాచారాలు నియంత్రణకు తక్షణమే డ్రస్కోడ్ మార్చాలని అన్నారు. 1 నుంచి కాలేజీ వరకూ విద్యనభ్యసించేందుకు వెళ్లే అమ్మాయిలు విధిగా చూడీదార్, చున్నీ వేసుకుని వెళ్లేలా డ్రస్కోడ్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించిన వారిలో జేడీఎస్ నాయకులు తాయణ్ణ, సోమలింగనగౌడ తదితరులు ఉన్నారు.