breaking news
foodies in hyderabad
-
రంజాన్: నోరూరిస్తున్న వంటలు.. జోరందుకున్న పాయాషోర్వా
సాక్షి,చార్మినార్: రంజాన్ మాసంలో వంటలు నోరూరిస్తున్నాయి. పాతబస్తీలో సాధారణ రోజుల్లో లభించే నాన్కీ రోటి, పాయాషోర్వా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో వీటిని విక్రయించే హోటళ్లు అధికంగా ఉంటాయి. దీంతో ఈ వంటకం కోసం క్యూ కడుతున్నారు. పాతబస్తీ సంస్కృతికి ఆచార వ్యవహారాలకు నాన్కీ రోటి గుర్తుగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే తినేవారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు లొట్టలేసుకొని మరీ తింటున్నారు. సాధారణ రోజుల్లో చాలా ముస్లిం కుటుంబాలు ఉదయం లేవగానే బ్రేక్ పాస్ట్‌లో నాన్కీ రోటిని పాయాషోర్వాతో కలిపి తింటారు. ► ఎలాంటి మసాలా దినుసులు, నూనె పదార్థాలు వాడకుండా కేవలం మైదా పిండితో తయారవుతుండటంతో పేదవారి దగ్గర నుంచి సంపన్న వర్గాల వరకు అందుబాటులో ఉంటుంది. ► పర్షియా భాషలో రోటిని ‘నాన్’ అంటారు. 400 ఏళ్ల క్రితమే ఈ వంటకం మనకు అలవాటైంది. ఇరాన్, టర్కీ దేశాలకు చెందిన ఈ ‘డిష్’ అరబ్బు దేశాల నుంచి మన దేశానికి వ్యాపించింది. ► ఎముకలకు బలాన్నిచ్చే పోషక విలువలు అధికంగా ఉండటంతో పాతబస్తీ ప్రజలు ఇష్టంగా తింటారు. ఇక్కడి ప్రముఖ హోటళ్లలో తెల్లవారు జామున 4 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. -
ఫుడీస్ డే అవుట్
ఫుడ్ లవర్స్ అంతా ఒకే చోట చేరి.. వారికి నచ్చిన వెరైటీలను... మెచ్చిన స్పాట్లో వేడివేడిగా లాగించేశారు. ఎప్పుడూ ఫేస్బుక్లో తమ అభి‘రుచు’లను పంచుకున్న ‘ఫుడీస్ ఇన్ హైదరాబాద్’ కమ్యూనిటీ తొలిసారి కలుసుకుని రియల్‌గా టేస్ట్స్ను ఆస్వాదించారు. కొండాపూర్ అనంతర ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ‘ఫస్ట్ ధమాకా’ పేరుతో ఇష్టమైన రుచులను ఓ పట్టు పట్టారు. వీరి కోసం మొత్తం 38 వెరైటీలను సిద్ధం చేసింది రెస్టారెంట్. మూడు వేల మంది సభ్యులున్న ఈ కమ్యూనిటీ అడ్మిన్ రవికాంత్‌రెడ్డి మాట్లాడుతూ... నగరంలోని ఫుడ్ లవర్స్ కోసం ఇకపై ఇలాంటి గెట్ టుగెదర్లు నెలకు రెండు ఏర్పాటు చేస్తామన్నారు. ఒకే అభిరుచి ఉన్నవారంతా ఇలా ఒకేచోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -సాక్షి, సిటీ ప్లస్