breaking news
Gharshana
-
ప్రముఖ నటుడు 'డేనియల్ బాలాజీ' కన్నుమూత
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. డేనియల్ బాలాజీ ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే నటించాడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించిన డేనియల్.. తెలుగులో సాంబ, ఘర్షణ,చిరుత,టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. కమల్ హాసన్ విడుదల కాని సినిమా 'మరుదనాయగం' సెట్స్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా బాలాజీ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. (ఘర్షణ సినిమాలో వెంకటేశ్‌తో) బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ ధారావాహిక 'చితి' , అక్కడ అతను 'డేనియల్' అనే పాత్రను పోషించాడు. 'పిన్ని' పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్‌గా అయ్యింది. ఈ సీరియల్ హిట్ అయిన తర్వాత, అతని రెండవ ధారావాహిక 'అలైగల్'లో , దర్శకుడు సుందర్ K. విజయన్, 'చితి'లో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి 'డేనియల్ బాలాజీ' అని పేరు పెట్టారు . (బిగిల్ సినిమా సెట్స్‌లో విజయ్‌తో డేనియల్) డేనియల్ బాలాజీకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి.. కాగా తల్లి తమిళ్ కుటుంబానికి చెందిన వారు. డైరెక్టర్ కావాలని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్‌మీనన్‌తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది. గద్దలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అథర్వ మురళితో బంధుత్వం ఉంది. డేనియల్ అమ్మగారి నుంచి అథర్వతో బంధుత్వం ఉంది. 👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు) -
సీక్వెల్ మీద సీక్వెల్
డీసీపీ రామ్‌చందర్ మళ్లీ వస్తే? రాఘవన్ మళ్లీ కనిపిస్తే? సత్యదేవ్ మళ్లీ సందడి చేస్తే ఎంత బాగుండు అని ఆ క్యారెక్టర్స్‌ని ఇష్టపడినవాళ్లు అనుకోవడం సహజం. ‘ఘర్షణ’లో వెంకటేశ్ చేసిన స్టైలిస్ పోలీస్ క్యారెక్టర్ పేరు రామ్‌చందర్ అనీ, ‘రాఘవన్’లో కమల్‌హాసన్ పాత్ర పేరు రాఘవన్ అనీ, ‘ఎంతవాడు గానీ’లో అజిత్ పేరు సత్యదేవ్ అనీ గుర్తుండే ఉంటుంది. మంచి హిట్ సాధించిన ఈ చిత్రాలు, ఆ పాత్రలనూ మరచిపోలేం. అందుకే గౌతమ్ మీనన్ మళ్లీ ఈ క్యారెక్టర్స్‌ని కొనసాగించాలనుకుని ఉంటారు. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఘర్షణ’ తమిళ ‘కాక్క కాక్క’కు రీమేక్. అందులో సూర్య హీరో. అలాగే కమల్ ‘వేటై్టయాడు విలైయాడు’ తెలుగులో ‘రాఘవన్’గా, అజిత్ ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో అనువాదమయ్యాయి. తమిళంలో ఈ మూడు చిత్రాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు గౌతమ్. ఇవి డబ్బింగ్ రూపంలోనో లేక తమిళ్‌తో పాటు తెలుగులో కూడా నిర్మిస్తే టాలీవుడ్ ప్రేక్షకులూ చూడొచ్చనుకోండి. ‘‘ముందు ‘ఎన్నై అరిందాల్’ సీక్వెల్ స్క్రిప్ట్ తయారు చేసి, అజిత్‌ను అప్రోచ్ అవుతాను’’ అన్నారు గౌతమ్. యాక్చువల్లీ ఈ మూడు హై వోల్టేజ్ పోలీస్ స్టోరీలు ఒక పోలీసాఫీసర్ లైఫ్‌లో వివిధ దశల్లో జరిగే కథలని, ఈ మూడు సినిమాలు ఒక ట్రయాలజీ అని, ఎన్నై అరిందాల్‌తో ఈ ట్రయాలజీ ముగుస్తుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్. మరి.. వీటి సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేశారు? అన్నది తెలియాల్సి ఉంది. -
సవతి సోదరుల మధ్య ఘర్షణ.
పూర్వం ధర్మం ప్రకారం, అంటే అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, సంఘం అంగీకారంతో చేసుకునే భార్యను ‘ధర్మపత్ని’ అనేవారట. ధర్మపత్ని అంటే మొదటి భార్య అని అర్థం. భర్త శారీరక, మానసిక అవస్థలపై ఆస్తులపై అధికారాలపై ఈమెకే సగభాగం దక్కుతుంది. ఈమె పిల్లలే వారసులు అవుతారు. అధికారిక హక్కుదారులు అవుతారు. రెండవ భార్యకు ఈ హక్కు ఉండదు. ఆమె సంతానానికీ ఉండదు. దశరథుడి ధర్మపత్ని కౌసల్యకు పుట్టిన రాముడే అయోధ్యకు వారసుడు. కాదని కారడవులకు పంపడం వల్లే రామాయణం జరిగింది. తండ్రి మీద హక్కు కోసం లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నడు పోరాడలేదు. కాని ‘ఘర్షణ’లో కార్తిక్ పోరాడాడు. రెండవ భార్య సంతానం కావడం వల్ల తండ్రి పేరును తన పక్కన పెట్టుకోవడానికి పోరాడాడు. తండ్రిని అతనే నా తండ్రి అని చెప్పుకోవడానికి పోరాడాడు. నీకే కాదు నాకూ హక్కు ఉంది అని మొదటి భార్య కుమారుడితో చెప్పడానికి పోరాడాడు. ఘర్షణ కథ ఇద్దరు సవతి సోదరుల మధ్య నడిచిన కథ. ఇలాంటి కథ భారతీయ సినిమాలలో ఇదే మొదటిది. చాలా ఇబ్బందిగా ఉంటుంది– రెండవ భార్య కుమారుడితో ‘నువ్వు పెద్ద భార్య కుమారుడివా?’ అని అడిగితే. చాలా ఇరకాటంగా ఉంటుంది– మొదటి భార్య కుమారుడితో ‘మీ నాన్నకు ఇంకో భార్య ఉందట కదా’ అని అడిగితే. సంఘం ఒక భార్య–ఒక భర్తనే అంగీకరిస్తుంది. చట్టాన్ని ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నా, రెండో ఇల్లు పెట్టినా వ్యక్తిగతంగా బాగానే ఉండొచ్చు కానీ సంఘప్రకారం అది తప్పు అవుతుంది. మీ నాన్న తప్పు చేశాడు... మీకు దక్కవలసిన ప్రేమను మరొకరి ద్వారా కలిగిన సంతానానికి పంచాడు అనే భావన ఏదో ఈ సినిమాలో విజయకుమార్ కుమారుడిగా వేసిన ప్రభు మనసులో ఉంది. అలాగే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు సంఘపరమైన మర్యాద ఇవ్వలేకపోయాడు. ఆమె కూడా నా భార్యే అని లోకానికి ధైర్యంగా చెప్పలేకపోయాడు. మమ్మల్ని తన పిల్లలుగా చేయి పట్టుకుని నలుగురి మధ్యలో నడిపించలేకపోయాడు. మాకు ఉంపుడుగత్తె పిల్లలు అనే హోదాను ఇచ్చాడు అనే భావన విజయకుమార్ రెండో భార్య జయచిత్రకు పుట్టిన కార్తిక్ మనసులో ఉంది. ప్రభు, కార్తిక్ ఇద్దరూ మంచి వయసులో ఉన్న కుర్రవాళ్లు. ఆ వయసులో ఉండే ఉత్సాహం, హుషారు వారిలో ఉండవు. ఇద్దరూ అశాంతితో రగలిపోతుంటారు. ప్రభు కార్తిక్‌ను యాక్సెప్ట్ చేయడు. ప్రభును కార్తిక్ తన సోదరుడిగా గౌరవించడు. ఇద్దరి మధ్యా ఘర్షణ. చాలా పెద్ద ఘర్షణ. మనిషి ఇన్స్టింక్స్ చాలా బలంగా ఉంటాయి. నాది అనే భావన సకల జీవరాశుల్లో ఉంటుంది. ప్రభు, కార్తిక్‌ల మధ్య ఘర్షణకు కారణం వారికి తండ్రి మీద ఉన్న గొప్ప ప్రేమకు ప్రచ్ఛన్నరూపం అనిపిస్తుంది. ఆ తండ్రి పెద్ద ప్రభుత్వ అధికారి. చాలా మంచివాడు. ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా భార్యతో, కుమారుడితో చాలా బాగా ఉంటాడు. అలాంటి తండ్రి మాకు మాత్రమే ఉండాలని పిల్లలు అనుకుంటారు. ప్రభు, కార్తిక్‌లు కూడా అనుకొని ఉండొచ్చు. కాని ప్రతి రోజూ ఆ తండ్రి ఏకకాలంలో రెండు ఇళ్లలోనూ ఉండలేడు కదా. ఇక్కడ కొన్నిరోజులు ఉంటే అక్కడివాళ్లకు కోపం. అక్కడ కొన్నిరోజులు ఉంటే ఇక్కడి వాళ్లకు చిన్నతనం. దీని మధ్య అతడు నలుగుతుంటాడు. ఒకటి మాత్రం వాస్తవం. పెద్ద భార్య ఇంట్లో అతడికి పూర్తి స్వేచ్ఛ లేదు. కిటికీలు మూతబడి గాలాడని భావన. అందుకే అతడు కాసింత ఓదార్పు కోసం, రెండో భార్య ఇంటి నడవలో, తులసి కోటకు కాసింత దూరంలో చేరగిలపడి, ఒక వైపు వాన కురుస్తుంటే మరో వైపు భార్య ఆమ్లెట్ తెచ్చి పెడుతుంటే సకల మర్యాదలు వదిలి హాయిగా కాసింత మందు బిగించే స్వేచ్ఛ కోసం అక్కడికి వస్తుంటాడు. నిజానికి అతడి స్వార్థం అతడు చూసుకున్నాడు కాని ఆ భార్యకు పుట్టిన, ఈ భార్యకు పుట్టిన పిల్లల మధ్య సఖ్యత ఉందా లేదా చూసుకోలేకపోయాడు. ఆ సఖ్యత కోసం అతడు ఆ తర్వాత ధైర్యంగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ప్రయత్నించే సమయం వచ్చేసరికి ఇరు పక్షాల్లో ఘర్షణ చోటు చేసుకుని ఉంది. ప్రభు పోలీస్ కమిషనర్ అయ్యి కార్తిక్‌ను సిల్లీ కారణాల్లో అరెస్ట్ చేసేవరకు వెళతాడు. కార్తిక్ తన ఫ్రెండ్స్‌తో పెద్ద భార్య ఇంటికి వెళ్లి రాళ్లు విసిరి అద్దాలు పగలగొడతాడు. రోడ్డున పడి కొట్టుకునే ఈ అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు. తల్లులు వేరైనందుకు శతృవులయ్యారు. మేమూ మేమూ ఉన్నప్పుడు మేము పాండవులం. వారు కౌరవులు. కాని బయటి నుంచి శతృవు వస్తే మేము నూటైదు మంది అన్నదమ్ములం అన్నాడు ధర్మరాజు. బయటి శతృవు వచ్చినప్పుడు రక్తం చేసే చాలనం చిత్రంగా ఉంటుంది. తన రక్తాన్ని తాను గుర్తించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రక్తబంధం అంటారు. ఈ సినిమాలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న విలన్ మీద ఒన్ మేన్ కమిషన్‌గా విజయకుమార్ బాధ్యతలు తీసుకుంటాడు. ఫలానా తేదీ లోపల కమిషన్ రిపోర్ట్ అప్పగించాలి. ఆ విలన్ దోషి అని కమిషన్ తేల్చితే వెంటనే అతడు జైలుకు వెళతాడు. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి విజయకుమార్‌ను విలన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటాడు. కాని విజయకుమార్ స్ట్రిక్ట్ కనుక మాట వినడు. దాంతో విజయకుమార్నే చంపించే పనికి విలన్ దిగుతాడు. ఈ సంగతి అన్నదమ్ములకు తెలుస్తుంది. బయటి నుంచి ఎవరూ రానంత వరకే వారు సవతి సోదరులు. వచ్చాక సొంత అన్నదమ్ములు. తండ్రిని కాపాడటానికి ఇద్దరూ రంగంలో దిగుతారు. విలన్‌ను ఎదుర్కొని తండ్రిని కాపాడుకుంటారు. ఘర్షణలో శాశ్వతత్వం లేదు. శాంతిలోనే ఉంది. విడి చేతులలో బలం లేదు. చేతులు కలిపితేనే బలం. ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఒక్కటయ్యారు. తండ్రి ఒకడే. తల్లులు వేరు. కాని అమ్మా అని పిలిస్తే ఏ తల్లి అయినా ఒకటే కదా. ఈ కుటుంబం ఇప్పుడు సమష్టిగా మారడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అనుబంధాలు విరిసేను.. పన్నీరు చిలికేను... వెరీగుడ్ మణి. అగ్నినక్షత్రం ‘నాయకుడు’ వంటి ఎపిక్ తీశాక మణిరత్నం 1988లో నెరేషన్‌ను, ఎమోషన్‌ను మిళితం చేసుకుంటూ తేలిక పద్ధతిలో చెప్పిన కథ ‘అగ్నినక్షత్రం’. తెలుగులో ‘ఘర్షణ’గా డబ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. సవతి సోదరుల మధ్య ఘర్షణ ఉంటుంది అనే చిన్న పాయింట్ తప్ప కథంటూ ఏమీ లేని ఈ సినిమా కేవలం సంఘటనల వరుస ద్వారా సమ్మోహితం చేస్తుంది. ప్రభు జీవితంలో కొన్ని సంఘటనలు, ప్రేమ, కార్తిక్ జీవితంలోని కొన్ని సంఘటనలు, ప్రేమ వీటి మధ్యలో అక్కడక్కడా ఘర్షణ చూపిస్తూ మంచి పాటలతో సినిమాను ముగిస్తాడు దర్శకుడు. ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఇందులోని ఇళయరాజా పాటలకు, పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫీకి ప్రేక్షకులు మోహాశ్చర్యాలకు లోనయ్యారు. పి.సి.శ్రీరామ్ చేసిన మెరుపు లైటింగ్ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలను వెంటాడింది. ఇందులోని ‘రాజా రాజాధి రాజా’ పాటలో ప్రభుదేవా గ్రూప్డాన్సర్గా కనిపిస్తాడు. ‘ఒక బృందావనం సోయగం’ పాట చిత్రలహరిలో కొన్ని వందలసార్లు ప్లే అయ్యింది. ఈ సినిమా నిరోషాకు తొలి సినిమా. అరుపులు, కేకలు, విగ్గుల విలన్ హయామ్లో చాలా మామూలు పెద్ద మనిషిగా ‘ఏం రాజా’ అని ఆత్మీయంగా పిలిచే విలన్ (మద్రాసులో ఆనంద్ థియేటర్ ఓనర్ జి.ఉమాపతి) కనిపించడం చాలా కొత్త. ఈ విలనీని ‘కర్తవ్యం’లో పుండరీ కాక్షయ్యకు వాడారు. ఈ సినిమాలో భార్య నాగమణి ఊరెళితే ఎగిరి గంతేసి పండగ చేసుకునే జనకరాజ్ క్యారెక్టర్ ఎంత హిట్టయ్యిందంటే ఇప్పటికీ జన సామాన్యంలో భార్య ఊరెళ్లిందని చెప్పడానికి ‘నాగమణి లేదు’ అనడం కద్దు. స్లో మోషన్లో ప్రభు, కార్తీక్ కోపంగా క్లోజప్‌లో ఒకరినొకరు చూసుకునే షాట్స్‌ను ఆ తర్వాత చాలా సినిమాల్లో అనుసరించారు. ఘర్షణ చాలావాటికి ట్రెండ్ క్రియేట్ చేసింది. అది నిజమైన ట్రెండ్ సెట్టర్. – కె నిరోషా, పి.సి. శ్రీరామ్, జనకరాజ్, మణిరత్నం -
మణిరత్నం క్లాసిక్‌లో ఛాన్స్ కొట్టేశాడు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయి.., ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటుడు హర్షవర్థన్ రాణే. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో లీడ్ రోల్లో నటించిన ఈ మ్యాన్లీ హీరో, స్టార్ ఇమేజ్ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ఓ గోల్డెన్ ఛాన్స్ రాణేను వెతుక్కుంటూ వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన క్లాసిక్ ఘర్షణ. ఇప్పుడు ఈ సినిమాను బెజోయ్ నంభియార్ దర్శకత్వంలో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ చేసిన పాత్రకు తమిళ స్టార్ ధనుష్‌ను ఎంపిక చేయగా.. తాజాగా ప్రభు పాత్రకు హర్షవర్థన్ రాణేను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాతో అయినా హర్షవర్ధన్ రాణేకు బ్రేక్ వస్తుందేమో చూడాలి. -
మరోసారి రీమేక్ అవుతున్న క్లాసిక్
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ఘర్షణ. తమిళ్లో అగ్ని నచ్చతిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అంతేకాదు 200 రోజులు పాటు ఆడిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అదే సినిమాను వన్ష్ పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. విక్కీ కౌశల్, హర్షవర్థణ్ రాణేలు హీరోలుగా బెజాయ్ నంభియార్ దర్శకత్వంలో ఘర్షణ సినిమా మరోసారి రీమేక్ అవుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వాజీర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బెజాయ్, ఘర్షణ రీమేక్ తో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. పాతికేళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన ఘర్షణ ఈ తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుదో చూడాలి.