breaking news
Gidugu Rammurthy
-
Telugu Language Day: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్వాకం, నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహం పెంచుకుంటున్నారు. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మా రాయి. ఫలితంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదైపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు ఊతమిచ్చిన తెలంగాణ భాష ప్రత్యేకమైనది. ఆ భాషకు న్న శక్తితోనే కవులు, రచయితలు అందించిన సాహిత్యం ఉద్యమానికి చైతన్యం తీసుకువచ్చింది. తెలంగాణ భాష పదజాలం పౌరుషాన్ని, రోషాన్ని నింపి రాష్ట్ర సాధన వరకు వెన్నుదన్నుగా నిలిచిన మన అమ్మ భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. సదాస్మరణీయుడు.. తెలుగుభాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు సదాస్మరణీయం. తెలుగు భాషలో గ్రాంథిక వాదానికి స్వస్తి చెప్పి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన భాషోద్యమకారుడాయన. గిడుగు జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. 1913లో వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగా లని ఆనాటి మద్రాస్ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. తెలుగు–సవర, ఇంగ్లిష్–సవర నిఘంటువులను, గద్య చింతామణి, వ్యాసావళి, నిజమైన సంప్రదాయం మొదలగు గ్రంథాలు ఆయన కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగు ప్రయత్నం ప్రశంసనీయం. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అ ప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ధ ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషాసంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన ఆయన 1940 జనవరి 22న స్వర్గస్తులయ్యారు. తెలుగును పరిరక్షించాలి ఉన్నత తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే జ్ఞానార్జన, ఆలోచనాశక్తిని, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ప్రభుత్వం కూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు నిత్యనూతనమై విరాజిల్లుతుంది. – దాస్యం సేనాధిపతి, కవి, రచయిత, సాహితీ విమర్శకులు మాతృభాష వైపు మళ్లాలి ప్రపంచీకరణ ప్రభావంతో మన భాషా సంస్కృతులను పరిరక్షంచుకునే ఆత్మరక్షణలో పడ్డాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఆంగ్ల భాష వ్యామోహంలో నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరం తెలుగు భాషను కాపాడున్నవారం అవుతాం. ఆ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. – కేఎస్.అనంతాచార్య, కవి, రచయిత చదవండి: మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె -
మన ఇంట్లో భాష ఎలా ఉంది?
అమ్మ కడుపు నుంచి శిశువు మాతృభాషను వింటుంది. బడిలో చదువుతుంది. కాని ఆ భాషను తన భాషగా ఎప్పుడు చేసుకుంటుంది? ఎలా ఆస్వాదిస్తుంది? ఇంట్లో అమ్మమ్మలు సామెతలు చెబుతారు చలోక్తులు విసురుతారు. నానమ్మలు కథలు చెబుతారు. కథల పుస్తకాలు భాష ద్వారా ఊహను పంచుతాయి. సాహిత్యం మెల్లగా సంస్కారం అలవరుస్తుంది. బతకడానికి ఇంగ్లిష్. జీవించడానికి తెలుగు. పిల్లల తెలుగు కోసం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసి, కేబుల్ కనెక్షన్... ఇవి అవసరమే. కాని పిల్లల కళ్లకు రోజూ తెలుగును కనిపించేలా చేసే ఒక దినపత్రిక అవసరం అని చాలామందిమి అనుకోము. ఇంటి అల్మారాలో ఒక తెలుగు పుస్తకం అన్నా ఉంటే వారికి తెలుగు భాష పట్ల ఆసక్తి ఏర్పడుతుందని అనుకోము. ఇంగ్లిష్ మీడియంలో చేర్పించడం, ఇంగ్లిష్ భాష ప్రావీణ్యం ఎలా ఉందో గమనించడం... ఇవి అవసరమే. భవిష్యత్తులో ఉపాధి వేదికలను పెంచుకోవడానికి ఆ పని చేయాల్సిందే. కాని అలాగని ఇంటి భాషను, తల్లిభాషను ఇంటి వేదికగా పిల్లల్లో పాదుకునేలా ఏ మాత్రం చేయగలుగుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు తప్పక ప్రశ్నించుకోవాలి. అమ్మ అన్న పిలుపు ప్రతి తెలుగు శిశువు పలికే తొలి తెలుగు శబ్దం ‘అమ్మ’. అక్షర మాలలో అ అంటే అమ్మ అనే కదా నేర్పిస్తారు. శిశువుకు అమ్మ ద్వారా తెలుగును నేర్చుకునే హక్కు ఉంది. తల్లికి తన ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకు ఏ భాష అయినా నాలుగు విధాలుగా వస్తుంది. 1.మాట్లాడటం 2.వినడం 3. చదవడం 4.రాయడం... ఈ నాలుగింటిలో పిల్లలు ఏవి ఎంత బాగా అభ్యాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి చేయకపోయినా భాష పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ నాలుగు జరగడంలో ఇంటి బాధ్యత విస్మరించి ‘మా పిల్లలకు తెలుగే రావడం లేదని’ అనుకోవడం నింద ఎవరో ఒకరి మీద వేయాలనుకోవడం సరి కాదు. ‘సబ్జెక్ట్స్’ స్కూల్లో నేర్పిస్తారు. తెలుగు కూడా ఒక ‘సబ్జెక్ట్’గా స్కూల్లో నేర్పుతారు. కాని భాష దాని జీవంతో అనుభూతితో అందంతో పిల్లలకు రావాలంటే ఇంటి మనుషులు, ఇంటి పరిసరాల వల్లే ఎక్కువగా సాధ్యం. పదం... పద్యం.. తెలుగు పదం.. తెలుగు పద్యం పిల్లలకు ఇంట్లో అలవాటు చేయడం గతంలో ఉండేది. వేమన పద్యాలు, సుమతి శతకం, పెద్దబాలశిక్ష చదివించడం, దేశభక్తి గేయాలు నేర్పించడం, పొడుపు కతలు, సామెతలు, పిల్లల పాటలు... ఇవి భాషను వారిలో గాఢంగా పాదుకునేలా చేసి ‘మన తెలుగు’ అనిపిస్తాయి. ఇవాళ్టి పిల్లలు ‘చందమామ రావే’ వినడం లేదు... ‘వీరి వీరి గుమ్మడిపండు’ ఆడటం లేదు. ప్లేస్కూల్లో ‘జానీ జానీ ఎస్ పాపా’ నేరుస్తున్నారు కాని ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ చెవిన వేసుకోవడం లేదు. చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టిందో లేదోగానీ తెలుగు భాష మీద పిల్లలకు ఉండాల్సిన ఇచ్ఛను అమ్మ (నాన్న) కొట్టకుండా చూసుకోవాలి. పత్రికలను పట్టించుకోని నిర్లక్ష్యం గతంలో నాన్నలు పిల్లల కోసం మిఠాయి కొనుక్కుని దాంతో పాటు మార్కెట్లోకి తాజాగా వచ్చిన ‘చందమామ’ సంచికను కొనుక్కొని వచ్చేవారు. ఆ స్తోమత లేకపోతే పక్కనే ఉన్న అద్దె పుస్తకాల షాపు నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటివి తెచ్చి పిల్లలకు ఇచ్చేది అమ్మ . ‘రాకుమారుడు’, ‘మాంత్రికుడు’, ‘ముసలవ్వ’, ‘యోజనం’, ‘క్రోసు’, ‘పురం’, ‘బాటసారి’, ‘సత్రం’... ఇలాంటి పదాలతో కథలు చదువుతూ పిల్లలు భాషలోకి అడుగుపెట్టేవారు. భాష అంటే ఏమిటి? అది ఒక విలువను పాదుకునేలా చేసే మాధ్యమం. కథ చదివితే భాష వస్తుంది. బోనస్‌గా ఆ భాషతో పాటు జీవన విలువ, పాటించాల్సిన నీతి అలవడుతుంది. కాని తెలుగు సమాజం పిల్లల పత్రికల పట్ల చాలా నిర్లక్ష్యం వహించి నేడు అవి దాదాపుగా లేకుండా చేసే స్థితికి తెచ్చింది. పిల్లలు కథ ‘వింటే’ కథ ‘చెప్తారు’. కథ ‘చదివితే’ కథ ‘రాస్తారు’. ఈ విని, చెప్పి, చదివి, రాసే విధానాలను అలవర్చే పత్రికలు నేడు లేవు. దినపత్రికలు కొంతలో కొంత ఆ లోటును పూడుస్తున్నాయి. పిల్లలకు అందుకోసమని పత్రికలను చదవడం అలవాటు చేయాలి. కొన్ని తెలుగు భాషకు సంబంధించిన వెబ్సైట్లు బాల సాహిత్యాన్ని ఇస్తున్నాయి. అవి చదివించాలి. ఏ భాష చెవిన పడుతోంది? ఇంట్లో పిల్లలు వింటున్నది టీవీ భాష, సినిమా భాష మాత్రమే. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటల నుంచి నేర్చే పద సంపద పెద్దగా ఉండదు. ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే భాషకు ఉండే ధ్వని, రుచి పిల్లలకు తెలుస్తుంది కాని ఇవాళ చాలా ఇళ్లల్లో పెద్దలు ఉండటం లేదు. కనుక సీరియల్స్ భాష, వెకిలి కామెడీ షోల భాష పిల్లలకు వస్తోంది. ఈ భాష వ్యక్తిత్వ పతనానికి తప్ప నిర్మాణానికి పనికి రాదు. భాషా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే మాతృభాష సరిగా వచ్చినవారికే అన్య భాషలు సరిగా వస్తాయి అని. మాతృభాషను బాగా నేర్చుకున్న పిల్లలు ఇంగ్లిష్ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. ఆ గొప్పదనం ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. మాతృభాష నుంచి అందే గొప్ప బలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం లేదా దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. -
గిడుగు రామ్మూర్తికి అక్షర నివాళి
మారీసుపేట: వ్యవహరిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడ్డుగు రామ్మూర్తి చిత్రాన్ని ‘అ’ నుంచి ‘ఱ’ వరకు వరుస క్రమంలో క్రమబద్ధంగా రాస్తూ చిత్రించినట్లు తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు ఫణీదపు వెంకటకృష్ణ ఆదివారం చెప్పారు. 11 అంగుళాల ఎత్తు, 10 అంగుళాల వెడల్పు ఉన్న చిత్రాన్ని రెండు గంటల్లో చిత్రించినట్లు తెలిపారు.