వచ్చేస్తోంది.. నాలుగేళ్ల డిగ్రీ
మంచిర్యాల సిటీ : ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలు చేయనుంది. దీంతో ఇంతకాలం మనుగడలో ఉన్న మూడేళ్ల డిగ్రీ కోర్సు కనుమరుగు కానుంది. ఇటీవల నిర్వహించిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుం ది.
ఇప్పటివరకు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల కాల వ్యవధి మూడేళ్లుగా ఉంది. 2015-16 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను నాలుగేళ్లపాటు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. కరిక్యులం రూపకల్పనకూ వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఈడీ, ఎంఈడీ ఏడాది కోర్సులను కూడా రెండేళ్లకు పెంచుతూ ఈపాటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాలవ్యవధి పొడిగింపు ఎందుకంటే..
మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను నాలుగేళ్లకు పొడిగించడం వెనుక విద్యాప్రమాణాల పెంపే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులే ఉన్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులతో విదేశాలకు ఉద్యోగానికి వెళ్లిన మన విద్యార్థులు ప్రతిభా పరీక్షల్లో వెనుకబడిపోతున్నారు.
బీకాం డిగ్రీ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది. అయితే ఇలాంటి ఉపాధినిచ్చే మూడేళ్ల డిగ్రీ కోర్సుతో మన విద్యార్థులు ముందుకెళ్లలేకపోతున్నారు. మూడేళ్ల సైన్స్ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల రెగ్యులర్ పీజీ కోర్సులోని ఒత్తిడిని తట్టుకోలేక రాణించలేకపోతున్నారు. ఒకవేళ పీజీ కోర్సులో బయట పడినా పీహెచ్‌డీకి దూరమవుతున్నారు.
విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చదివినవారు కానరావడం లేదు. పీహెచ్డీ పూర్తిచేసిన వారిని డిగ్రీ అధ్యాపకులుగా, సహాయక ప్రొఫెసర్లుగా నియమించుకుందామంటే.. యూనివర్సిటీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చదివినవారు దొడ్డి దారిన ఉద్యోగం, పదోన్నతులు పొందుతున్నారు. దూర విద్య ద్వారా డిగ్రీ చదివిన వారికి న్యాయవిద్య కోర్సుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో ఈ సమస్యలకు కొంత చెక్ పడనుంది. అంతేకాకుండా నిరుద్యోగుల సంఖ్య వేగంగా పెరగడానికి అవకాశం ఉండదు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థి మాత్రమే నాలుగేళ్లపాటు కళాశాలలో ఉంటాడు. తట్టుకోలేని విద్యార్థి మధ్యలోనే మానేసే అవకాశాలు ఉన్నాయి.
పరిశోధనలకు అవకాశం
ఇంజినీరింగ్ నాలుగేళ్లు, వైద్య విద్య ఐదేళ్లు, బీకాం, బీఎస్సీ(ఆనర్స్) నాలుగేళ్లు చదవాలి. ఈ కోర్సులన్నింటికీ చివరి సంవత్సరంలో ప్రాజెక్టు కోర్సు(పరిశోధన) తప్పనిసరి ఉంటుంది. మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ఏ ప్రాజెక్టు ఉండదు. దూరవిద్య ద్వారా అనేక మంది డిగ్రీ పట్టాతో ముందుకొస్తున్నారు. త్వరలో అమలుకానున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో చివరి ఆరు నెలలు ప్రాజెక్టు కోర్సుగా అమలు చేయనుండడంతో పీజీ, పీహెచ్‌డీలో విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారవుతారు. పైకోర్సుల్లో వారిపై ఒత్తిడి ఉండదు. డిగ్రీలో పరిశోధనలకు అవకాశం ఉంటే ఇంజినీరింగ్ విద్యార్థులతో సమానంగా రాణిస్తారనేది కేంద్రం ఆలోచన.