ఈద్‌కు అమ్మీ తోఫా
అచ్చ తమిళంలో 'అమ్మా..' అని పిలిచినా, ఉర్దూ, హిందీల్లో 'అమ్మీ..'అన్నా ఇట్టే కరుణించి వరాలు కురిపించే పురచ్చితలైవి జయలలిత తమిళనాడులోని ముస్లింలకు ఖీర్ తిన్నంత తీపికబురు చెప్పారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసం మొత్తం మసీదులకు ఉచితంగా బియ్యం సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
వక్ఫ్ బోర్డు గుర్తింపు పొందిన 3000 మసీదులకు రంజాన్ మాసంలో ఉచిత బియ్యం పపిణీకి చర్యలు తీసుకోవాలని గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. 2001లో ఏఐడీఎంకే అధికారంలో వచ్చాక ఈ పథకం ప్రారంభమైంది. రంజాన్ మాసంలో మసీదులకు నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు, గట్టి బందోబస్తు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.